అమ్మకానికి కరోనా కిట్లు

ABN , First Publish Date - 2021-04-21T06:24:11+05:30 IST

స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా కిట్లను అమ్మకానికి పెట్టేశారు.

అమ్మకానికి కరోనా కిట్లు
కరోనా పరీక్ష కేంద్రం సిబ్బందిని నిలదీస్తున్న బాధితులు

అమ్మకానికి కరోనా కిట్లు

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కేటుగాళ్లు

జనం భయాన్ని కాసులుగా మార్చుకుంటున్న వైనం

రూ.500 నుంచి రూ.1,500 వసూలు

అడిగినంత చెల్లించుకుంటున్న విమాన, రైలు ప్రయాణికులు

పేదలు రోజూ ఆసుపత్రికి వస్తున్నా ఫలించని యత్నం

పట్టించుకునేవారు లేక సామాన్యుల అవస్థలు

గుంతకల్లు, ఏప్రిల్‌ 20: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా కిట్లను అమ్మకానికి పెట్టేశారు. అధికార పార్టీ అని చెప్పుకుంటూ గుంతకల్లులో కొందరు హవా నడిపించేస్తున్నారు. కరోనా పరీక్ష కోసం పొద్దననగా వచ్చి మధ్నాహ్నం 12 గంటల వరకు వేచిచూసి కిట్లు లేవంటే పేద జనం ఉసూరుమనుకుంటూ వెనక్కు వెళ్తున్నారు. డబ్బున్న బాబులు మాత్రం మధ్యవర్తుల ద్వారా దర్జాగా పరీక్షలు చేయించుకుని వెళుతున్నారు. మూడు రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించగా పరీక్షల కోసం రోజూ తిరుగుతున్నా వెనక్కు పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రిలోని ఓ సెక్యూరిటీ గార్డు కూడా ఇందులో భాగమై జేబులు నింపుకుంటున్నాడని పరీక్షలకు వచ్చినవారు ఆరోపిస్తున్నారు. ప్రాణాంతకమైన వ్యాధితో ఎక్కడ ఉసురు పోతుందోనన్న భయాందోళనలతో వచ్చే వారి నుంచి డబ్బు దండుకుంటున్న అమానవీయమైన కార్యక్రమం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతోంది. ఈ తతంగమంతా వైద్యులకు తెలిసినా ఏమీ చేయలేని దుస్థితి వారిని వెంటాడుతోంది. 




ఇంట్లో ఇద్దరికి కరోనా వచ్చిందన్నా పరీక్ష చేయడం లేదు 

మా ఇంట్లో ఇద్దరికి కరోనా వచ్చి ఆసుపత్రిలో చేరారు. నాకూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. పరీక్షతో నిర్ధారించుకుని చికిత్స చేయించుకుందామంటే కిట్లు లేవంటూ మూడురోజులుగా తిప్పుకుంటున్నారు. వ్యాధి ముదురుతుందేమోనని భయంగా ఉంది. కొందరు వచ్చి నిమిషాల్లో పరీక్షలు చేయించుకుని వెళ్తున్నారు. క్యూ కూడా పాటించడం లేదు. క్యూలో నిలవకపోయినా వారి పని అయిపోతోంది. ఏమని అడిగితే మేమేం చేస్తాం.. కిట్లు లేవని చెప్పి వెళ్లిపోతున్నారు.  

 - రేణుక, గుంతకల్లు



విమాన, రైలు ప్రయాణికుల అగచాట్లు

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాషా్ట్రలకు వెళ్లే రైలు, విమాన  ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకుని రిపోర్టు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. టిక్కెట్లు బుక్‌ చేసుకున్న తర్వాత సకాలంలో రిపోర్టు రాకుంటే ఇక అంతేసంగతులు. ప్రయాణం సాధ్యపడదు. సరిగ్గా ఈ అవకాశాన్ని ప్రభుత్వాసుపత్రిలో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. గుంతకల్లులో మార్వాడీలు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు వేసవిలో వివాహాలు, వ్యాపారాలు తదితర కార్యక్రమాల కోసం మహారాష్ట్ర, రాజస్థానకు వెళ్తుంటారు. కరోనా రిపోర్టు తీసుకుంటేకానీ వారు వెళ్లలేని పరిస్థితి ఉంది. వారు రోజుల తరబడి పరీక్ష కోసం తిరగలేక మధ్యవర్తులకు డబ్బిచ్చి పని ముగించుకుంటున్నారు. నగరాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాగా రిపోర్టును సకాలంలో తెప్పించడానికీ ప్రత్యేక రేటును వసూలు చేస్తున్నట్లు సమాచారం. అనంతపురంలోని ల్యాబ్‌లో కూడా సంబంధాలు పెట్టుకుని కేవలం ఒక్క రోజులో రిపోర్టును తెప్పిస్తామని డబ్బులు గుంజుతున్నారు. ‘తన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తనకూ లక్షణాలు వచ్చాయని, పరీక్ష కోసం ముడు రోజులుగా తిరుగుతున్నా వెనక్కు తిప్పి పంపుతున్నారు’ అంటూ రేణుక కన్నీటి పర్యంతమైంది. క్యూ పద్ధతిని పెట్టినా, టోకెన్లు ఇచ్చినా ఈ అక్రమార్కులు ఏమీ అడ్డంకి లేకుండా తమ పని కానిచ్చేసుకునే పరిస్థితి ఉంది. అందరికీ సరిపోయే విధంగా కిట్లు, కౌంటర్లు ఏర్పాటుచేస్తే తప్ప పరిస్థితి మారేలా లేదు. ఇదిలాఉండగా నాలుగు రోజుల నుంచి కొవిడ్‌ వ్యాక్సిన 2వ డోస్‌ ఇవ్వని కారణంగా పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చిపోతున్నారు. ప్రస్తుతం మొదటి డోస్‌ మాత్రమే ఇస్తున్నామని వైద్య సిబ్బంది చెప్పి పంపుతున్నారు. మొదటి డోస్‌ వ్యాక్సిన ఇచ్చాక 45 రోజులలోపు రెండవ డోస్‌ తీసుకోవచ్చంటూ తిప్పి పంపుతున్నారు. 



ఆసుపత్రి ఆవరణలోనే అంగళ్లు

కరోనా కిట్ల కొరతను అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆసుపత్రి ఆవరణలోనే అంగళ్లు తెరిచారు. వీరు సప్లై, డిమాండు సూత్రాన్ని సరిగ్గా ఒంటబట్టించుకున్నారు. కిట్లు తగినన్ని రాకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కరోనా శాంపిళ్లను సేకరించే కౌంటరును ఏర్పాటుచేశారు. వైద్య శాఖ నుంచి ఈ కౌంటరుకు అందే శాంపిల్‌ కిట్లలో సగం మాత్రమే వచ్చాయని అక్కడ క్యూలో ఉన్న వారికి చెబుతారు. మిగిలిన కిట్లను బయట నుంచి వచ్చి డబ్బిచ్చేవారి కోసం రిజర్వు చేసేస్తారు. బయట డబ్బిచ్చి టెస్టులు చేయించుకునేవారి కోసం కాపుకాస్తారు. లోనికి వచ్చి క్యూను చూసి బేజారుపడే వారిని మాటల్లో దించి బేరం కుదుర్చుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.1,500 దాకా అవకాశాన్ని బట్టి రాబట్టుకుని వారి ఆధార్‌ వివరాలను చిన్న చిత్తు కాగితంలో రాసి లోపలకు పంపుతారు. లోపల క్యూలో జనం నిలిచినవారు నిలిచి ఉండగానే బయట నుంచి వచ్చే సమాచారాన్ని ఆనలైనలో రిజిస్టర్‌ చేస్తారు. ఇంకా ఎంత సేపు.. అని ప్రశ్నిస్తే సర్వర్‌ స్లో.. అని సమాధానం చెప్పేస్తారు. డబ్బు తీసుకుని ఆధార్‌ సీడింగ్‌ చేసిన వారిని మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తీసుకువచ్చి శాంపిళ్లను తీసి పంపుతున్నారు. ఈ విషయంగా వైద్య సిబ్బందిని బాధితులు నిలదీశారు. ఎన్ని కిట్లు ఉన్నాయో అంతమందికి ముందుగానే పారదర్శకంగా బయటకు ప్రకటించి టోకెన్లు ఇస్తే మిగిలిన వారు ఇళ్లకు వెళ్లిపోయి మరుసటి రోజు వస్తారుకదా అని ప్రశ్నించారు.



మధ్యాహ్నం వరకూ నిలబెట్టి పంపించేస్తున్నారు

- కే రాజశేఖర్‌, గుంతకల్లు

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్నా 12 గంటల తర్వాత కిట్లు లేవని చెప్పి పంపించేస్తున్నారు. వచ్చినవారిని వచ్చినట్లు క్యూలో నిలపడమో, టోకెన్లు ఇ వ్వడమో చేయడంలేదు. గుంపులు గుంపులుగా కౌంటరులో నిలబెడుతున్నారు. కరోనా లేనివారికి వ్యాధి సోకే ప రిస్థితులు కల్పిస్తున్నారు. ఎవరి దరఖాస్తును సీడింగ్‌ చేస్తున్నారో తెలియక కాళ్లు నొప్పి పుట్టేదాకా నిలబడి వచ్చేస్తున్నాం. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు.


Updated Date - 2021-04-21T06:24:11+05:30 IST