పోటీ నుంచి తప్పుకోవటంపై పెదవి విరుస్తున్న బీజేపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-03-05T06:46:09+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించ ుకోవటం ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రేపుతోంది.

పోటీ నుంచి తప్పుకోవటంపై పెదవి విరుస్తున్న బీజేపీ శ్రేణులు

నేతల వైఖరిపై  విమర్శల వెల్లువ

358 వార్డులకు 116  నామినేషన్లు దాఖలు

37 విత్‌డ్రా.. 79 వార్డుల్లోనే పోటీ

ఇదీ జిల్లాలో బీజేపీ  సంస్థాగత బలం

అనంతపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించ ుకోవటం ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రేపుతోంది. నేతల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ జిల్లాలో సంస్థాగతంగా బలం పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వానికి ఆది నుంచీ అదే విషయాన్ని నూరిపోస్తూ వస్తోంది. స్థానిక నాయకత్వలోపమో, ఏమో గానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తీవ్ర నిరుత్సాహానికి లోనుచేస్తున్నాయన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. 2024లో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు ప్రతి సమావేశంలోనూ చెబుతూ వస్తున్నారు. ఆ నేతల ఆశల దిశగా.. జిల్లాలో పరిస్థితులు కనిపించడం లేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఏదైనా రాజకీయ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలంటే ఎన్నికలే ప్రధానం. ఆ ఎన్నికల్లో ఫలితాలు, ఓట్ల శాతం ఆధారంగా రాజకీయ పార్టీ బలపడిందా..? లేదా, అన్నది తేటతెల్లమవుతుంది. జిల్లాలో భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులకు ఒక్క సర్పంచ్‌ స్థానం కూడా దక్కలేదు. వార్డు సభ్యుడిగా కూడా ఆ పార్టీ మద్దతుదారుడు గెలుపొందిన దాఖలాల్లేవు. పంచాయతీ ఎన్నికలు పార్టీలతో ప్రమే యం లేకుండా జరిగాయనే అనుకున్నా.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతున్నవే. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్‌తో పాటు 8 మున్సిపాల్టీలు, రెండు నగర పంచాయతీలతో కలిపి మొత్తం 358 డివిజన్లు, వార్డులకు సంబంధించి గతేడాది మార్చిలో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 358 డివిజన్లు, వార్డులకుగానూ భారతీయ జనాతా పార్టీ అభ్యర్థులు 116 నామినేషన్లు దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడటంతో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 2, 3 తేదీల్లో నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ సాగింది. 116 నామినేషన్లు బీజేపీ తరపున దాఖలుకాగా... అందులో 37 ఉపసంహరించుకున్నారు. 79 వార్డుల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడో విషయం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు లోనుచేస్తోంది. ఆ పార్టీ వర్గాల నుంచే ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావాలంటే ఎన్నికల్లోనే సత్తా చాటాల్సి ఉందనీ, ఎందుకు నామినేషన్లు వేశారు..? ఎందుకు విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిందన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ ఏకగ్రీవాల కోసం ఒత్తిడి తెస్తే.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులపైనే తెస్తుంది కానీ.. బీజేపీ అభ్యర్థులపై తెచ్చే అవకాశాలు దాదాపుగా లేవనే సందేహాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు విత్‌డ్రాలు చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇక్కడే నేతల వైఖరి విమర్శలకు తావిస్తోందన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఇలా అయితే పార్టీ సంస్థాగతంగా ఎలా బలోపేతమవుతుందో నేతలే బదులివ్వాలన్న ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుడటం గమనార్హం.

Updated Date - 2021-03-05T06:46:09+05:30 IST