గళం వినిపించేరా ?

ABN , First Publish Date - 2020-11-30T05:50:37+05:30 IST

పంచడానికి తప్పా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో జిల్లాలో అభివృద్ధి కుంటుపడింది.

గళం వినిపించేరా ?

సమస్యలు ప్రస్తావించి ఎమ్మెల్యేలు నిధులు తెస్తారా

అభివృద్ధిపై ఆశలతో ప్రజలు

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తెచ్చేరా

అనంతపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పంచడానికి తప్పా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో జిల్లాలో అభివృద్ధి కుంటుపడింది. చేపట్టిన పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో సమస్యలపై తమ వాణిని వినిపించి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొస్తారా...? లేదా ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఉసూరుమనిపిస్తారా...? అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాల్లోని సమస్యలతో పాటు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామంటున్నారు. జిల్లా అభి వృద్ధికి అవసరమైన నిధులు, పెండింగ్‌ బిల్లులు, పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా గొంతుక వినిపిస్తామని చెబుతున్నారు.  వీరి మాటలపై నమ్మకంతో ప్రజలు అభివృద్ధిపై ఆశగా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామంటున్న ఎమ్మెల్యేల అభిప్రాయం వారి మాటల్లోనే..


రైతు సమస్యలే ప్రధాన అజెండా.... 

- శంకరనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలే అజెండాగా మాట్లాడతా. నేను ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలతో పాటు జిల్లాలోని ప్రధాన సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వేరుశనగ పంట దెబ్బతింది. తాజాగా నివర్‌ తుఫాన్‌తో వరి, ఇతరత్రా పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం మా ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తోంది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు రైతులకు అందే విధంగా చొరవ చూపాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తా.


రైతులకు వరద సాయమే ప్రధాన డిమాండ్‌ 

- పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే, ఉరవకొండ

జిల్లాలో ఖరీఫ్‌, రబీలలో సాగుచేసిన పంటలు అధిక వర్షాలు, నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్నాయి. తద్వారా రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయారు. బాధిత రైతులకు వరద సాయం రూపంలో పంట నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్‌ చేస్తా. వర్షాలతో నానిన పంటను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రస్తావిస్తా. 


అభివృద్ధి పనులకు నిధులు అడుగుతా 

- అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్‌

జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంలో రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టేందుకు విరివిగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. ఎన్నికల హామీల్లో భాగంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. 


సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం నిధులు అడుగుతా 

- పెద్దారెడ్డి, ఎమ్మెల్యే,  తాడిపత్రి

నియోజకవర్గంలో రైతులు, ప్రజలకు అవసరమైన సాగు, తాగునీటి కోసం ప్రత్యేకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతా. చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌ల ఆయకట్టుకు ఏర్పాటుచేసిన కాలువలకు సంబంధించి పెండింగ్‌ పనులు పూర్తిచేయడంతో పాటు చాగల్లు నుంచి ఏ. కొండాపురం వరకు తవ్విన కాలువ పెండింగ్‌ పనులు పూర్తి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. యాడికి కాలువకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు, సరఫరాపై ప్రస్తావిస్తా. పండ్లతోటల అభివృద్ధి, రవాణా, నిల్వ చేసుకునేందుకు గిడ్డంగుల నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తా.


చేనేత, రైతు సమస్యలు ప్రస్తావిస్తా 

- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే,  ధర్మవరం

నియోజకవర్గంలో చేనేతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. కరోనాతో పాటు తుఫాన్‌ కారణంగా చేనేత కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలని కోరుతా. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తా విస్తా. నివర్‌ తుఫాన్‌ కారణంగా వందలాది ఎకరాల్లో వరి, దోస తదితర పంటలను రైతులు నష్టపోయారు. వారికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా. 


పంట నష్ట పరిహారం కోసం విన్నవిస్తా 

- పీవీ సిద్ధారెడ్డి,  ఎమ్మెల్యే, కదిరి

నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. తుఫాన్‌ వల్ల నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, టమోటా, ఇతర పంట లు దెబ్బతిన్నాయి. బాధిత రైతులందరికి పరిహారంతో పాటు బీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తా. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు బాగా పడినప్పటికి అధిక వర్షాల వల్ల వేరుశనగ పూర్తిగా దెబ్బతినడంతో  రైతులు నష్టపోయారు. వారందరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.


 కృష్ణా జలాలతో చెరువులన్నింటినీ నింపాలని కోరతా 

- డాక్టర్‌ తిప్పేస్వామి,  ఎమ్మెల్యే, మడకశిర

హంద్రీనీవా కాలువ వెడల్పు చేయడంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని చెరువులన్నింటినీ కృష్ణాజలాలతో నింపేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అదే విధంగా రత్నగిరి, ముదిగుబ్బ, అమరాపురం, శివరం తదితర ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తా. వర్షాలు, నివర్‌ తుఫాన్‌లో నష్టపోయిన రైతులను  ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరతా. 


శాశ్వత నీటి కేటాయింపే ప్రధాన అంశం 

- జొన్నలగడ్డ పద్మావతి,  ఎమ్మెల్యే, శింగనమల

శింగనమల చెరువుతో పాటు మరో 24 చెరువులకు తాగు, సాగు నీటి కోసం శాశ్వత కేటాయింపులకు ప్రత్యేక జీఓ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. నియోజకవర్గంలో 75 శాతం మంది ప్రజలు వ్యవసాయం పై ఆదారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ప్రతి ఏటా హెచ్చెల్సీ, హంద్రీనీవా ద్వారా చెరువులు నింపాలని సీఎం దృష్టికి తీసుకెళ్తా. నార్పల మండల కేంద్రాన్ని మున్సిపాల్టీ చేయాలని కోరుతా. శింగనమల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిధులు విడుదల చేసే అంశాన్ని ప్రధానంగా మాట్లాడుతా. 


ఏసీఎస్‌ మిల్లు సమస్యను ప్రస్తావిస్తా 

- వై. వెంకటరామిరెడ్డి,  ఎమ్మెల్యే, గుంతకల్లు

గుంతకల్లులోని ఆంధ్రా కో-ఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్లు సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. స్పి న్నింగ్‌ మిల్లు ప్రదేశంలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏ ర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభి స్తాయన్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తా. గుం తకల్లు పట్టణాభివృద్ధికి నిధుల రాబట్టేందుకు ప్రయత్నిస్తా. 


రిజర్వాయర్‌ల నిర్మాణానికి నిధులు కోరుతా 

- తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ఎమ్మెల్యే, రాప్తాడు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు అవసరమైన రిజర్వాయర్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నాడు-నేడు పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతా. ఖరీఫ్‌, రబీలో పంటనష్టపోయిన రైతులందరికీ పంటనష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ముఖ్య మంత్రికి విజ్ఞప్తి చేస్తా. 

Updated Date - 2020-11-30T05:50:37+05:30 IST