కారణం చెప్పకుండానే రిజెక్ట్‌..!

ABN , First Publish Date - 2021-05-12T07:00:26+05:30 IST

గతేడాది కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో చేయూతనందించిన ప్రైవేటు వాహన యజమానులకు చేదు అనుభవం ఎదురైంది.

కారణం చెప్పకుండానే రిజెక్ట్‌..!

గతేడాది కొవిడ్‌ విపత్కర సమయంలో ప్రైవేటు వాహనాల వినియోగం

జిల్లావ్యాప్తంగా 108 దాకా ఏర్పాటు

ఎట్టకేలకు ఖజానా

కార్యాలయానికి బిల్లులు..

కారణం లేకుండానే 

తిరస్కరించడంపై విమర్శలు 

ఆందోళనలో యజమానులు 

అనంతపురం వ్యవసాయం, మే 11: 

గతేడాది కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో చేయూతనందించిన ప్రైవేటు వాహన యజమానులకు చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో కరోనా బారిన పడిన బాధితులను ఆస్పత్రికి తరలించడం, ఆ తర్వాత తిరిగి వారిని ఇంటికి చేర్చడంలో వారంతా విశేష సేవలు అందించారు. కరోనా విలయతాండవం చేసే సమయంలో కొందరు ప్రైవేటు వాహన యజమానులు అడిగిందే తడవుగా వాహనాలు అద్దెకు పెట్టారు. 

     విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన వాహన యజమానులకు చెల్లించాల్సిన అద్దె డబ్బులు ఇవ్వకుండా సంబంఽధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ఎట్టకేలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఖజానా కార్యాలయానికి బిల్లులు పంపారు. అయితే ఎలాంటి కారణం లేకుండానే బిల్లులను తిరస్కరించినట్లు సమాచారం. ఆ విభాగం సిబ్బందికి అమ్యామ్యాలు ఇవ్వకపోవడంతోనే తిరస్కరించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సదరు ప్రైవేటు వాహనాల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  


చేయూతనిచ్చినందుకు మొండిచేయి  

గతేడాది కరోనా పాజిటివ్‌ బాధితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్‌ మాసాల్లో మూడు నెలల పాటు కరోనా బాధితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించడం, కరోనా తగ్గిన తర్వాత తిరిగి వారిని ఇంటికి చేర్చేందుకు అద్దె వాహనాల ను వినియోగించారు. అలాగే క్షేత్రస్థాయిలో కరోనా పరీక్షలు, వైద్య చికిత్స చేసేందుకు ఇదే వాహనాలను ఉపయోగించారు. జిల్లావ్యాప్తంగా 108 ప్రైవేటు వాహనాలను ఆర్టీఓ యంత్రాంగం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు అద్దెకు పెట్టారు. ఒక్కో వాహనానికి నెలకు రూ45 వేలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ లెక్కన మూడు నెలలకు ఒక్కో వాహనానికి రూ.1.35 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. 108 వాహనాలకు నెలకు రూ.48.60 లక్షలు, మూడు నెలలకు రూ.1,45,80,000 అద్దె డబ్బులు చెల్లించాల్సి ఉంది. అద్దెకు వాహనాలు నడుపుకుంటూ జీవనం సాగించే వాహన యజమానులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా ఆర్డీఓ, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎట్టకేలకు ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వాకా జిల్లా ఖనాజా కార్యాలయానికి బిల్లులు పంపారు. అయితే ఎలాంటి కార ణం లేకుండానే బిల్లులు తిరస్కరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో బాధితులకు సేవలు అందించినందుకు ఇదేనా మా కొచ్చే గౌరవమంటూ వాహన యజమానులు నిట్టూరుస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు పాస్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-12T07:00:26+05:30 IST