బ్లాక్‌ ఫంగస్‌.. కలకలం..!

ABN , First Publish Date - 2021-05-19T06:33:43+05:30 IST

కరోనాకే జనం విలవిల్లాడిపోతున్న సమయంలో బ్లాక్‌ఫంగస్‌ వైరస్‌ అనంతలో కలకలం రేపుతోంది.

బ్లాక్‌ ఫంగస్‌.. కలకలం..!

అనంతలో ఇద్దరికి నిర్ధారణ

చికిత్స అందిస్తున్న వైద్యులు

బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్త

ముగ్గురు హిందూపురం వాసుల్లో లక్షణాలు

స్టెరాయిడ్‌లు వాడిన 

కరోనా బాధితుల్లో టెన్షన్‌

అనంతపురం వైద్యం, మే 18: కరోనాకే జనం విలవిల్లాడిపోతున్న సమయంలో బ్లాక్‌ఫంగస్‌ వైరస్‌ అనంతలో కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఇతర రా ష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడో ఈ వైరస్‌ ఉందని అనుకుంటూ ఉండగా అనంతలో రెండు బ్లాక్‌ ఫంగస్‌ వైరస్‌ కేసులు బయటపడ్డాయి. కరోనాకు చికిత్స పొందిన హిందూపురం ప్రాంతానికి చెందిన ఒక న్యాయవాది ఈ బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. పామిడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ నంద్యాలలో కరోనా బారిన పడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమె పామిడికి వచ్చిన తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఇద్దరికి జిల్లా కేంద్రంలోనే చికిత్సలు అందిస్తున్నారు. అందులో ఒకరిని జిల్లా సర్వజనాస్పత్రి ఈఎన్‌టీ వార్డులో, మరొకరికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో అనంతకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి మరణించినట్లు కూడా ప్రచారం సాగుతోంది.  బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల వ్యవహారం బయటకు పొక్కకుం డా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఆరాతీయగా చివరకు వైద్యాధికారులు జిల్లాలో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైన విషయం వాస్తవమేనని తెలిపారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి, ఆందోళన మొదలైంది. కరోనా నుంచి కోలుకున్నవారు మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ ఫంగస్‌ పెరిగిపోవడానికి కరోనా సమ యంలో అధికంగా స్టెరాయిడ్స్‌ వినియోగించడమే కారణ మని ఇప్పటికే ఐసీఎంఆర్‌ చెబుతోంది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ కేసులు పెరగడంతో కేంద్రం కూడా సీరి యస్‌గా దృష్టి సారించింది. ఈ ఫంగస్‌ సోకిన వారిలో అధిక మంది మృతి చెందుతున్నట్లు కూడా వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి భయంకరమైన బ్లాక్‌ ఫంగస్‌ వైరస్‌ అనంతలో వెలుగులోకి రావడం అందరిలో ఆందోళన రేపుతోంది.


రెండు కేసులు వాస్తవమే

జిల్లాలో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైన విషయం వాస్తవమే. వారిద్దరికీ జిల్లా కేంద్రంలో చికిత్సలు అం దిస్తున్నాం. వైద్యులు వారికి ప్రత్యేకంగా పరీక్షలు చేసి, అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఈ వైర్‌సకు చికిత్స ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశాం.

- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌


హిందూపురంలో ముగ్గురికి లక్షణాలు

హిందూపురం: పట్టణంలో బ్లాక్‌ ఫంగస్‌ ఆందోళన రేపింది. ముగ్గురు బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీనారాయణ పది రోజుల కిందట కొవిడ్‌ బారిన పడి పట్టణంలో తేజ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది, రెండు రోజుల కిందట ఇంటికొచ్చడు. హోం ఐసోలేషన్‌లోనే ఉండగా లక్ష్మీనారాయణకు కన్ను వాపు రావడంతో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలుగా భయందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని సోమవారం బెంగుళూరుకు తీసుకెళ్లారు. అక్కడి హెచ్‌జీసీ ఆస్పత్రిలో వైద్యులు బ్లాక్‌ఫంగ్‌సగా నిర్ధారించారనీ, శస్త్రచి కిత్స చేసి, ఓ కన్ను తొలగించినట్లు బాధితుడి బంధువులు తెలిపారు. హిందూపురం మండలం చెలివెందులకు చెందిన మహిళ రాధ పంటినొప్పితో నాలుగు రోజుల కిందట అనంతపురం వెళ్లారు. అక్కడి నుంచి బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది,మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లారు. హిందూపురంలోనే ఇద్దరికి బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు వెలుగుచూడడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. చికిత్స సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడటంతో బెంగుళూరులో చికిత్సలు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పెనుకొండ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ముద్దిరెడ్డిపల్లి, చెలివెందుల్లో ఇద్దరికి బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో బెంగుళూరు, కర్నూలులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వచ్చిందనీ, ఆరా తీస్తున్నామన్నారు. బ్లాక్‌ఫంగ్‌సను ధ్రువీకరించలేదు.

Updated Date - 2021-05-19T06:33:43+05:30 IST