అంతర పంటలపై అశ్రద్ధ..!

ABN , First Publish Date - 2021-05-19T06:36:43+05:30 IST

ల్లాలో అంతర పంటల సాగును ప్రోత్సహించడంపై ప్రభుత్వం అశ్రద్ధ చూపుతోందన్న విమర్శలున్నాయి.

అంతర పంటలపై అశ్రద్ధ..!

కంది, ఇతర రకాల విత్తనాలు 

కేటాయించని వైనం

నెల రోజుల కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఈనెల 25 నుంచి పంపిణీకి ముందస్తు ప్రణాళికలు

ఇప్పటిదాకా సబ్సిడీ ధరలు ఖరారు చేయని దుస్థితి

సమీపిస్తున్న ఖరీఫ్‌.. రైతుల్లో అయోమయం

అనంతపురం వ్యవసాయం, మే 18: జిల్లాలో అంతర పంటల సాగును ప్రోత్సహించడంపై ప్రభుత్వం అశ్రద్ధ చూపుతోందన్న విమర్శలున్నాయి. జూన్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కానుంది. రెండు రోజులుగా విత్తన వేరుశనగ పంపిణీ మొదలుపెట్టారు. అయినప్పటికీ అంతర పంటల విత్తనాల పంపిణీపై స్పష్టతనివ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా విత్తన వేరుశనగతోపాటు అంతర పంటల విత్తనాలు సబ్సిడీతో పంపిణీ చేసేవారు. రెండేళ్లుగా ఆ విధానానికి స్వప్తి చెప్పారు. గతేడాది ఆలస్యంగా తక్కువ మోతాదులో అంతర పంటల విత్తనాలు పంపిణీ చేయడంతో సరి పెట్టారు. ఈసారి ఇప్పటిదాకా కంది, ఇతర అంతర పంటల విత్తనాలు జిల్లాకు కేటాయించకపోవడం గమనార్హం. జిల్లాలో సాగయ్యే పంటల్లో ప్రధాన పంట వేరుశనగ. ఏటా ఖరీ్‌ఫలో ఈ పంటనే ఎక్కువ శాతం రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటకు పెట్టుబడి కూడా ఎక్కువే. ఏటా వర్షాభావ పరిస్థితుల్లో పంట చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతర పంట సాగుకు పెట్టుబడి తక్కువే. ఈ నేపథ్యంలో వేరుశనగ సాగులో 20 శాతం అంతర, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. జిల్లాలో ఏటా 5 లక్షల హెక్టార్ల వరకు వేరుశనగ సాగవుతోంది. ఇందులో నిర్దేశించిన మేరకు వేరుశనగ సాగును తగ్గించి, ఆ స్థానంలో ఇతర రకాల పంటలు పెట్టేలా రైతుల్లో చైతన్యం కల్పించాల్సి ఉంది. ఆ దిశగా వ్యవసాయ శాఖాధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. జూన్‌లోగా విత్తన వేరుశనగతోపాటు అంతర పంటల విత్తనాలు రైతుకు అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది ఖరీ్‌ఫలో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 6.71 లక్షల హెక్టార్లుగా అంచనా వేశారు. ఇందులో వేరుశనగ వాటా 4.76 లక్షల హెక్టా ర్లుగా నిర్ణయించారు. వరి 18092, జొన్న 12203, సజ్జ 3075, మొక్కజొన్న 15883, రాగి 1508, కొర్ర 2295, కంది 55765, గ్రీన్‌ పెసలు 4283, మినుములు 654, ఉలవలు  21941, ఇతర చిరుధాన్యాలు 3335, ఆముదం 12860, ప్రొద్దుతిరుగుడు 1520, సోయాబీన్‌ 165, ప్రత్తి 43477 హెక్టార్లలో, మిగిలిన విస్తీర్ణంలో ఇతర రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళికలు రూపొం దించారు.


7700 క్వింటాళ్లు అవసరం

జిల్లాకు కందితోపాటు ఇతర రకాల విత్తనాలు 7700 క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో కంది విత్తనాలు 4500 క్వింటాళ్లు అవసరమని ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నెల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం సబ్సిడీ ధరలు ఖరారు చేసి, అనుమతులు మంజూరు చేస్తే ఈనెల 25వ తేదీ నుంచే కంది, ఇతర రకాల పంటల విత్తనాలు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిదాకా అంతర పంటల విత్తనాలే జిల్లాకు కేటాయించకపోవడం గమనార్హం. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తోంది. నేటికీ సబ్సిడీ ధరలు ఖరారు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సబ్సిడీతో అంతర పంటల విత్తనాలకు కరువు రైతులు దూరమయ్యే దుస్థితి తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అంతర పంటల విత్తనాల సబ్సిడీ ధరలు ఖరారు చేసి, త్వరగా జిల్లాకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - 2021-05-19T06:36:43+05:30 IST