Abn logo
Feb 27 2021 @ 01:13AM

టీడీపీ అభ్యర్థులే టార్గెట్‌..

పావులు కదుపుతున్న అధికార పార్టీ ముఖ్య నేతలు

ప్రలోభాల ఎరతో లోబరచుకునే ప్రయత్నం

లొంగకపోతే.. కేసులతో బెదిరింపులు

ఒత్తిళ్లతో అజ్ఞాతంలోకి టీడీపీ అభ్యర్థులు

కింది స్థాయి అధికారులే 

పాత్రధారులుగా ఆరోపణలు

అనంతపురం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ ముష్కాన్‌.. ఆపరేషన్‌ ఆకర్ష్‌... ఇలాంటి పదాలు విన్నాం. జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు సరికొత్త పంథాకు తెర లేపారు. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా.. ‘పరేషన్‌ విత్‌ డ్రా’కు ఆ పార్టీ ముఖ్య నేతలు శ్రీకారం చుట్టారు. గతేడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన సందర్భంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగినా.. దాడులకు తెగబడినా.. అనుకున్న స్థాయిలో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండాపోయింది. ఒకటి రెండు స్థానాల్లో మినహా అన్నింటా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్‌తో పాటు తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి, రాయదుర్గం, గుంతకల్లు మున్సిపాల్టీలు, కళ్యాణదుర్గం, మడకశిర, గుత్తి, పుట్టపర్తి నగర పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో అధికార దర్పాన్ని మరోసారి ప్రదర్శించేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు సిద్ధమయ్యారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో మెజార్టీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలన్న ఆశలు ఫలించలేదు. పుర పోరులోనైనా.. సామధానదండోపాయాలను ఉపయోగించి, ప్రధాన ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పక్షాల అభ్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయించి, అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలన్న దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలు స్వయంగా జిల్లా ఎస్పీని కలిసి, అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఏకరువు పెట్టడం చూస్తే బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమైపోతోంది.


పార్టీ మారతావా..? పోటీ నుంచి తప్పుకుంటావా..?

అధికార పార్టీలో కొందరు ముఖ్య నేతల తీరు ఎలా ఉందంటే.. ‘పార్టీ మారతావా..? పోటీ నుంచి తప్పుకుంటావా..?’ అనే రీతిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అభ్యర్థులపై బెదిరింపులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా మున్సిపాల్టీల్లో.. అందులోనూ ఆ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన వారిపైనే అధికార పార్టీ నేతలు దృష్టి సారించారన్న విమర్శలున్నాయి. పనిలో పనిగా ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులపైనా దృష్టి పెట్టారనటంలో అతిశయోక్తి లేదు. మున్సిపాల్టీల విషయానికొస్తే అనంతపురం కార్పొరేషన్‌లో దాదాపు 10 డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తారాస్థాయికి చేరినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. అందులోనూ గత పాలకవర్గంలో పనిచేసిన ప్రధాన కార్పొరేటర్లపైనే ఈ తరహా బెదిరింపులు, ఒత్తిళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ధర్మవరం మున్సిపాల్టీలోనూ టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా.. బెదిరింపుల పర్వం కొనసాగుతోందన్న విమర్శలు టీడీపీ ముఖ్య నేతలు చేస్తున్నారు. ఇందులోనూ అధికార పార్టీ ముఖ్య నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను లోబరుచుకునేందుకు ముందుగా ప్రలోభాల ఎర చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రలోభాలకు తలొగ్గకపోతే ఆర్థిక మూలాల వ్యవహారాలపై ఏ విధంగా దెబ్బ పడుతుందో పూసగుచ్చినట్లు వివరిస్తున్నట్లు సమాచారం. అప్పటికీ.. దారికి రాకపోతే కేసుల బూచిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘అధికారం మాదే.. ఏ విధంగా పనులు చేసుకుంటారో చూస్తామ’న్న స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. మున్సిపాల్టీల్లో తమ పార్టీ అభ్యర్థులకు పోటీ లేకుండా ప్రత్యర్థి పార్టీల నామినేషన్లు విత్‌డ్రా చేయించేందుకు ఎన్ని దార్లున్నాయో.. వాటన్నింటినీ ఉపయోగించుకునే రీతిలో అధికార పార్టీ నేతలు ఉన్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మంత్రి శంకర్‌నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి అధికార పార్టీలో చేరటం వెనుక అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పైకి భాస్కర్‌రెడ్డి టీడీపీలో తనకు ప్రాధాన్యత లేదని సాకు చూపుతున్నప్పటికీ.. అంతర్గతంగా బెదిరింపులు లేకపోలేదన్న విమర్శలు స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. భాస్కర్‌రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బతీసే స్థాయిలో అధికార పార్టీ నేతల బెదిరింపులే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనంతపురం అర్బన్‌లో టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు పార్టీని వీడి, వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీని వెనుక అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసుల ఒత్తిళ్లే కారణమన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.


కేసుల  బెదిరింపులు.. ఒత్తిళ్లతో అజ్ఞాతంలోకి టీడీపీ అభ్యర్థులు

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు అధికార పార్టీ నేతల నుంచి ఎదురవుతున్నాయి. ఇక్కడ కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు.. పలువురు పోలీసు అధికారులను ఉపయోగించుకుని, టీడీపీ అభ్యర్థుల్లో కేసుల భయాన్ని రేకెత్తిస్తున్నా రు. అనంతపురం అర్బన్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువైందన్న వి మర్శలు లేకపోలేదు. అనంతపురం అర్బన్‌లో పనిచేసే కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలు ఏం చెబితే అదే శిరోధార్యంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. కొందరు టీడీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పార్టీ మారేలా కేసుల బూచిని చూపుతూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతలు శుక్రవారం జిల్లా ఎస్పీని కలిసిన సందర్భంలోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓ వైపు పోలీసుల ఒత్తిళ్లు, మరోవైపు అధికార పార్టీ నేతల బెదిరింపుల నేపథ్యంలో అనంతపు రం అర్బన్‌లో దాదాపు 11 మంది టీడీపీ అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వారంతా గురువారం అర్ధరాత్రి నాలుగు వాహనాల్లో జిల్లాను వీడి, బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. దీనినిబట్టి చూస్తే మున్సిపోల్స్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలు, బెదిరింపులు పరాకాష్టకు చేరుతున్నాయన్న ఆ రోపణలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement
Advertisement
Advertisement