బాబోయ్‌..! దొంగలు

ABN , First Publish Date - 2021-02-24T06:56:16+05:30 IST

తాడిపత్రి పట్టణంలోని కాల్వగడ్డవీధిలో శనివారం పట్టపగలే 25 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. షెక్షావలి జీన్స్‌కార్నర్‌ నిర్వహిస్తుండగా.. భార్య ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది.

బాబోయ్‌..! దొంగలు
ఇటీవలతాడిపత్రిలోని కాల్వగడ్డవీధిలో చోరీ జరిగిన ఇంటిలో పరిశీలిస్తున్న క్లూస్‌టీం, సీఐ (ఫైల్‌)

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు

ఎన్నికల వేళ పెరిగిన దొంగతనాలు

కొన్ని ప్రాంతాలలో పట్టపగలే టార్గెట్‌

వరుస సంఘటనలతో 

భయాందోళనలో ప్రజలు

పోలీసుశాఖ తీరుపై విమర్శలు

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 23:

- తాడిపత్రి పట్టణంలోని కాల్వగడ్డవీధిలో శనివారం పట్టపగలే 25 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. షెక్షావలి జీన్స్‌కార్నర్‌ నిర్వహిస్తుండగా.. భార్య ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఇద్దరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విధులకు వెళ్లిపోవడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో పట్టపగలే దుండగులు ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టారు. ఇంట్లోకి చొరబడి బీరువాను రాడ్లతో మెండి పగలగొట్టారు. అందులో ఉన్న 25 తులాల బంగారు నగలను దొంగిలించారు. విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులకు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూశారు. బీరువాలో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో ఉన్న బంగారు నగలు మాయం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. 

- నగరంలో నాలుగురోజుల వ్యవధిలోనే రెండు చోరీలు జరిగాయి. నగరంలోని విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న ఎస్‌బీఐ ఉద్యోగి రామ్‌ప్రసాద్‌, అతడి భార్య టీచర్‌ పరి మళ ఇద్దరు ఈనెల 19న ఉదయం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లారు. పరిశీలించి చూడగా ఐదు తులాల బంగారు నగలు చోరీ అయినట్టు గుర్తించారు. 

- ఈనెల 18న నగరంలోని షిర్డీనగర్‌లో మెప్మా ఉద్యోగి తులసీ తన భర్తతో కలిసి విధులకు వెళ్లగా.. ఇంటిలో దొంగలు చొరబడి 7 తులాల బంగారు నగలు అపహరించారు. విధుల నుంచి ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగు చూసింది. 

- గత నెల 29న నగర శివారులోని బ్యాంక్‌ కాలనీలో  బేల్దారి శ్రీనివాసులు తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వచ్చి గంటలోపు ఇంటికి వెళ్లారు. అప్ప టికే దుండగులు ఇంట్లో చొరబడి 15 తులాల బంగారు నగలు, రూ.30 వేలు నగదును అపహరించారు. ఈ నాలుగు చోరీలు జిల్లాలో పట్టపగలే జరగటం పోలీసు శాఖపై విమర్శలకు తావిస్తోంది.  

- గత నెల 24న రొళ్ల మండలంలోని రత్నగిరి, కాకి, దొడ్డేరి, గ్రామాల్లో తాళం వేసిన 8 ఇళ్లలో దుండగులు చొ రబడి రూ. 3లక్షలకు పైగా నగదు, 8 తులాల బంగారు నగలు అపహరించారు. ఒకే రోజు 8 ఇళ్లలో చోరీలు జరగటం ఆ ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనకు గురి చేసింది.

- గత నెల రెండోవారంలో కళ్యాణదుర్గంలోని పార్వ తీనగర్‌లోని ఓ ఇంట్లో 5 తులాల బంగారం, వెండి, రూ. 50 వేల నగదును అపహరించారు. గోళ్ల గ్రామంలో కూడా రెండిళ్లలో ఆరు తులాల బంగారం చోరీ చేశారు. 

- గత నెల 22న తాడిపత్రిలోని భగత్‌సింగ్‌నగర్‌లో రెండిళ్లలో దుండగులు మూడు తులాల బంగారం, రూ.50 నగదును అపహరించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే...  జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలు ఇంటిని వదిలి బయటకు రావాలంటే భయపడుతున్నారు.  జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టపగలే దొంగలు ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్ప డుతుండటం జిల్లా ప్రజలతో పాటు పోలీసుశాఖను కలవరపెడుతోంది. తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో  దొంగతనాలు పెరగడం మరింత చర్చకు దారి తీస్తోంది.   పోలీసుశాఖ లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టం(ఎల్‌హెచ్‌ ఎంఎస్‌) లాంటి సాంకేతికతను ప్రవేశ పెట్టినా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా దొంగలను అదుపు చేయలేకపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దొంగలు పగలు రాత్రి అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లు కన పడితే చాలు దోచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  కొందరు పోలీసులు చోరీలపై ఆశించిన స్థాయిలో కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల పోలీసులు రికవరీ  చేసిన సొమ్ములో 30 శాతం, 40 శాతం కోతలు విధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో చోరీలు పెరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. 


తాళం వేస్తే అంతే....

జిల్లాలో ఎక్కడైనా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే అంతే సంగతులు. అలా వచ్చి ఇలా దొంగలు దోచేసే దుస్థితి నెలకొంది. తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు నిఘా విస్తృతంగా ఉన్నప్పటీకి దొంగతనాలు తగ్గడం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలు..  చోరీలకు పాల్పడుతున్నారు. కొందరు దొంగలు ఎన్నికల సమయం కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ప్రచారానికి వచ్చినట్టు వచ్చి తాళం వేసిన ఇళ్లను గుర్తించి  చోరీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


రికవరీ అంతంతే...

జిల్లాలో జరిగిన చోరీలలో ఎక్కువ శాతం చోరీలకు సంబంధించి ఆశించిన స్థాయిలో రికవరీ చేయడం లేదని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఎక్కువ శాతం చేస్తున్నామని చెప్తున్నారు. కొందరు బడా బాబులు, డబ్బు కలిగిన వాళ్లు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నవారికి ఎక్కువ శాతం చోరీలలో రికవరీ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పేదల ఇళ్లలో చోరీలు జరిగితే కొందరు పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదని సమాచారం. ఇలాంటి నిర్లక్ష్యమే దొంగల పాలిట వరంగా మారి జిల్లాలో చోరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 


ఆ ప్రాంతాల్లో అధికం...

జిల్లా వ్యాప్తంగా చోరీల సంఖ్య రోజురోజు పెరుగుతోంది. జిల్లాలో అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, గుంతకల్లు, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కళ్యాణ దుర్గం, కదిరి, రాయదుర్గం తదితర ప్రాంతాలలో చోరీల సంఖ్య అధికమవుతోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో  రోజుకు ఒకటి చెప్పున జరుగుతుండటం నగర వాసులను కలవరపెడుతోంది. 


పోలీసుల నిర్లక్ష్యం.. 

చోరీలు జరిగాయని బాధిత ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు జోరందుకున్నాయి. కొందరు పోలీసులు ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని సమాచారం. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే త్వరితగతిన కేసును పరిష్కారించాల్సి ఉంటుంది. అందుకే కొందరు పోలీసులు కేసులు కూడా నమోదు చేయకుండా జాగత్త పడుతున్నారనే విమర్శలున్నాయి. కొందరు పోలీ సులైతే తెలివిగా ఇతర పనులు, కేసులలో బిజీగా ఉన్నా మని కాలయాపన చేస్తున్నారని వినికిడి. ఇంకొందరు పోలీసులు  స్టేషన్ల చుట్టూ బాధితులను తిప్పించుకుంటూ విసుగు తెప్పిస్తున్నారని సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల తరబడి చోరీల కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే ఆరోపణలున్నాయి. 

Updated Date - 2021-02-24T06:56:16+05:30 IST