అంబులెన్స్‌లోనే నాలుగు గంటలు..!

ABN , First Publish Date - 2021-05-14T06:40:28+05:30 IST

కరోనా బాధితుల ఆర్తనాదాలు అనంతలో కొనసాగుతున్నాయి. సకాలంలో బాధితులకు చికిత్సలు అందక ప్రాణాలు పోతున్నాయి.

అంబులెన్స్‌లోనే నాలుగు గంటలు..!
రోదిస్తున్న నాగరాజు భార్య, కుటుంబ సభ్యులు

బెడ్డు దొరక్క బాధితుడు మృతి

వైద్యుల తీరుపై బంధువుల ఆక్రోశం

చాకు తీసుకుని కుమారుడి హల్‌చల్‌

అనంత సర్వజనాస్పత్రిలో ఘటన

అనంతపురం వైద్యం, మే13: కరోనా బాధితుల ఆర్తనాదాలు అనంతలో కొనసాగుతున్నాయి. సకాలంలో బాధితులకు చికిత్సలు అందక ప్రాణాలు పోతున్నాయి. గురువారం రాత్రి అనంతపురం సర్వజనాస్పత్రిలో ఇలాంటి ఘటనే మరొకటి తలెత్తింది. తాడిపత్రి ప్రాంతం వెంకటరెడ్డిపల్లికి చెందిన నాగరాజు(40) కరోనా బారిన పడ్డాడు. తీవ్ర అయాసంతో బాధపడుతుండగా సాయంత్రం 4 గంటలకు అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇక్కడ కొవిడ్‌ ఓపీలో బెడ్లు లేక వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు బాధితుడు నాగరాజు అంబులెన్స్‌లోనే ఉండిపోయాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో అంబులెన్స్‌లోనే బాధితుడు నాగరాజు ప్రాణాలొదిలాడు. దీంతో ఆయన భార్యతో పాటు కుమారుడు బంధువులు ఒక్కసారిగా వైద్యుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆక్రోశంతో దూషించారు. ఉక్రోశంతో బాధితుడి కొడుకు చాకు తీసుకుని, చంపుతానని దూసుకెళ్లాడు. ఆ కుటుంబ సభ్యుల రోదన, ఆక్రోశంతో ఆస్పత్రిలో తీవ్ర టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. వైద్యులు, సిబ్బంది ఎవరూ వారి వద్దకెళ్లడానికి సాహసించలేదు. వారి రోదన అందరినీ ఆవేదనకు లోనుచేసింది. చివరకు పోలీసులు సద్దిచెప్పి, మృతదేహాన్ని తీసుకెళ్లేలా చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.





Updated Date - 2021-05-14T06:40:28+05:30 IST