ఆశలు నెరవేరేనా ?

ABN , First Publish Date - 2020-08-11T10:21:19+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నిరుపేదల సొంతింటి కలకు గ్రహణం పట్టింది.

ఆశలు నెరవేరేనా ?

పేదల సొంతింటి కలకు గ్రహణం

టిడ్కో భవనాల్లో క్వారంటైన్‌ కేంద్రం 

అద్దె గృహాల్లో లబ్ధిదారులు


ఆత్మకూరు, ఆగస్టు 10 : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నిరుపేదల సొంతింటి కలకు గ్రహణం పట్టింది. ఏడాదిన్నర క్రితం అధికారులు అట్టహాసంగా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించి, గృహ ప్రవేశం చేయించారు. కాని కొన్ని మౌలిక వసతులు కొరవ ఉండడంతో లబ్ధిదారులు ఇళ్లల్లో చేరడం ఆలస్యం అలస్యమైంది. ఆ లోగా శాసనసభ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో టిడ్కో చేపట్టిన భవన సముదాయాలకు గ్రహణం పట్టింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ప్రంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం చేస్తుంది. ఈ సారైనా తమకు గృహాలు కేటాయిస్తారని ఆశిస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురయ్యేలా ఉంది.


క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు

 2018 ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం జరిగినా, లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడంలో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మరి విజృంభించడంతో మూడు నెలల నుంచి టిడ్కో భవన సముదాయంలో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంకా క్వారంటైన్‌ కేంద్రం కొనసాగుతూనే ఉంది.


అద్దె ఇళ్లలో అగచాట్లు

 ఈ క్రమంలో లబ్ధిదారులకు గృహప్రవేశం కలగానే మిగిలేలా ఉంది. కొందరు లబ్ధిదారులు తమ వాటా కింద రూ.1,00,000 చెల్లించి ఉన్నారు. మరికొందరు రూ. 25,000 చెల్లించి ఉన్నారు. మరి కొంతమంది లబ్ధిదారులకు అధికారులే బ్యాంకు రుణాలు ఏడాది క్రితమే ఇప్పించి ఉన్నారు. ఇంకా ఇళ్లల్లో చేరిక ఆలస్యం అయితే వారు అద్దె గృహాల్లో అద్దెలు కట్టడడంతోపాటు అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు, బ్యాంకు లో రుణాలు వాయిదాలు చెల్లించక తప్పదు. 

Updated Date - 2020-08-11T10:21:19+05:30 IST