వెంటాడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-08-06T06:34:17+05:30 IST

జిల్లాను బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది.

వెంటాడుతున్న బ్లాక్‌ ఫంగస్‌
ఫంగస్‌ బాధితులు చికిత్స పొందుతున్న విభాగం

జిల్లాలో 665కు చేరిన బాధితులు

305 మందికి శస్త్ర చికిత్సలు

99 మంది మృతి

మెరుగుపడని వైద్య సేవలు

పది రోజులుగా మాత్రలు లేవు..

ఆస్పత్రి చుట్టూ బాధితులు ప్రదక్షిణలు

ప్రాణాలు కాపాడాలంటూ గగ్గోలు

అనంతపురం వైద్యం, ఆగస్టు 5: జిల్లాను బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది. జూన్‌లో మొదలైన ఈ కేసులతో ఇప్పటికే 665 మంది బాధితులయ్యారు. కరోనా బారినపడి మళ్లీ ఫంగ్‌సతో పోరాటం సాగిస్తున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రారంభం కంటే ప్రస్తుతం ప్రభావం తగ్గినా ప్రతి రోజూ మూడు, నాలుగు ఫంగస్‌ కేసులు జిల్లా ఆస్పత్రిలో నమోదవుతున్నాయి. అయితే వైద్యాధికారులు ఇన్నాళ్లూ ఫంగస్‌ బాధిత కేసులను గుట్టుగా ఉంచారు. బాధితులు పెరుగుతున్నా జిల్లా సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడలేదు. అవసరమైన వసతులు, మందులు, ఇంజెక్షన్లతో పాటు వైద్యులు కూడా లేకపోవడంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 665 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా, ఇందులో 305 మం దికి శస్త్ర చికిత్సలు చేసినట్లు సర్వజన ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారిలో సగం మంది వరకు  చికిత్సతోనే నయం కాగా, ఇతరులకు శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే ఫంగస్‌ బారినపడి 99 మంది ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇంతమంది మరణించినా విషయం బయటకు పొక్కకుండా వైద్యాధికారులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వందలాది మంది బాధితులు శస్త్ర చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు.


ఆస్పత్రిలో మందులు ఖాళీ..

జిల్లా సర్వజనాస్పత్రి తీరు ఫంగస్‌ బాధితలను మరింత భయపెడుతోంది. పేరుకు మాత్రం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం.. అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామని గొప్పలుపోతున్నారు. వార్డుల్లో బాధితులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల చికిత్సలో లైపోసోమాల్‌ యాంపోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్లు, మాత్రలు కీలకం. ఈ మందులు ఆస్పత్రిలో ఖాళీ అయ్యాయి. అడ్మిషన్‌ పొందిన బాధితులకు కోర్సు ప్రకారం ఇంజెక్షన్లు రోజుకు ఐదు చొప్పున వేయాల్సి ఉంటుంది. ఇవేవీ అందుబాటులో లేవు. మరోవైపు ఆపరేషన్‌ చేసుకుని డిశ్చార్జ్‌ అయిన బాధితుల గోడు పట్టించుకునే వారు లేరు. వారు చికిత్స కొనసాగింపులో భాగంగా ఇంటి వద్ద యాంపోటెరిషన్‌-బీ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 300 ఎం.జీ మాత్రలు తీసుకోవాలి. అయితే ఆస్పత్రికి 100 ఎం.జీ మాత్రలు సరఫరా అవుతున్నాయని, ఈ లెక్కన రోజూ మూడు మాత్రలు వేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా కోలుకున్న ఫంగస్‌ బాధితుడి ఆరోగ్యాన్ని బట్టి నెల నుంచి మూడు నెలల వరకు ఈ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే గత పది రోజులుగా యాంపోటెరిషన్‌ మాత్రలు సరఫరా కాలేదు. దీంతో శస్త్ర చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన వారు ఈ మాత్రల కోసం ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల నుంచి బాధితులు జిల్లా సర్వజనాస్పత్రికి వచ్చి ఈ మాత్రల కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి మాత్రలు లేక.. చికిత్స అందక మళ్లీ అల్లాడిపోతున్నారు. ఆస్పత్రిలో రీ అడ్మిషన్‌తో చికిత్స పొందాల్సి వస్తోంది. 


కంటి శస్త్ర చికిత్సలు నో..

ఫంగస్‌ బారిన పడి కంటి వ్యాధికి గురైన బాధితులకు జిల్లా ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయడం లేదు. ప్రస్తుతం వచ్చిన 665 ఫంగస్‌ కేసుల్లో అనేక మందికి కళ్లు ఎర్రబారడం, దెబ్బతినడం జరిగాయి. అయితే ఇందులో దాదాపు 25 మందికి కంటి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తోందని జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్ణయించారు. అయితే ఇక్కడ ఫంగస్‌ బాధితులకు కంటి ఆపరేషన్లు చేయడానికి వసతులు, వైద్యులు లేరు. దీంతో ఇతర జిల్లాలకు రెఫర్‌ చేసి పంపిస్తున్నారు. ప్రొఫెసర్లతో పాటు న్యూరో డాక్టర్‌ ఈ కంటి ఆపరేషన్ల సమయంలో ఉండాలి. అయుతే ఇక్కడ ఒక్కరే సీనియర్‌ కంటి వైద్య ప్రొఫెసర్‌ ఉండడంతో పాటు న్యూరో సర్జన్‌ లేకపోవడంతో తిరుపతి, కర్నూలుకు రెఫర్‌ చేసి పంపుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. మిగిలిన బాధితులు ఎక్కువమంది గొంతు, దవడ, కపాలం కింద భాగంలో ఫంగస్‌ చేరి దెబ్బతినగా వారికి జిల్లా ఆస్పత్రిలోనే ఈఎన్‌టీ విభాగం ఆధ్వర్యంలో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. 


వైద్యం అందక అల్లాడుతున్న బాధితులు

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు సరైన వైద్య సేవలు, సకాలంలో మందులు అందక అల్లాడిపోతున్నారు. ఆరోగ్యంగా కోలుకున్నామన్న వారు కూడా మందులు అందక మళ్లీ అనారోగ్యం బారిన పడుతున్నారు. కాళ్లు, చేతులు వాస్తుండడంతో భయంతో ఆస్పత్రికి పరుగులు తీసి అడ్మిషన్‌ పొందుతున్నారు. బయట మాత్రలు కొనాలంటే రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు అవుతుందని, పేదలు అంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చి కొనాలని వాపోతున్నారు. పైగా ఆస్పత్రిలోని ఫంగస్‌ వార్డుల్లో కూడా వసతులు లేవు. మందులు అందడం లేదు. అడిగితే డాక్టర్లు, నర్సులు పట్టించుకోవడం లేదు. మా ప్రాణాలు మీరైనా కాపాడండి అంటూ బాధితులు కంటతడి పెట్టారు. జిల్లా సర్వజనాస్పత్రిలో ఫంగస్‌ బాధితులు వైద్య సేవలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. 






మీరే మా ప్రాణాలు కాపాడాలి

నా కూతురు ఉషారాణి ఫంగస్‌ బారిన పడడంతో అడ్మిట్‌ చేశాం. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. బాధితులందరూ మందులు అందక, డాక్టర్లు పట్టించుకోకపోవడంతో భయపడి చచ్చిపోతున్నారు. ఏదైనా అడిగితే సూపరింటెండెంట్‌కు, ఆర్‌ఎంఓకు చెప్పుకోండని చెబుతున్నారు. మీరే పరిష్కారం చూపాలి. బాధితుల ప్రాణాలు కాపాడాలి అంటూ వేడుకున్నారు. 

- యలమందయ్య, అనంతపురం


మాత్రలు మింగక కాళ్లు, చేతులు వాపులొచ్చాయి...

నాది గుంతకల్లు. ఫంగస్‌ బారిన పడగ జిల్లా ఆస్పత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నా. ఇంటికి వెళ్లినా మూడు నెలలు రోజుకు మూడు మాత్రలు వేసుకోవాలని చెప్పా రు. మాత్రలు లేకపోవడంతో పది రోజులుగా మింగలేదు. రెండు సార్లు ఆస్పత్రికి వచ్చా. అదిగోఇదిగో అంటున్నారు. బయట రూ.6 వేలు పెట్టి కొని మూడు రోజులు వాడాను. మళ్లీ వచ్చినా మాత్రలు లేవంటున్నారు. కాళ్లు, చేతులు వాపు రావడంతో ఆస్పత్రిలో మళ్లీ అడ్మిట్‌ అయితే ఇంజెక్షన్‌ వేస్తామన్నారు. అందుకే జాయిన్‌ అయ్యా. 

- రవికుమార్‌, గుంతకల్లు


మాత్రలు లేని విషయం వాస్తవమే... 

ఫంగస్‌ బాధితులకు యాంపోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్‌, మాత్రలు ముఖ్యం. శస్త్ర చికిత్స అయిన తర్వాత  కోర్సు మేరకు ప్రతి రోజూ మూడు మాత్రలు వేసుకోవాలి. అయుతే ఈ మాత్రలు పది రోజులుగా లేవు. సరఫరా లేకపోవడంతో సమస్య వచ్చింది. ప్రతి రోజు రాష్ట్ర అధికారులతో మాట్లాడుతు న్నాం. కేంద్రం నుంచి వచ్చిన వెంటనే పంపిస్తామంటున్నారు. మాత్రలు మింగక అనారోగ్యం బారిన పడిన వారిని మళ్లీ అడ్మిట్‌ చేసుకొని ఇంజెక్షన్‌ ఇస్తున్నాం. ఇంతకన్నా మా చేతుల్లో ఏమీ లేదు.    

- డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌, ఈఎన్‌టీ విభాగాధిపతి

Updated Date - 2021-08-06T06:34:17+05:30 IST