ఏటీఎంలలో పెట్టాల్సిన నగదుతో పరార్‌!

ABN , First Publish Date - 2021-07-28T04:53:10+05:30 IST

ఏటీఎంలలో నింపాల్సిన రూ.50 లక్షల నగదుతో డ్రైవర్‌ ఉడాయించాడు. మంగళవారం నెల్లూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

ఏటీఎంలలో పెట్టాల్సిన నగదుతో పరార్‌!
పరారయ్యింది ఈ వ్యానలోనే..!

రూ.50లక్షలతో ఉదాయించిన డ్రైవర్‌

పోలీసుల ముమ్మర గాలింపు


నెల్లూరు (క్రైం), జూలై 27 : ఏటీఎంలలో నింపాల్సిన రూ.50 లక్షల నగదుతో డ్రైవర్‌ ఉడాయించాడు. మంగళవారం నెల్లూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు బృందాలుగా ఏర్పడిన గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలో ఉన్న వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రాచేసి కస్టోడియన్ల సాయంతో ఆ బ్యాంకుల ఏటీఎంలలో సెక్యూర్‌ వాల్యూ కంపెనీ డిపాజిట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం శివకృష్ణ అనే ఉద్యోగి కంపెనీ వ్యాన తీసుకొని నెల్లూరులోని మద్రాసు బస్టాండు సెంటర్‌ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లాడు. డ్రైవర్‌ పోలయ్యను వ్యాన వద్దే ఉండమని బ్యాంకులోకి వెళ్లి రూ.50లక్షలు డ్రా చేసుకొని వచ్చాడు. వ్యానలోని బాక్స్‌లో రూ.50లక్షలు పెట్టి లాక్‌ చేశాడు. అక్కడ నుంచి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని యాక్సెస్‌ బ్యాంకుకు  వెళ్లారు. బ్యాంక్‌లో నగదు డ్రా చేసుకొని వస్తానని పోలయ్యకు చెప్పి శివకృష్ణ వెళ్లాడు. అక్కడ రూ.12.50 లక్షలు డ్రాచేసుకొని కిందకురాగా వ్యాన కనిపించ లేదు. దీంతో పోలయ్యకు ఫోన చేయగా టైర్‌ పంక్చర్‌ కావడంతో వెళ్లాలని,  15 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. 15 నిమిషాల తర్వాత కూడా రాకపోవడంతో శివకృష్ణకు అనుమానం వచ్చి మరోసారి ఫోన చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఆయన కంపెనీ మేనేజర్‌ వెంకటేశ్వర్లుకు విషయం చేరవేశారు. వ్యానకు అమర్చిన జీపీఎస్‌ కూడా ఆఫ్‌ చేసి ఉండటంతో కంపెనీ మేనేజర్‌ వెంకటేశ్వర్లు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు ఇనస్పెక్టర్‌ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగర డీఎస్పీ జె శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో చిన్నబజారు, సీసీఎస్‌ ఇనస్పెక్టర్లు ఎం మధుభాబు, షేక్‌ బాజీజాన సైదా, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేయడంతోపాటు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తూ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక ఆధారంగా దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. మరోవైపు నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ఉంటున్న పోలయ్య కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2021-07-28T04:53:10+05:30 IST