వెంటాడిన మృత్యువు

ABN , First Publish Date - 2021-04-21T06:27:42+05:30 IST

కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే గంటల తరబడి వైద్యమందక ఓ నిండుప్రాణం బలైంది.

వెంటాడిన మృత్యువు

అత్యవసర వైద్యం అందక కరోనా బాధితుడి మృతి

గంటల తరబడి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు

 వెంటిలేటర్‌ బెడ్లు అందుబాటులో లేక విలవిల

కలెక్టర్‌ స్పందించినా.. అప్పటికే విషమించిన ఆరోగ్యం

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 20 : కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే గంటల తరబడి వైద్యమందక ఓ నిండుప్రాణం బలైంది. ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారే తప్పా.. సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించలేదు. బాధితుడి ఆరోగ్యం మరింత విషమించింది. నరకయాతనలో బంధువుల సాయంతో కలెక్టర్‌ స్పందించినా ప్రాణాలను నిలబెట్టుకోలేకపోయారు. బంధువులు తెలిపిన వివరాలివి. సోమందేపల్లికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడ్డాడు. దీంతో సోమవారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స కోసం బంధువుల సహాయంతో వచ్చాడు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు జేఎనటీయూ సమీపంలోని సూపర్‌ స్పెషాలిటీకి వెళ్లాలని సూచించారు. తీరా అక్కడికి వెళితే వెంటిలేటర్‌ బెడ్లు ఖాళీగా లేవని చెప్పారు. అప్పటికే ఆరోగ్యం విషమించిన బాధితుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. చలించిన బంధువులు ఫోన ద్వారా కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. కలెక్టర్‌ వెంటనే స్పందించి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుప్రతికి వెళ్లాలని సూచించారు. దీంతో అర్ధరాత్రి 12 గంటలకు బత్తలపల్లికి చేరుకుని అడ్మిషన పొందారు. సాయంత్రం 7 గంటలకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వ సర్వజన ఆసుప్రతికి వచ్చిన బాధితుడు... బత్తలపల్లి ఆర్డీటీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అడ్మిషన పొందేందుకు 5 గంటల సమయం పట్టింది. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి గంటల తరబడి వైద్యం అందకపోవడంతో ఆరోగ్యం మరింత విషమించింది. సమయానికి సరైన చికిత్స అందకపోవడంతో బాధితుడు మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలిడిచాడు. అక్కడి నుంచి బంధువులు మృతదేహాన్ని తీసుకుని ధర్మవరం కరోనా శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఇంతజరిగినా బాధితుడి తల్లిదండ్రులకు మృతి చెందిన విషయాన్ని ఎవరూ చేరవేయలేకపోయారు. మెరుగైన వైద్యంతో కోలుకొని ప్రాణాలతో తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. 


అత్యవసర వైద్యం గగనమే..

కరోనా బారిన పడి ప్రాణాపాయస్థితిలో వైద్యచికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బాధితులకు అత్యవసర వైద్యసేవలు అందడంలేదు. అనంతపురం సర్వజనాస్పత్రి కొవిడ్‌ ఓపీలో అత్యవసర చికిత్స అందించేందుకు తగిన వసతులు, మంచాలు అందుబాటులో లేవు. దీంతో వైద్యసేవల్లో ఆలస్యం బాధితుల ప్రాణాలమీదకొస్తోంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందాల్సిన బాధితులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫలానా బాధితులకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు సిపార్సు చేసినా.. అక్కడి నుంచి బెడ్లు లేవని సమాధానం చెబుతున్నారు. చేసేదిలేక బాధితులు నిరీక్షిస్తూ సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. 

Updated Date - 2021-04-21T06:27:42+05:30 IST