మరణ మృదంగం..!

ABN , First Publish Date - 2021-05-12T07:33:42+05:30 IST

జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

మరణ మృదంగం..!
కిటకిటలాడుతున్న కొవిడ్‌ ఓపీ కేంద్రం

రోజు మొత్తంగా సుమారు 40 మంది..?

జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీలో ఆర్తనాదాలు

పడకల కోసం బాధితుల పడిగాపులు

తీవ్ర అస్వస్థతతో ప్రాణాలిడుస్తున్న వైనం

బాధితులు పెరగడంతో 

చేతులెత్తేస్తున్న వైద్య సిబ్బంది

అనంతపురం వైద్యం, మే 11: జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా బారిన పడి విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తే.. బెడ్లు లేక, ఆక్సిజన్‌ అందక విలవిల్లాడుతూ చనిపోతున్నా రు. జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్‌ ఓపీ విభాగంలో మృత్యుఘోష వినిపిస్తోంది. కొన్ని రోజులుగా ఓపీకి వచ్చిన బాధితులు వివిధ సమస్యలతో సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలిడుస్తున్నారు. మంగళవారం ఓపీకి పెద్దఎత్తున కరోనా బాధితులు తరలివచ్చారు. అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు ఓపీ కేంద్రం వద్ద క్యూ కట్టాయి. ఇక్కడ తలెత్తిన ఘటనలు అందరినీ వేదనకు గురిచేస్తున్నాయి. కళ్లారా చూసిన వారందరూ దేవుడా ఏమిటీ శిక్ష అంటూ వేదన చెందుతూ కనిపించారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపే కొవిడ్‌ ఓపీలో ఆరుగురు బాధితులు మృతిచెందారు. ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. బాధితుడు అల్లా బకా్‌షను సాయంత్రం 3 గంటలకు తీసుకొచ్చారు. బెడ్డు లేక ఆక్సిజన్‌ సమయానికి అందించలేకపోయారు. పరిస్థితి విషమించగా అప్పుడు డాక్టర్లు, సిబ్బంది పట్టించుకున్నారు. అంతలోనే అల్లా బకాష్‌ కన్నుమూశాడు. ఘటనతో భార్య సహీనాబేగం ఓపీ వద్ద పిక్కటిల్లేలా రోదించింది. అయాసమని వస్తే చికిత్స సకాలంలో అందించలేకపోయారనీ, దీంతో భర్తను కోల్పోవాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమైంది. ఉరవకొండ మండలం మునబండకు చెందిన హనుమంతుకు దగ్గు, అయాసం ఉండడంతో చికిత్స కోసం ఆస్పత్రి కొవిడ్‌ ఓపీకి తీసుకొచ్చారు. ఉదయం 10 గంటలకు వచ్చినా బెడ్డు లేక చికిత్స అందించలేదని భార్య లక్ష్మక్క వాపోయింది. తీరా సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనై పడిపోతే అప్పుడు వచ్చారనీ, వెంటనే భర్త హనుమంతు చనిపోయాడని రోదించింది. బెడ్డు లేదన్నారు.. కనీసం మాత్రలు కూడా ఇవ్వలేదనీ, ఇదేమి ఆస్పత్రి అంటూ లక్ష్మక్క కంటితడి పెట్టడం అందరినీ కలచివేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు గంట వ్యవధిలోనే ఆరుగురు ఓపీలో చనిపోవడంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగాయి. బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం శ్మశాన వాతావరణాన్ని తలపించింది. రోజు మొత్తంగా 40 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిని అధికారులు ధ్రువీకరించట్లేదు. ఇలా పదుల సంఖ్యలో అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం. సర్వజనాస్పత్రి ఓపీకి కరోనా బాధితులు క్యూ కట్టారు. అంబులెన్స్‌లు పెద్దఎత్తున బాధితులను తీసుకు వచ్చాయి. ఇక్కడ బెడ్లు లేక, అంబులెన్స్‌లోనే బాధితులు ఉండి పడిగాపులు కాశారు. కొందరు అంబులెన్స్‌లో ఉన్నవారిని అక్కడ వదిలి వెళ్లడంతో నేలపైనే ఉంటూ బెడ్డు కోసం కాపుకాస్తూ కూర్చున్నారు. వైద్యులు, సిబ్బంది సైతం బాధితుల తాకిడికి ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తమ చేతనైనంత వరకు వచ్చిన వారికి సేవలందిస్తున్నారు. కుర్చీల్లో కూర్చోబెట్టి కొందరికి, నేలపైనే మరికొందరికి ఆక్సిజన్‌ వైద్య చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మిషమించడంతో ఉన్నవారికి ఈ సేవలు సరిపోక గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్నారు.



పడకల సంఖ్య తగ్గించే ప్రయత్నాలు?

ఆక్సిజన్‌ కొరత తలెత్తుతున్న నేపథ్యంలో పడకల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి 40 శాతం వరకు బెడ్ల సంఖ్య తగ్గించాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మరణాలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.








పరీక్షల  కోసం జనం కష్టాలు

జిల్లాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అనుమానిత లక్షణాలు ఉన్నవారు కొవిడ్‌ టెస్ట్‌ల కోసం క్యూకడుతున్నారు. మంగళవారం పెద్దఎత్తున పరీక్షల కోసం ఆస్పత్రి ఓపీ కేంద్రం వద్దకు తరలి వచ్చారు. గంటల తరబడి ఎండకు నిరీక్షించినా టెస్టుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీంతో వచ్చిన అనేక మంది జనం టెస్టుల కోసం గంటల తరబడి కష్టాలు పడాల్సి వచ్చింది.

Updated Date - 2021-05-12T07:33:42+05:30 IST