Abn logo
May 12 2021 @ 01:58AM

అంతుచిక్కని మరణాలు

మహమ్మారికి యువతా బలి

లక్షణాలు కనిపించకుండానే విషమం

వైద్యులకు సైతం దిక్కుతోచని స్థితి

భయంతో పాటు ఆలస్యమే

కారణమంటూ సమాధానాలు

అనంతపురం వైద్యం, మే11: ఆయన రిటైర్డ్‌ టీచర్‌. పెన్షనర్ల సంఘం నాయకుడు. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్నపుడు జ్వరం వచ్చింది. వ్యాక్సిన్‌ వేయించుకున్నందుకే జ్వరం వచ్చిందని రెండు రోజులు మాత్రలు వేసుకున్నారు. నాలుగు రోజుల తర్వాత దగ్గు, అయాసం పెరిగిపోయింది. అనుమానం వచ్చి, కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదు రోజుల్లోనే ప్రాణాలు వదిలారు. 

ఈమెది అనంతపురం. ఇంట్లో భర్తకు పాజిటివ్‌ వచ్చింది. ఈమె కూడా ఆ సమయంలో కరోనా లక్షణాల తో బాధపడుతూ వచ్చింది. ఆస్పత్రికెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ పరీక్షలు చేయించారు. అందులో నెగిటివ్‌ వచ్చింది. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.

ఇలా కరోనా మరణాలు అంతుచిక్కకుండా పోతున్నాయి. ఎవరికి కరోనా ఎలా వస్తుందో అర్థం కాని ప్రశ్నంగా మారింది. రోజూ ఎంతో మంది ఈ మహమ్మారికి బలైపోతున్నారు. తెలిసిన వాళ్లు ఎంతో మంది చనిపోతున్న వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. మార్చి నుంచి సెకెండ్‌ వేవ్‌ వైరస్‌ జిల్లాలో కొనసాగుతూ వస్తోంది. ఈ వైరస్‌ తీవ్రత ఏప్రిల్‌లో అధికమై, జనంపై విరుచుకుపడుతోంది. 40 రోజుల్లోనే జిల్లాలో కరోనా కల్లోలం సృష్టించింది. ఏప్రిల్‌ 1 నాటికి జిల్లాలో 603 కరోనా మరణాలుండేవి. అప్పటి నుంచి మే 10వ తేదీ నాటికి 40 రోజుల్లో ఈ మరణాల సంఖ్య 732కు చేరిపోయింది. ఈ లెక్కన 40 రోజుల్లో 129 మంది అధికారికంగా తెలిపిన మేరకు కరోనాకు బలైపోయారు. ఇందులో 30 ఏళ్లలోపు వారు 28 మంది, 50 ఏళ్లలోపు వారు 40 మంది, 50 ఏళ్ల పైబడినవారు 51 మంది ఉన్నారు. అంటే కరోనాతో మరణించిన వారిలో అత్యధికంగా యువతే ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది. అనధికారికంగా మరెందరో ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పాజిటివ్‌ వచ్చిన వారు, కరోనా లక్షణాలున్నవారు ఎందరో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వ గణాంకాల్లోకి రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ప్రభుత్వం నడుపుతున్న కొవిడ్‌ ఆస్పత్రుల్లోనూ అధిక మంది చనిపోయినా తక్కువగా లెక్కలు చూపుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. దీనిని బట్టి అధికారిక లెక్కలకు మూడింతలు అధిక మందే కరోనాకు జిల్లాలో ఈ రెండు నెలల్లోనే మరిణించి ఉంటారని వైద్యవర్గాల నుంచే వినిపిస్తున్నాయి. తొలి విడత కరోనా వేవ్‌లో ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదనీ, అది కూడా వయసు మీరిన వారు అధిక మంది చనిపోయేవారని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు యువత, 50 ఏళ్లలోపు వారు కరోనాకు ప్రాణాలు కోల్పోవడం అందరినీ టెన్షన్‌కు గురిచేస్తోంది.  వైద్యులకు సైతం ఈ కరోనా మరణాలు అంతుచిక్కడం లేదు. ఎందరో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తులు సైతం ఈసారి మహమ్మారికి బలైపోయారు. భయం, ఆలస్యం వల్లనే చాలామంది చనిపోతున్నారని వైద్యులు సమాధానం ఇస్తున్నారు. అయినా, అనంతలో కరోనా మరణాలు అంతుచిక్కకుండా పోతున్నాయి. ఇది ఇంకా ఎందాకా వెళ్తుందోనని ఆందోళన పడుతున్నారు.


అశ్రద్ధ చేయరాదు

ప్రస్తుత పరిస్థితుల్లో టెంపరేచర్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబుతో బాధపడుతుంటే కొన్ని సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే ఆర్‌టీపీసీ కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చే వరకు ఆక్సిజన్‌ పల్స్‌ ఏ స్థాయిలో ఉన్నాయో చెక్‌ చేయించుకోవాలి. దాని ఆధారంగా చికిత్స పొందాలి.

- డాక్టర్‌ గేయానంద్‌

భయం వల్లే ప్రాణాల మీదకు..

ఈసారి యువత అధిక మందే ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా లక్షణాలు యువతలో కనిపించడం లేదు. దీంతో ఆలస్యం చేస్తున్నారు. దీని వల్ల ఉన్నఫలంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అప్పుడు ఆస్పత్రికి వచ్చినా.. చికిత్స అందిస్తున్నా కోలుకోలేకపోతున్నారు. దీనికి తోడు భయం వల్ల ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే యువత లక్షణాలు లేకున్నా.. ఆరోగ్యం కొంత తే డాగా కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి, చికిత్స తీసుకోవాలి. అలా చేస్తే కరోనాను సులభంగా జయించవచ్చు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌, మానసిక వైద్య నిపుణుడు

Advertisement
Advertisement
Advertisement