ఆర్భాటం.. అస్తవ్యస్తం..!

ABN , First Publish Date - 2021-04-16T06:41:25+05:30 IST

కరోనా విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అన్నీ అనుకూలంగా ఉంటే ఆర్భాటంగా కార్యక్రమం కొనసాగిస్తున్నారు.

ఆర్భాటం.. అస్తవ్యస్తం..!
జిల్లా కేంద్రంలో టీకా లేదనడంతో నిరాశతో వెనుదిరిగిపోతున్న జనం

వ్యాక్సిన్‌ కొరతతో జనం వెనక్కి..

నిర్ధారణ పరీక్షలకు తప్పని తిప్పలు

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌15: కరోనా విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అన్నీ అనుకూలంగా ఉంటే ఆర్భాటంగా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ముందున్నామని ఆనందపడుతున్నారు. ఆ తర్వాత మాత్రం అదే వాటిపై ఏ మాత్రం ఆలోచించడంలేదు. ఇందుకు కరోనా టీకా పంపిణీ, నిర్ధారణ పరీక్షల విషయంలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలే నిదర్శనం. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే జిల్లాలోని ప్రతి కేంద్రంలోనూ అందుబాటులో ఉంచి, పంపిణీకి ఆదేశాలిస్తున్నారు. బుధవారం జిల్లాలో 36 వేల మందికిపైగా టీకా పంపిణీ చేశామంటూ ఆ నందం వ్యక్తం చేశారు. మరుసటి రోజు గురువారం జిల్లాలో వ్యాక్సిన్‌ ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగింది. కనీసం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా వచ్చిన వారికి టీకా వేయలేకపోయారు. టీకా కొరతతో వెనక్కి పంపించారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉందంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీకా ఉంటే వేస్తున్నారు తప్పా.. రాష్ట్రం నుంచి జిల్లాకు ఎలా తెచ్చుకోవాలో ఆలోచించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే టీకా పంపిణీ జిల్లాలో అస్తవ్యస్తంగా సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలోనూ గందరగోళం సాగుతోంది. కేసులు పెరుగుతున్నా టెస్టింగ్‌ కేంద్రాలు పెంచట్లేదు. జిల్లా సర్వజనాస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలకు వందలాది మంది వస్తున్నారు. ఓ వైపు బాధితులకు చికిత్సలు.. మరోవైపు టెస్టింగ్‌లు చేయలేక ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. టెస్టింగ్‌కు వచ్చిన జనం గంటల తరబడి క్యూలో నిల్చోలేక కష్టాలు పడుతున్నారు. గతంలో ప్రతి పీహెచ్‌సీలోనూ టెస్టింగ్‌ కేంద్రాలు నిర్వహించేవారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి, శాంపిళ్లు సేకరించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే జనం అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికైనా పరీక్ష కేంద్రాలు పెంచాలి. నిర్ధారణ పరీక్షలు వెంటనే చేయించాలి. అప్పుడే అనుమానితుల్లో ఉన్న ఆందోళన తొలిగిపోతుంది.

Updated Date - 2021-04-16T06:41:25+05:30 IST