మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

ABN , First Publish Date - 2021-03-08T06:47:56+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

ఓట్ల కొనుగోలుకు వైసీపీ నేతల కొత్త ఎత్తుగడలు

వలంటీర్ల ద్వారా ఫోన్‌ నెంబర్ల సేకరణ

ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌...?

అభ్యర్థి కరపత్రంతో 

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని మెసేజ్‌

అనంతపురం, మార్చి7(ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. వారం రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు, వారి అనుచరగణంతో సందడిగా మారిన వీధులన్నీ బోసిపోనున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండటంతో మిగిలిన 36 గంటలు ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలపైనే అధికార పార్టీ నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓట్లను కొనుగోలు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో సరికొత్త ఎత్తుగడలను ఎంచుకున్నారు. ఫోన్‌పే... గూగుల్‌పే ద్వారా ఓటర్లకు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసేలా పక్కా వ్యూహం అనుసరిస్తున్నారు. ఇందుకు వార్డు వలంటీర్ల ద్వారా ఫోన్‌ నెంబర్లను సేకరించుకొని ఆ దిశగా.... ఓటర్లకు ప్రలోభాల గాలం వేస్తున్నారు. ఇలా జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు.... ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, కదిరి మున్సిపాల్టీలు, మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీలన్నింటిలోనూ ఇదే వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు సమాచారం. ఆయా మున్సిపాల్టీల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే వైసీపీ ముఖ్య నేతలు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా, ప్రలోభపెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనడంలో సందేహం లేదు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నా, సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న వారిపైనా అధికార పార్టీ నేతల బెదిరింపులు సర్వసాధారణమయ్యాయన్న విమర్శలు లేకపోలేదు. అనంతపురం కార్పొరేషన్‌లో ఓ టీడీపీ అభ్యర్థి పోలింగ్‌ రెండ్రోజులు ఉందన గా కండువా మార్చారంటే పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 


వైసీపీ నేతల సరికొత్త ఎత్తుగడ..

సంక్షేమ పథకాలు ఓట్లు రాలుస్తాయోలేదోనన్న సందేహం అధికార పార్టీ నేతల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తోంది. ఆయా మున్సిపాల్టీల్లో ఏకగ్రీవాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా  ఫలించలేదు. ధర్మవరంలో 10, గుంత కల్లులో 3, గుత్తిలో 6, తాడిపత్రిలో 2 వార్డులు మాత్రమే ఏకగ్రీవాలు చేసుకున్నారు. అన్నింటా పోటీ తీవ్రం కావడంతో పాటు ప్రచారంలోనూ హోరాహోరీగా తలపడటంతో ఫలితాలు ఏవిధంగా ఉంటాయోనన్న అభద్రతాభావం అధికార పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చే స్తోంది. ఈ నేపథ్యంలో గెలుపునకు ప్రలోభాలే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అందులో భాగంగా ముందుగా ఆ పార్టీకి అనుకూలూరుగా మారారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న వలంటీర్ల ద్వారా ఫోన్‌ నెంబర్లను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఏ డివిజన్‌కు ఆ డివిజన్‌, ఏ వార్డుకు ఆ వార్డులో ఓటర్లకు అధికార పార్టీ అభ్యర్థి ఫొటో, ఫ్యాన్‌ గుర్తుతో కూడిన బ్యాలెట్‌ నమూనా, ప్రజాసంక్షేమ పథకాల పట్టికతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు పక్కా వ్యూహంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని మెసేజ్‌లు సైతం పంపుతున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాల్టీల్లో ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కొందరు ఓటర్ల ద్వారా అందిన సమాచారం. అనంతపురం కార్పొ రేషన్‌లో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ప్రత్యేకంగా డివిజన్‌కు ఒకరికి బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.


ప్రలోభాలకు పోలీసులు అడ్డుకట్ట వేసేరా...? 

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాల పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది.  ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఓట్లను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు సిద్ధం చేసుకున్నట్టు తెలు స్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కర్ణాటక మద్యం ఏరులై పారింది. డబ్బు పంపిణీ యథేచ్ఛగా కొనసాగింది. మద్యం రవాణా చేసే విషయంలో ఇతరులను అరెస్టు చేయడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారే తప్పా.... రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులెవరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా... మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రలోభాలకు భారీగా తెరలేపుతున్నారు. ఆ ప్రలోభాలకు పోలీసులు అడ్డుకట్ట వేసేరా అనేదే ప్రస్తుతం శేష ప్రశ్నగా మిగిలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Updated Date - 2021-03-08T06:47:56+05:30 IST