ఉప ఎన్నికల నగరా మోగింది!

ABN , First Publish Date - 2022-05-26T05:51:55+05:30 IST

దివంగత మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఫిబ్రవరి 21వ తేది హఠాణ్మరణానికి గురైన విషయం తెలిసిందే.

ఉప ఎన్నికల  నగరా మోగింది!
ఆత్మకూరు ముఖ చిత్రం

 ఆత్మకూరు ఏకగ్రీవమా.. పోటీనా!?

వైసీపీ అభ్యర్థిగా విక్రమ్‌ రెడ్డి

టీడీపీ విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠ

బరిలోకి దిగుతామని ఇదివరకే ప్రకటించిన బీజేపీ


ఆత్మకూరు ఉప ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉపఎన్నికల షెడ్యూల్‌ బుధవారం విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీన ఉప నోటిఫికేషన్‌ విడుదల, జూన్‌ 6వ తేదీన నామినేషన్లు, 23న పోలింగ్‌, 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే, ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేదా పోటీ జరుగుతుందా అనే ఉత్కంఠ  రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


నెల్లూరు, మే 25 (ఆంధ్రజ్యోతి) : దివంగత మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఫిబ్రవరి 21వ తేది హఠాణ్మరణానికి  గురైన విషయం తెలిసిందే. ఈ స్థానానికి గౌతంరెడ్డి వారసుడిగా ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్‌రెడ్డిని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. రాజకీయాలకు దూరంగా, పూర్తిగా వ్యాపారానికే పరిమితమైన విక్రమ్‌రెడ్డి కుటుంబ సభ్యుల కోరిక మేరకు రాజకీయ ఆరంగేట్రం చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు పరిచయమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతేగాక ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆరంభించారు. ఇప్పటివరకు ఈయనకు నియోజకవర్గ ప్రజలతో పరిచయం లేకున్నా, ప్రజలకు ఇతనితో అనుబంధం ఏర్పడకున్నా మేకపాటి కుటుంబ వారసుడిగా ఇతని పేరు వేగంగానే  ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈయన ఏకగ్రీవంగా ఎన్నికవుతారా,  లేదా పోటీని ఎదుర్కోబోతున్నారా? అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.  


టీడీపీలో ఉత్కంఠ

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. దీని విషయమై ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. ఆ క్రమంలో ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ జిల్లా నాయకత్వం అభిప్రాయం. అయితే ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయకపోవడంతో పార్టీ శ్రేణులు, ఇతర రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయత్వం ఇది వరకే ప్రకటించింది. ఇది జరిగితే ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అవకాశం లేనట్లే. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సమర్థుడైన అభ్యర్థి కోసం ఆ పార్టీ సీనియర్‌ నాయకులు గాలిస్తున్నారు.


రంగంలోకి మేకపాటి బంధువు

మరోవైపు మేకపాటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, ఈ ఎన్నికల ద్వారా మేకపాటి కుటుంబంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వెలుగులోకి తెస్తానని మర్రిపాడు మండలానికి చెందిన బిజివేముల రవీంద్రనాధరెడ్డి ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు.  బీజేపీ మద్దతు కోసం ఈయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తే ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీకి ఏకగ్రీవం అవుతుందా!? లేదా అధికార పార్టీకి పోటీ అనివార్యం అవుతుందా!? వేచి చూడాల్సిందే.  

Updated Date - 2022-05-26T05:51:55+05:30 IST