కరోనాకి దూరంగా పలు గ్రామాలు

ABN , First Publish Date - 2021-06-13T06:46:19+05:30 IST

కరోనా.. ఈ పేరు వింటేనే హడల్‌. ప్రాణభీతితో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా చిగురుటాకులా వణికిపోయింది.

కరోనాకి దూరంగా పలు గ్రామాలు
పచ్చని చెట్లు, కొండల మధ్య ఉన్న చెర్లోపల్లి

ఊరి విజయం..!

కరోనాకి దూరంగా పలు గ్రామాలు 

ఇతర ఊళ్లకు రాకపోకలు బంద్‌

శుభకార్యాలు నిలుపుదల

సమష్టి నిర్ణయాలు, కట్టుబాట్లు

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

శారీరక శ్రమతో ఆనందమయ జీవనం

ఆత్మస్థైర్యంతో ఆరోగ్యంగా బతుకుతున్న పల్లె ప్రజలు


కరోనా.. ఈ పేరు వింటేనే హడల్‌. ప్రాణభీతితో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా చిగురుటాకులా వణికిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ లక్షల్లో వైరస్‌ బారిన పడుతున్నారు. వేలల్లో ప్రాణాలు కో ల్పోతున్నారు. ఊరూవాడా అన్నింటినీ మహమ్మారి చుట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని గ్రామాలు వైరస్‌ను దరిచేరనీయలేదు. ఊరి దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. కరోనా మొదటి, రెండోవేవ్‌లో కూడా ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలాంటి గ్రామాలు జిల్లాలో కూడా ఉన్నాయి. ఊరి జనం మొత్తం ఒక్కతాటిపైకి రావడమే ఆ ఊళ్ల విజయం. వారే కట్టుబాట్లను విధించుకుని, కచ్చితంగా పాటించారు. వేరే ఊళ్లకు వెళ్లలేదు. వేరే ఊళ్ల వారిని గ్రామంలోకి అనుమతించలేదు. రోజూ శారీరక శ్రమ చే స్తూ.. హాయిగా ఉంటున్నారు. పూర్వీకుల ఆచారాలను అనుసరిస్తూ.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసు కుని, కరోనాను అడ్డుకున్నారు. మహమ్మారిపై విజయం సాధించారు. ఆ గ్రామాల విజయ రహస్యాలు తెలుసుకుందాం..



తండాల్లోకి నో ఎంట్రీ..

గుంతకల్లు: కరోనా రెండు విడతల విజృంభణల్లో  మండలంలోని పలు తండాలు సేఫ్‌ జోన్లుగా మారా యి. కొన్ని తండాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎన్‌ కొట్టాలలో ముస్లిం సామాజికవర్గానికి చెందినవారు మాత్రమే ఉండగా, వారిలో ఇప్పటికి ఒ క్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఎన్‌ తండా, మైనాపురం తండా, పులగుట్టపల్లి చిన్నతండా గ్రామాల్లో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. 



కరోనా అంటో తెలియదు

మా గ్రామంలో ఎవరికీ ఇంతవరకూ కరోనా రాలేదు. అదొక వ్యాధి ఉందనీ, దాని వల్ల ఎలాంటి కష్టం కలు గుతుందో మాకు తెలియదు. కష్టించి పనిచేస్తాము కనుక మాకు ఈ వ్యా ధి రావడంలేదని అనుకుంటున్నాం. మేము ఉదయం పనిచేస్తాము, ఊళ్లోనే ఉంటాం. గ్రామానికి ఇతరులు ఎవ్వరూ రారు. కనుక కరోనా మా ఊరికి వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నాం.

-  ఉమర్‌బాషా, ఎన్‌ కొట్టాల


సమష్టి నిర్ణయాలు.. జాగ్రత్తలతోనే..

అనంతపురం, జూన్‌12(ఆంధ్రజ్యోతి): నార్పల మండలం సిద్దిరాచర్ల పంచాయతీలోని మాలవాండ్లపల్లి జనాభా 583. గ్రామ ప్రజలు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలు, జాగ్రత్తలే ఆ గ్రామాన్ని కరోనాకు దూరంగా ఉంచాయి. గ్రామ పెద్దలు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. శుభకార్యాలు పూర్తిగా బంద్‌ చేశారు. బయటి వారెవరూ గ్రామంలోకి రాకుండా ముందస్తుగా చేసుకున్న తీర్మానాన్ని అమలు చేస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరికి జ్వరం, దగ్గు వచ్చినా వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించి, ఆ మేరకు ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. గ్రామస్థులందరూ ఒకతాటిపై నడవడంతోనే మాలవాండ్లపల్లి కరోనా రహిత గ్రామంగా నిలిచింది.


తీర్మానాలు పాటిస్తున్నాం

కరోనా సెకెండ్‌వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో గ్రా మస్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి, శుభకార్యాలు, జనం గూమిగూడే కార్యకలాపాలు ఏర్పాటు చేయకూడదని తీర్మానించాం. గ్రామంలో ఎప్పటికప్పుడు స్ర్పేయింగ్‌ చేయించడం, మాస్కులు, శానిటైజర్స్‌ వాడాలని సూచిస్తున్నాం. అందుకే మా గ్రామంలో ఇంత వరకూ ఏ ఒక్కరూ కరోనా బారిన పడలేదు. ఇకపై కూడా మరింత జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్‌ గ్రామాన్ని తాకనీకుండా చేస్తాం.

- రామాంజనేయులు, సర్పంచ్‌, సిద్దిరాచర్ల పంచాయతీ


జాగ్రత్తల వల్లే...

మడకశిర:  పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే దిగువరామగిరి గ్రామంలో ఇప్పటివరకు ఒక కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. మడకశిర మండలంలో 110 గ్రామాలుండగా అందులో 28 కరోనా రహిత గ్రామాలుగా నిలిచాయి. రామగిరిలో దాదాపు 450 మంది జనాభా ఉన్నారు. గ్రామం కొండల మధ్యన ఉంది. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో గ్రామం నుంచి పట్టణానికి వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, గ్రామంలోనే ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా సోకలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.




జాగ్రత్తలు పాటించాం...

గ్రామం కొండల మధ్య ఉండటం, ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడటం వలన బయట ప్రాంతాలకు రాకపోకలు సాగించకపోవడంతో ఎవరికీ కరోనా సోకలేదు. గ్రామంలో అందరూ జాగ్రత్తలు పాటించడం, ఆవిరిపట్టడం, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఒకరిఇంటికి ఒకరు వెళ్లకపోవడం వంటి పనుల వల్ల కరోనాను నిరోధించాం.

- నాగరాజు, మాజీ సర్పంచ్‌, దిగువరామగిరి


ఆత్మస్థైర్యంతో జీవనం

కళ్యాణదుర్గం: కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్నప్పటికీ తాము ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తున్నామని పలు గ్రామాల సంచారజాతుల వారు పేర్కొన్నారు. మొదటివేవ్‌ కరోనా నేపథ్యంలో పలు గ్రామాల వారు కట్టుబాట్లు విధించుకున్నారు. దాంతోనే కంబదూరు, కుందుర్పి మండలం తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని గ్రామపెద్దలు చెబుతున్నారు. పూర్వీకులు అనుసరించే ఆచారాలను పాటిస్తుండడంతో తమకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉత్పన్నం కావడంలేదని చెబుతున్నారు.


రోజూ చింతపులుసు: జోగి అక్కమ్మ, జోగప్పకాలనీ, కంబదూరు

గతంలో భిక్షాటన చేస్తూ బతికేవాళ్లం. 2007లో ఆర్డీటీ వంద ఇళ్లకు పైబడి నిర్మించి, జోగప్పకాలనీగా నామకరణం చేసింది. కాలనీలో సుమారు వంద కుటుంబాలు, 500కి పైబడి జనాభా ఉన్నాం. కరోనా అంటే ఏమో మాకు తెలియకుండా బతుకుతున్నాం. రోజూ కూరల్లో చింతపులుసు అధికంగా వాడతాం. చికెన్‌, మటన్‌లోకి కూడా చింతపులుసు ఉండాల్సిందే. అదే మా ఆరోగ్య సంజీవని. రోజూ కూలి పనులకు, బిందెలు, సబ్బుల వ్యాపారానికి వెళ్తుంటాం. రోజూ రాగిముద్ద తప్పకుండా తింటాం. శారీరక శ్రమ కూడా మా ఆరోగ్యానికి కారణం.



ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

గ్రామంలో కట్టుబాట్లు విధించుకున్నాం. కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతోనే ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలోకి కొత్తవారు రా కుండా, ఇక్కడున్న వారు వేరే ఊళ్లకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డాం. గ్రామంలో 70 కుటుంబాలు, 200 మందికిపైగా జనాభా ఉన్నారు. నేటికీ కోడిమాంసం, కోడిగుడ్డును గ్రామంలోకి అనుమతించం.

-  హనుమయ్య, తమ్మయ్యదొడ్డి, కుందుర్పి మండలం


ఊరందరిదీ ఒకటే నినాదం

 పెనుకొండ రూరల్‌: మండలంలోని చెర్లోపల్లిలో 40 ఇళ్లు, 200 మందికిపైగా ప్రజలు నివాసముంటున్నారు. గ్రామస్థులంద రిదీ ఒకటే విధానం, ఒకటే నినాదం. గ్రామం విడిచి ఒక్కరూ బయటకు వెళ్లకూడదు. బయట వారిని గ్రామంలోకి రానీయకూడదు. గ్రామంలో ఎవరికైనా జబ్బుచేస్తే పట్టణానికి పనులపై వెళ్లినపుడు తిరిగి గ్రామంలోకి వచ్చినపుడు బయటే స్నానం చేసి, శానిటైజర్‌ పూసుకుని ఇంటిలోకి ప్రవేశిస్తారు. మొదటి, సెకెండ్‌వేవ్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాకూ దూరంగా ఉండి ఆనందంగా జీవిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు.  


స్వచ్ఛమైన వాతావరణమే మాకు బలం

గ్రామం చుట్టూ మంచి వాతావరణం ఉంది. కొండలు, పచ్చదనంతో ప్రశాంతంగా జీవిస్తున్నాం. తగిన జాగ్రత్తలతో కరోనాకు దూరంగా ఉంటున్నాం. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా మాగ్రామంలో లేదు. 

- రామచంద్ర, చెర్లోపల్లి వాసి

Updated Date - 2021-06-13T06:46:19+05:30 IST