మృత్యుఘోష

ABN , First Publish Date - 2021-02-24T07:01:05+05:30 IST

జిల్లాలో మంగళవారం ఒక్క రోజు మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు అసువులుబాశారు. ఆయా ఊళ్లలో విషాదం నెలకొంది.

మృత్యుఘోష
విద్యుత్‌ప్రమాదంలో సజీవదహనమైన తల్లీకొడుకులు

మృత్యుఘోష

ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

విద్యుత్‌ తీగ తగిలి తల్లీకొడుకు సజీవ దహనం

రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

క్వారీలో భారీ పేలుడుకు ఒకరు బలి

కుటుంబాల్లో తీరని విషాదం


జిల్లాలో మంగళవారం ఒక్క రోజు మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు అసువులుబాశారు. ఆయా ఊళ్లలో విషాదం నెలకొంది. కుటుంబీకులకు తీరని శోకం మిగిల్చారు. మృతదేహాలపై పడి రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి గ్రామ సమీపంలో విద్యుత్‌ తీగ తగిలి తల్లీకొడుకు సజీవ దహనమయ్యారు. ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామం వద్ద  ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా.. ఆత్మకూరు మండలంలోని పి.కొత్తపల్లి గ్రామ సమీపాన బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొనడంతో బెళుగుప్ప మండలం శీర్పికొట్టాల గ్రామానికి చెందిన రైతు మరణించగా.. అనంతపురం నగర శివారులో కుక్కను తప్పించపోయి బైక్‌ బోల్తా పడడంతో కూడేరు మండలం కొర్రకోడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మృతిచెందాడు. కర్ణాటకలోని చిక్కబళ్ళాపురం జిల్లాలో ఉన్న ఒక క్వారీలో తెల్లవారుజామున జరిగిన భారీ పేలుడులో గోరంట్లకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.


విద్యుత్‌ తీగ తగిలి తల్లీకొడుకులు సజీవ దహనం

తాడిపత్రి, ఫిబ్రవరి 23: విద్యుత్‌ తీగలు తగిలి పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి గ్రామ సమీపంలో తల్లీకొడుకు మంగళవారం సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు వరదాయపల్లికి చెందిన వెంకటస్వామి (35) అతని తల్లి వెంకటలక్ష్ముమ్మ (60) కలిసి సమీప కొండప్రాంతానికి పిడకల కోసం మోటార్‌ సైకిల్‌పై బయల్దేరారు. మార్గమధ్యలో రోడ్డుపై 11 కేవీ వైరు తెగి పడి ఉంది. ఈ విషయం గమనించని వెంకటస్వామి మోటార్‌సైకిల్‌ను దానిపై పోనిచ్చాడు. మోటార్‌సైకిల్‌కు కిందిభాగంలోని స్టాండ్‌కు విద్యుత్‌వైరు తగలడంతో వెం కటస్వామి, వెంకటలక్ష్ముమ్మతోపాటు మోటార్‌సైకిల్‌కు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌ కాలిపోవడంతోపాటు ఇరువురు సజీవ దహనమయ్యారు. ఇదే మార్గం గుండా వస్తున్న గ్రామస్థులు గమనించి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. 


విద్యుత్‌ అధికారులతో వాగ్వాదం

విద్యుత్‌శాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించడంతో హుటాహుటినా ఏఈ షెక్షావలి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ట్రాన్స్‌కో ఏఈతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. కుటుంబ సభ్యులను శాంతపరిచి శవాలను పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రమాదానికి కారణమైన ట్రాన్స్‌కో అధికారులు రూ.10 లక్షల ఆర్థికసాయం, ఉద్యోగం, పొలం, ఇంటిస్థలంపై తగిన హామీ ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి శవాలతోపాటు తాము కదిలేది లేదని భీష్మించారు. రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు ట్రాన్స్‌కో ఏఈ హామీ ఇవ్వడంతో పోలీసులు శవాలను తాడిపత్రికి తర లించారు. మృతుడు వెంకటస్వామికి భార్య, కొడుకు శ్రీహరి, కూతురు మేఘన ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు.


పిడకల కోసం వెళ్లి పరలోకాలకు..

పెద్దపప్పూరు మండలం అశ్వత్థంలో మాఘమాసం సందర్భంగా అశ్వత్థనారాయణస్వామి, భీమలింగేశ్వరస్వామి తిరుణాల వైభవంగా జరుగుతోంది. మాఘమాసంలోని నాలుగు ఆదివారాల్లో స్వామివారిని దర్శించుకొనేందుకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. పరిసర మండలాలకు చెందినవారు ఎద్దులబండ్లు, ఇతర వాహనాల్లో కుటుంబసభ్యులతో కలిసి వచ్చి స్వామివార్లకు పొంగలి నైవేద్యంగా పెడతారు. ఇందుకోసం కొత్త కుండలో పొంగలి తయారుచేసేందుకు ఆవు పిడకలను ఉపయోగిస్తారు. గ్రామంలోని ఆవులు, ఇతర పశువులు మేత కోసం సమీపంలోని కొండప్రాంతానికి వెళతాయి. దీంతో ఇక్కడ అవసరమైన ఆవు పిడకలు ఉంటాయన్న ఆలోచనతో తల్లీకొడుకులు కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లి ప్రమాదం బారినపడ్డారు. వ్యవసాయ తోటల కోసం ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాటుచేసిన విద్యుత్‌లైన్‌ తెగిన వెంటనే సబ్‌స్టేషన్‌లో ట్రిప్‌ అయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. కానీ ఈ ప్రమాదానికి కారణమైన విద్యుత్‌ వైరు తెగిపోయినా సబ్‌ స్టేషన్‌లో ఎందుకు ట్రిప్‌ కాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సాంకేతిక కారణమా, సిబ్బంది నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఏఈ షెక్షావలిని వివరణ అడుగగా సబ్‌స్టేషన్‌లో విచారణ జరుపుతున్నామని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  




మినీవ్యాన్‌ ఢీకొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం 

ధర్మవరంరూరల్‌, ఫిబ్రవరి 23 : మండలంలోని చిగిచెర్ల గ్రామం వద్ద మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో కురుబ జగదీష్‌(21), హోసన్న (21) అనే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు కొత్తచెరువు మండలం నారేపల్లి గ్రామానికి చెందిన నాగభూషణ కుమారుడు జగదీష్‌, అనంతపురంలోని ప్రియాంకనగర్‌కు చెందిన జలప్రభు కుమారుడు వాసన్న గతేడాది టీటీసీ పూర్తిచేసి డీఎస్సీ కోసం అనంత పురంలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. వీరిద్దరూ మంగళవారం అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా నారేపల్లి గ్రామానికి వెళ్లడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మార్గమధ్యలో చిగిచెర్ల గ్రామసమీపంలో ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు బలంగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు కాగా, మినీవ్యాన్‌ ముందు భాగం దెబ్బతింది. రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 





ఉద్యోగం తెచ్చుకుంటానంటివి కదా నాయనా....

ప్రమాద విషయం తెలుసుకున్న నారేపల్లికి చెందిన జగదీష్‌ బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరు న విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. వచ్చే డీఎస్సీలో పోస్టు తెచ్చుకుంటానంటివి కద నాయ నా! నువ్వు చిన్నప్పుడే మీ అమ్మచనిపోతే  ఎన్ని ఆశలు పెట్టుకుని సాకీతిమి తండ్రి! అంటూ జగదీష్‌ మృతదే హంపై పడి బంధువులు రోదించిన తీరు  కలిచివేసింది. దేవుడా ఏమి అన్యాయం చేశామయ్యా ! మేము పెట్టుకు న్న ఆశలన్నీ మట్టిలోకి వెస్తివి. లే నాన్న అంటూ పెద నాన్న, అన్న విలపించిన తీరు కంటతడి పెట్టించాయి. 


క్వారీలో పేలుడు.. కంప్యూటర్‌ ఆపరేటర్‌..  

గోరంట్ల, ఫిబ్రవరి 23 : కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండ తాలు కా హీరేనాగవల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచి ఉంచిన జిలెటిన్‌ కడ్డీలు, ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లను మైనింగ్‌ ప్రదేశానికి తరలిస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలు డు సంభవించింది. ఈ సంఘ టనలో గోరంట్లకు చెందిన గంగాధర్‌బాబు(33) మరణించాడు. కులవృత్తే జీవనాధారంగా పనిచేస్తున్న వెంకటస్వా మి, ఆదిలక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు  గంగాధర్‌బాబు డిగ్రీ చదివి పేరేసముద్రంలోని క్వారీలో నాలుగేళ్లుగా కంప్యూటర్‌ ఆపరేటర్‌గా అకౌంట్స్‌ చూసే ఉద్యోగం చేస్తున్నాడు. భార్యా పిల్లలతో గోరంట్లలోనే నివాసం ఉంటూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లేవాడని బంధువులు తెలిపారు. పేలుడు సంఘటనలో గంగాధర్‌బాబు మృతి చెందటంతో కుటుంబికులు కన్నీరు ము న్నీరుగా విలపించారు. మృతుడికి భార్య లలిత, హితశ్రీ(10), ధన్విష్‌(2) పిల్లలు ఉన్నారు. 



ట్రాక్టర్‌ ఢీకొని రైతు..

ఆత్మకూరు, ఫిబ్రవరి 23: మండలంలోని పి.కొత్తపల్లి గ్రామ సమీపాన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెళుగుప్ప మండలం శీర్పికొట్టాల గ్రామానికి చెంది న రైతు మల్లికార్జున నాయుడు (56) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు మల్లికార్జున నాయుడు సొంత పనిమీద మంగళవారం అనంతపురం నగరానికి ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా ఆత్మకూరు మండలంలోని పి.కొత్తపల్లి గ్రామం సమీపంలో ట్రాక్టర్‌ ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ఉన్న మరో వ్యక్తి సురే్‌షకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లికార్జుననాయుడు స్వగ్రామం తాడిపత్రి మండలం లింగన్నపల్లి గ్రామం. బెళుగుప్ప మండలం శీర్పికొట్టాలలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఒక కుమారుడు ఉన్నట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలం పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 



కుక్కను తప్పించబోయి బైక్‌ బోల్తా.. కూలీ మృతి

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 23 :  నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయకూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కూడేరు మండలం కొర్రకోడు గ్రామానికి చెందిన కూలీ దళిత కుంటెన్న(34) మంగళవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో  అనంతపురానికి బయల్దేరాడు. అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి గ్రామ పంచాయతీ సమీపంలోకి రాగానే హఠాత్తుగా కుక్క అడ్డు వచ్చింది. దీన్ని తప్పించే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. వెంటనే ద్విచక్ర వాహనంలో నుంచి కుంటెన్న ఎగిరి డివైడర్‌ మద్యలో ఉన్న విద్యుత్‌ స్తంభానికి ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతపురం రూరల్‌ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య తిమ్మక్క బంధువులు అతడి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-02-24T07:01:05+05:30 IST