కరోనా వేళ.. ఏదీ శ్రద్ధ?

ABN , First Publish Date - 2021-05-12T07:08:06+05:30 IST

కరోనా మహమ్మారి గతేడాది నగరాన్ని ఆవరించినపుడు అధికారుల చర్యలు, హడావుడి అంతా ఇంతా కాదు. రెడ్‌జో న్లు.. ఆ ప్రాంతాల్లో బారికేడ్లు, శానిటైజేషన్‌ పనులు యుద్ధప్రాతిపదికన సా గాయి.

కరోనా వేళ.. ఏదీ శ్రద్ధ?
కళ్యాణదుర్గం హైవే వద్ద ఎత్తివేయని చెత్త

అజమాయిషీకే కొందరు పరిమితం 

అవినీతికే మొగ్గు... ఆచరణలో వెనక్కి... 

తూతూమంత్రంగా పారిశుధ్యం   

మునుపటితో పోలిస్తే కనిపించని బ్లీచింగ్‌, స్ర్పేయింగ్‌ 

హెల్త్‌సెక్రటరీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల మధ్య కొరవడిన సమన్వయం 

నగరపాలక సంస్థలో దౌర్భాగ్యం

అనంతపురం కార్పొరేషన్‌, మే 11: కరోనా మహమ్మారి గతేడాది నగరాన్ని ఆవరించినపుడు అధికారుల చర్యలు, హడావుడి అంతా ఇంతా కాదు. రెడ్‌జో న్లు.. ఆ ప్రాంతాల్లో బారికేడ్లు, శానిటైజేషన్‌ పనులు యుద్ధప్రాతిపదికన సా గాయి. గతంలోలాగా నగరంలో ఇప్పుడు ఎక్కడా అలాంటి ఆనవాళ్లే కనిపించడం లేదు. బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా ప్రతి సందులో వేయడం లేదు. సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీని మరచిపోయారు. మరోవైపు మురుగుతో స్తంభించిన కాలువలు నిత్యం దర్శనమిస్తూ పరిశుభ్రతను వెక్కిరిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు మరణాల శాతం చాలా ఎక్కువ. కానీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థకు నూతన పాలకవర్గం ఏర్పాటైనా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. మరి ఎందుకా ఉదాసీనత...?

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అందులోనూ జిల్లాకేంద్రమైన అ నంతపురం నగరంలోని ఆసుపత్రులకు నిత్యం కొవిడ్‌ రోగులు క్యూకడుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు, ఆస్పత్రుల ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇంతటి విపత్తులోనూ నగరపాలక సంస్థ అధికారులు పారిశుధ్యంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నగర ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి, జాగ్రత్తలు చేపట్టడంలో ఘోరంగా విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. దాదాపు నెలన్నర రోజులుగా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికితోడు మరణా లు కూడా అధికమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల్లోని మురుగు సరిగా తీయకపోవడంతో కాలువల నుంచి దుర్గంధం వెదజల్లుతోంది. స్థానిక కార్పొరేటర్లు, నేతలు ఒత్తిడి తెచ్చిన ప్రాంతాల్లోనే పరిశుభ్రతపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో కార్మికులున్నా పారిశుధ్య సమస్య మాత్రం నగరపాలక సంస్థను పట్టిపీడిస్తూనే ఉంది. అదనంగా వార్డు శానిటరీ సెక్రటరీలున్నా పర్యవేక్షణ కొరవడి అయోమయంగా మారింది. శానిటరీ సెక్రటరీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల మధ్య సమన్వయం కొరవడటంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇక కొందరు అధికారులు పర్యవేక్షించాల్సింది పోయి, అజమాయిషీ చేయడానికే సరిపోయిందన్న ఆరోపణలు మోసుకుంటున్నారు. 


నిలువెల్లా నిర్లక్ష్యం...!

నగరంలోని ఒకటవ రోడ్డు నుంచి ఆరో రోడ్డు వరకు కరోనా సెకండ్‌ వేవ్‌ లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కానీ ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ర్పేయింగ్‌ చేసిన పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. పాతూరులో అసలే ఇరుకు సందులు. అక్కడ కూడా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా పారిశుధ్యం, స్ర్పేయింగ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లే విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. గత ఏడాది కరోనా కేసులు ఉధృతమవుతున్న కొద్దీ ఎక్కడ చూసినా బ్లీచింగ్‌ పౌడర్‌ కనిపించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నది సుస్పష్టం. కరోనా కేసులు వచ్చిన ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రా వణాన్ని పిచికారీ చేసే విషయంలోనూ అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యం మునుముందు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో వారం రోజుల నుంచే స్ర్పేయింగ్‌లో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. 


అజమాయిషీకే పరిమితమా...?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నగరపాలక సంస్థ పరిస్థితి. సంస్థ నిధుల్లో ఎక్కువ ఖర్చు వెచ్చించేది పారిశుధ్యానికే. 520 మంది వరకు పారిశుధ్య విభాగంలో కార్మికులు పనిచేస్తున్నారు. 70 మంది వరకు మేస్ర్తీలు ఉన్నారు. మళ్లీ అదనంగా పర్యవేక్షణకు నగరంలోని 74 సచివాలయాలన్నింటికీ వార్డు హెల్త్‌ సెక్రటరీలు, ఆరు సర్కిళ్లకు ప్రత్యేకంగా ఆరుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరందరికీ సూచనలు, ఆదేశాలివ్వడానికి ఎంహెచ్‌ఓ ఉండగా, అదనంగా డిప్యూటీ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించారు. అ యితే ఇక్కడ మేస్ర్తీల నుంచి పైకి వెళ్లే కొద్దీ చాలామంది అజమాయిషీలు చేసుకోవడానికి పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. కొందరు వార్డు హెల్త్‌ సెక్రటరీలు ఆయా డివిజన్లలో ఏవో రెండు ఫొటోలు షేర్‌ చేసి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ అధికారి పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నారా...? లేక ఆయనకు సంబంధం లేదా...? అనే అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్న ట్లు చర్చ సాగుతోంది. మరో ఉన్నతాధికారి పారిశుధ్యంపైన కాకుండా రెవెన్యూ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. 


అవినీతికే మొగ్గు..!

నగరపాలక సంస్థ పరిధిలో మరీ ముఖ్యంగా కొందరు అధికారులు అవినీతికి మొగ్గు చూపుతున్నారని, తమకు సంబంధించిన పనుల ఆచరణలో వెనక్కు తగ్గుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ మేస్ర్తీని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ చేయడానికి లక్షల రూపాయలు అమ్యామ్యాలు పుచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. బదిలీ వర్కర్ల పేరుతో కొందరు పని చేయడానికి రాకపోయినా పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాల్లో మేస్ర్తీల నుంచి అధికారుల వరకు భాగమున్నట్లు సమాచారం. కనీసం వార్డు సచివాలయాల గదులు కూడా శుభ్రం చేయించలేకపోతున్నారని స్వయంగా మేయర్‌ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. అందులోనూ ఆయన వచ్చినప్పటి నుంచి పారిశుధ్యంపైనే మాట్లాడుతున్నారు. కార్పొరేటర్లు సైతం కాలువల్లో మురుగు తీయలేదని ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కరోనా సమయంలోనైనా పారిశుధ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


ప్రత్యేక దృష్టి సారిస్తాం

కరోనా సమయంలో నగర పరిశుభ్రతను కాపాడటమే మా లక్ష్యం. పారిశుధ్య విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.  పెద్ద స్ర్పేయింగ్‌ మిషన్‌ను సిద్దం చేశాం. కొన్ని డివిజన్లలో పారిశుధ్య కార్మికులు ఎక్కువగా ఉన్నారు. సచివాలయాల వారిగా కార్మికులను కేటాయించాలని నిర్ణయించాం. అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించాం. - మహమ్మద్‌ వసీం, నగర మేయర్‌

Updated Date - 2021-05-12T07:08:06+05:30 IST