మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర రూ.25 పెంపు

ABN , First Publish Date - 2021-02-26T06:38:29+05:30 IST

పేదోడిపై మరో సారి గ్యాస్‌ పిడుగు పడింది. తాజాగా వంట గ్యాస్‌పై రూ.25 పెంచారు. గురువారం పెంచిన ధరలు అమలు చేశారు.

మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర  రూ.25 పెంపు

వంట గ్యాస్‌ సిలిండర్‌ రూ.861

ఏజెన్సీల నిర్లక్ష్యంతో మరింత 

నష్టపోతున్న వినియోగదారులు

అనంతపురం వ్యవసాయం, ఫిబ్రవరి 25: పేదోడిపై మరో సారి గ్యాస్‌ పిడుగు పడింది. తాజాగా వంట గ్యాస్‌పై రూ.25 పెంచారు. గురువారం పెంచిన ధరలు అమలు చేశారు. గతంలో నెలకోమారు కొత్త ధర నిర్ణయిస్తూ వస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ఈ నెలలో మూడుసార్లు ధరలు పెంచటం గమనార్హం. దీనిపై పేద, సామాన్యవర్గాలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదివరకు వంట గ్యాస్‌ ధర రూ.836గా ఉండింది. తాజాగా పెంచిన రూ.25తో కలిపి రూ.861కి చేరింది.


నెలలో మూడుసార్లు..

ఈ నెలలో ఇప్పటి వరకు మూడుసార్లు వంట గ్యాస్‌ ధరలు పెంచారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి తొలుత వంట గ్యాస్‌ ధర రూ.761గా నిర్ణయించారు. ఈనెల 4వ తేదీ సిలిండర్‌పై రూ.25 పెంచారు. ఆ తర్వాత ఈనెల 14న అదనంగా రూ.50, తాజాగా మరో రూ.25 పెంచటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 88 గ్యాస్‌ ఏజెన్సీలు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 12.30 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. రోజూ 22 వేల గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు 6.60 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. పాత ధర మేరకు రోజుకు రూ.1.83 కోట్లు, నెలకు రూ.55.17 కోట్లు ఖర్చవుతుంది. పెంచిన ధర మేరకు రోజుకు రూ.1.89 కోట్లు, నెలకు రూ.56.82 కోట్లు ఖర్చవుతుంది. ఈ లెక్కన రోజుకు అదనంగా రూ.6 లక్షలు, నెలకు రూ.1.65 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. గ్యాస్‌ ధరలు మరింత పెంచితే ప్రజలపై పెనుభారం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్యాస్‌ ధరలు తగ్గించి, ఆదుకోవాలని సామాన్య ప్రజలు వేడుకుంటున్నారు.


ఏజెన్సీల నిర్లక్ష్యం.. వినియోగదారులకు నష్టం

గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పాత ధరకు సిలిండర్‌ను తీసుకోవాల్సిన వినియోగదారులు పెంచిన ధరను చెల్లించాల్సి వస్తోంది. కొత్త ధరను గురువారం నుంచి అమలు చేశారు. ఇదివరకు సిలిండర్‌ కోసం బుక్‌ చేసుకున్న వారికి మూడు రోజుల క్రితమే పాత ధరతో బిల్లు చేశారు. ఆయా వినియోగదారులకు సెల్‌ నెంబర్లకు బిల్‌ వివరాలతో కూడిన సమాచారం వచ్చింది. బుధవారంలోగా గ్యాస్‌ డెలివరీ చేయకపోవటంతో ఇదివరకే బుక్‌ చేసిన వినియోగదారుల బిల్లులను డోర్‌లాక్‌, ఇతరత్రా కారణాలు చూపుతూ బిల్లులను రద్దు చేస్తున్నారు. ఒక రోజు ఆలస్యంగా గురువారం డెలివరీ చేయడంతోపాటు కొత్త ధరను వసూలు చేస్తున్నారు. తమకు రెండ్రోజుల క్రితమే పాత ధరతో బిల్లు వచ్చిందనీ, అలాంటపుడు పెరిగిన ధర ఎందుకు కట్టాలని వినియోగదారులు వాపోతున్నారు. బుధవారంలోగా సిలిండర్‌ డెలివరీ చేయకపోవటంతో తాము అదనంగా డబ్బు వెచ్చించాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ధర తగ్గినపుడు ఇలాగే కొత్త ధరతో సిలిండర్‌ను సరఫరా చేస్తారా.? అంటూ నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

Updated Date - 2021-02-26T06:38:29+05:30 IST