కరోనా కట్టడికి 8 మార్గాలు

ABN , First Publish Date - 2021-05-19T06:35:38+05:30 IST

జిల్లాలో కరో నా కట్టడికి 8 మార్గాలను అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. అధికారులను ఆదే శించారు.

కరోనా కట్టడికి 8 మార్గాలు
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

పకడ్బందీగా అమలు చేయాలి

కలెక్టర్‌ గంధం చంద్రుడు  

అనంతపురం, మే18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరో నా కట్టడికి 8 మార్గాలను అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. అధికారులను ఆదే శించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి సబ్‌ క లెక్టర్‌, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతోపాటు వివిధ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన కట్టడి చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. కరోనా కట్టడికి 8 మార్గాలున్నాయన్నారు. అవి ఇంటెన్సివ్‌ శానిటేషన్‌, ఇన్ఫర్మేషన్‌ డెసిమినేషన్‌, ఫీవర్‌ సర్వే, మండల/మున్సిపల్‌ కొవిడ్‌ వార్‌ రూముల ఏర్పాటు, హోమ్‌ ఐసోలేషన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, మీడియా ప్రతినిధులతో అధికారుల సమన్వయం, ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌, క్లినికల్‌ మేనేజ్‌ మెంట్‌ అన్నారు. వీటన్నింటిని సక్రమంగా అమలు చేసినట్లయితే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌లో శానిటేషన్‌ సరిగా లేదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్‌ మరింత మెరుగుపరిచేలా ఉదయం, సాయంత్రం వేళల్లో చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రోజూ పర్యవేక్షించి, నివేదికలివ్వాలని డీపీఓను ఆదేశించారు. కరోనా గురించి ప్రతి సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేసేలా మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి, మాస్కులు సక్రమంగా ధరించాలనీ, బయటికి వచ్చినపుడు భౌతికదూరం పాటించాలని వలంటీర్లతో చెప్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం ఇందులో భాగస్వాములు కావాలన్నారు. కొవిడ్‌కు సంబంధించి ప్రతి విషయాన్నీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సమాచారం అందించాలన్నారు. ఇంటింటికీ తిరిగి ఫీవర్‌ సర్వే చేపట్టాలన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి మెడికల్‌ కిట్టు ఇవ్వాలన్నారు. పాజిటివ్‌, నెగిటివ్‌ ఏది ఉన్నా... లక్షణాలుంటే కిట్టు అందించాలన్నారు. ఆస్పత్రికి తరలించాల్సి వస్తే... ముందుగా కంట్రోల్‌ రూముకు ఫోన్‌ చేసి, బెడ్లు ఖాళీగా ఉన్నాయో లేవో తెలుసుకుని పంపించాలన్నారు. జిల్లాలో రాపిడ్‌ టెస్టులు మరింత ఎక్కువ చేయాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ ద్వారా శాంపిల్స్‌ తీసుకున్నపుడు సమన్వయం చేసుకొని టెస్టింగ్‌ కోసం పంపించాలన్నారు. కరోనా కట్టడిలో భాగంగా మండలం, మున్సిపల్‌ పట్టణాల్లో కొవిడ్‌ వార్‌ రూములను ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌, ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారితో మాట్లాడాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను ఆదేశించారు. కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎన్జీఓలు, మీడియా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పోరాడితేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్లలో 76 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొ దటిస్థానంలో ఉందన్నారు. వంద శాతానికి తీసుకొచ్చేలా అధికారులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు నిశాంత్‌కుమార్‌, డా. సిరి, గంగాధర్‌ గౌడ్‌, డీఎఫ్‌ ఓ జగన్నాథ్‌ సింగ్‌, డీఆర్వో గాయత్రీదేవి, డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, డీసీహెచ్‌ఎ్‌స రమే్‌షనాథ్‌, నోడల్‌ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T06:35:38+05:30 IST