‘చేయూత’లో కోత..!

ABN , First Publish Date - 2021-06-17T06:49:26+05:30 IST

: వైఎ్‌సఆర్‌ చేయూత పథకం అమలులో ప్రవేశపెట్టిన ఓ నిబంధన లబ్ధిదారుల ఏరివేతకు దారితీయనుంది.

‘చేయూత’లో కోత..!

ఆధార్‌ చరిత్రతో లబ్ధిదారుల వడబోత

తక్కువ, ఎక్కువ వయసున్న వారు అనర్హులుగా గుర్తింపు

కొనసాగుతున్న మీసేవ ‘ఆధార్‌’ అక్రమాలు

గుంతకల్లు, జూన్‌ 16: వైఎ్‌సఆర్‌ చేయూత పథకం అమలులో ప్రవేశపెట్టిన ఓ నిబంధన లబ్ధిదారుల ఏరివేతకు దారితీయనుంది. పథకం లబ్ధికి అర్హత వయసు ఆధారంగా అనర్హులను ఏరి వేయడానికి ప్రభుత్వం కొత్త నిబంధనను ఈ సంవత్సరం తీసుకొచ్చింది. దరఖాస్తుదారులు ఆధార్‌ హిస్టరీని జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా చేయూతకు దరఖాస్తు చేసుకునేవారితోపాటు గత సంవత్సరం లబ్ధిపొందిన వారి నుంచి కూడా ఈ ఆధార్‌ హిస్టరీ రికార్డును వార్డు సచివాలయ సిబ్బంది కోరుతున్నారు. ఈ ఆధార్‌ హిస్టరీ రికార్డు కారణంగా గతేడాది లబ్ధి పొందిన ఎందరో ఈ సంవత్సరం దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అనర్హుల ఏరివేతే లక్ష్యంగా తెచ్చిన ఈ ఆధార్‌ హిస్టరీ నిబంధనతో ఎందరో రెండో విడత ఆర్థికసాయానికి దూరం కానున్నారు. పింఛన్ల విషయంలోనూ ఇలాగే చేశారు. ఈ అక్రమాల కారణంగా ఆర్థికభారం పడుతోందని గ్రహించిన ప్రభుత్వం అనర్హులకు చెక్‌ పెట్టడానికి వైఎ్‌సఆర్‌ చేయూత వర్తింపునకు ఆధార్‌ హిస్టరీ నిబంధనను తెచ్చింది.


ఆధార్‌ సవరణలపై కన్ను

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది వైఎ్‌సఆర్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. ఈ వయసు నిబంధన పరిధిలోలేని ఎందరో మహిళలు తమ ఆధార్‌ రికార్డులను అప్పటికప్పుడు సవరించుకున్నారు. 45 ఏళ్లలోపు ఉన్నవారు, 60 ఏళ్లు దాటిపోయినవారు తమ వయసును ఆ మేరకు ఆధార్‌లో మార్పు చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు.. స్థానిక ఎన్నికలకు ముందు ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ఆధార్‌లో వయసును తగ్గించడానికి, పెంచడానికి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి, పబ్బం గడుపుకున్నారు. ఈ కారణంగా పలువురు అనర్హులు ఈ పథకం పరిధిలోకి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 లక్షల మందికి నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక లబ్ధిని చేకూర్చడానికి ఎంపిక చేశారు. ఈ ఆర్థిక సాయాన్ని నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ఇవ్వడానికి పథకాన్ని రూపొందించి గత సంవత్సరం ఆగస్టులో రూ.18,750 లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో రూ.3,937.90 కోట్లు చేయూత పథకం కింద పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికలకు ముందు ఓట్లను రాల్చుకోవడానికి వైసీపీ నాయకులు తమ వార్డుల్లో ఎందరికో ఆధార్‌ సవరణలతో పింఛన్లు, చేయూత పథకాలు వర్తించేలా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల పండగ పూర్తి కావడంతో ప్రభుత్వానికి ఉన్నట్టుండి అనర్హులపై వేటు వేయాలన్న ఆలోచన వచ్చేసింది. అనుకున్నదే తడవుగా ఈ ఆధార్‌ హిస్టరీ రికార్డు నిబంధన తెచ్చింది. అనర్హుల కారణంగానే ఈ పథకం భారం అవుతోందన్న భావనకు ప్రభుత్వం రావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉండటంతో ఆధార్‌ హిస్టరీ నిబంధనను అస్త్రంగా ప్రయోగించింది. దీంతో రెండో విడతలో కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో చాలా వాటిపై అనర్హత వేటుపడనుంది. గతేడాది లబ్ధిపొంది రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో కూడా వడబోత తప్పని పరిస్థితి ఏర్పడింది.


కొనసాగుతున్న మీసేవ అక్రమాలు

మీసేవ నిర్వాహకులు అడ్డగోలుగా ఆధార్‌ కార్డుల్లో మార్పులు చేస్తున్నారు. గతేడాది ఇబ్బడిముబ్బడిగా మీసేవ కేంద్రాలు ఆధార్‌ రికార్డులను మార్చాయి. ప్రస్తుతం గుంతకల్లు పట్టణం, మండలంలోని గ్రామాల ప్రజలు మద్దికెర, చిప్పగిరి మండలాలకు వెళ్లి, డబ్బు చెల్లించి ఆధార్‌ సవరణలు చేసుకుంటున్నారు. తగిన ఆధారాలు లేకుండా తహసీల్దార్‌ కార్యాలయాల్లో మేనేజ్‌ చేస్తూ అడ్డదారుల్లో ఈ తంతు సాగిస్తున్న మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్లు, చేయూత పథకాల్లో ఉద్దేశపూర్వకంగా ఆధార్‌ టాంపరింగ్‌కు పాల్పడిన దరఖాస్తులు బయటపడతాయి. వాటి ఆధారంగా బాధ్యులైన మీసేవ, ఆధార్‌ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Updated Date - 2021-06-17T06:49:26+05:30 IST