జిల్లా ఆస్పత్రిలో తీరు మార్చలేరా..?

ABN , First Publish Date - 2021-05-15T06:39:21+05:30 IST

ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు

జిల్లా ఆస్పత్రిలో తీరు మార్చలేరా..?
గంటల తరబడి నేలపైన

ఎందుకీ ఉదాసీనత..!

జిల్లా ఆస్పత్రిలో తీరు మార్చలేరా..?

బాధితులు నిత్యం నరకం అనుభవించాల్సిందేనా?

ప్రత్యామ్నాయంపై పాలకులు సూచించినా అంతేనా..? 

శుక్రవారం కిక్కిరిసిన కొవిడ్‌ ఓపీ

 బెడ్లు లేక.. ఆక్సిజన్‌ అందక అవస్థలు.. 

అనంతపురం వైద్యం, మే14: ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ సేవల తీరు మారదా..? అధికారులు ఎందుకింత ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు? అనేదే అర్థం కాని ప్రశ్నగా మారింది. అసలు వారివి హృదయాలా.., పాషాణాలా..? అన్న తీవ్ర అసంతృప్తి, ఆవేదన బాధితుల్లో కట్టలు తెచ్చుకుంటోంది. కష్టాలు తీర్చాల్సింది పోయి.. పోలీసుల ఆంక్షలు పెట్టి, ఇటు బాధితులు వారి బంధువులను మరింత ఆందోళనకు లోనుచేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల నిర్వహించిన జిల్లా సమీక్షలో కూడా ప్రజాప్రతినిధులు పలువురు.. కరోనా బాధితుల ఆర్తనాదాలు, బాధలు, మరణాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అనంతపురానికి రాకుండా తమ ప్రాంతాల్లో కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసి, బాధితులకు సేవలందించి వారికి భరోసా, ధైర్యం నింపాలని సమీక్షలో కోరారు. మడకశిర, రాప్తాడు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ శమంతకమణి మరో అడుగు ముందుకేసి, బెడ్లు దొరకడం లేదనీ, ఫంక్షన్‌ హాళ్లను కొవిడ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసి, బాధితులందిరికీ వైద్య సేవలు, ఆక్సిజన్‌ అందేలా చూడాలని కోరారు. జిల్లాలో కరోనా బాధితుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో సమీక్షలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా జిల్లాలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ బాధితుల ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం జిల్లా ఆస్పత్రికి పెద్దఎత్తున కొవిడ్‌ బాధితులు తరలి వచ్చారు. ఇక్కడ బెడ్లు లేక, ఆక్సిజన్‌ అందక అనేక కష్టాలు పడుతూ కనిపించారు. గంటల తరబడి బెడ్ల కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఒకవేళ దొరికినా ఆక్సిజన్‌ ఒక్కొక్కరికి 10 నుంచి 20 నిమిషాలు అందిస్తూ ఉపశమనం కల్పిస్తూ వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. కొందరు నేలపైనే పడిపోయారు. మరికొందరు అంబులెన్స్‌లోనే గంటల తరబడి ఉండిపోయారు. కొందరి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక వృద్ధుల పరిస్థితి మరింత దారుణం. మొత్తమ్మీద జిల్లా ఆస్పత్రిలో బాధితుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు టెస్ట్‌ల కోసం పెద్దఎత్తున అనుమానితులు తరలివచ్చారు. దీంతో జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ విభాగం ఇటు బాధితులు, అటు అనుమానితులతో కిటకిటలాడింది.







Updated Date - 2021-05-15T06:39:21+05:30 IST