అతిథికి ఆదరణేదీ?

ABN , First Publish Date - 2022-05-28T06:44:56+05:30 IST

చింతపల్లి హనుమాన్‌ జంక్షన్‌లో సుమారు ఇరవై ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ఒక సమావేశ మందిరం, మూడు సూట్లు కలిగిన అతిథి గృహాన్ని నిర్మించింది.

అతిథికి ఆదరణేదీ?
రీజనల్‌ మేనేజర్‌ క్యాంప్‌ కార్యాలయంగా మారిపోయిన ఏపీఎఫ్‌డీసీ అతిథి గృహం

 చింతపల్లిలో అతిథులకు ఆశ్రయం కరువు

- మూడు అతిథి గృహాలు ఉన్నా ప్రయోజనం శూన్యం

- పట్టించుకోని పాలకులు, అధికారులు

సబ్‌ డివిజన్‌ కేంద్రంలో అతిథులు ఆశ్రయం పొందే అవకాశమే లేకుండాపోయింది. చింతపల్లిలో ఆర్‌ అండ్‌ బీ, ఏపీఎఫ్‌డీసీ, జిల్లా పరిషత్‌ అతిథి గృహాలు ఉన్నప్పటికీ అతిథులు బస చేసే అవకాశం లేదు. దీంతో చింతపల్లి వచ్చిన అధికారులు, పర్యాటకులు ఇక్కడ నుంచి 16 కిలో మీటర్ల దూరంలో లంబసింగి వద్ద ప్రైవేటు రిసార్ట్స్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. 

చింతపల్లి, మే 27: చింతపల్లి హనుమాన్‌ జంక్షన్‌లో సుమారు ఇరవై ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ఒక సమావేశ మందిరం, మూడు సూట్లు కలిగిన అతిథి గృహాన్ని నిర్మించింది. ఈ అతిథి గృహాన్ని ఐదేళ్ల కిందట ఆధునికీకరించారు. గతంలో ఈ అతిథి గృహానికి అధికారులు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, పర్యాటకులు నామమాత్రపు అద్దె చెల్లించి బస చేసేవారు. అయితే మూడేళ్ల కిందట ఈ అతిథి గృహాన్ని ఏపీఎఫ్‌డీసీ రీజనల్‌ మేనేజర్‌ క్యాంప్‌ కార్యాలయంగా మార్చేశారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులకు ఒక్క సూట్‌ మాత్రమే బస చేసేందుకు ఇస్తున్నారు. మిగిలిన రెండు సూట్లు కేవలం ఏపీఎఫ్‌డీసీ అధికారులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. పర్యాటకులు, మండల స్థాయి, డివిజన్‌ స్థాయి అధికారులకు సైతం ఏపీఎఫ్‌డీసీ అతిథి గృహంలో ఒక్క సూట్‌ కూడా అద్దెకిచ్చే పరిస్థితి లేదు. 

ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం

స్థానిక హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం ఉంది. సుమారు 40 ఏళ్ల కిందట నిర్మించిన అతిథి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని తొలగించారు. 2018లో గత టీడీపీ ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరుచేయడంతో కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇంతలో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ అతిథి గృహం నిర్మాణం జరిగి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ నిర్మాణాలకు సంబంధించిన నిధులు ఒక్కపైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్‌ నూతన భవనాన్ని ఇప్పటికీ ఆర్‌ అండ్‌ బీ అధికారులకు అప్పగించలేదు. 

జిల్లా పరిషత్‌ అతిథి గృహం

చింతపల్లి మండల కేంద్రం అంతర్ల గ్రామ సమీపంలో జిల్లా పరిషత్‌ అతిథి గృహం ఉంది. గతంలో సీపీఐ మావోయిస్టులు ఈ అతిథి గృహాన్ని పేల్చివేయడంతో గత ప్రభుత్వం మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చింది. అతిథి గృహంలో మూడు సాధారణ గదులు, ఒక వీఐపీ సూట్‌, డైనింగ్‌ హాల్‌ ఉంది. ప్రస్తుతం ఈ అతిథి గృహంలో అతిథులు ఆశ్రయం పొందేందుకు అవసరమైన మంచాలు, పరుపులు, ఇతర ఫర్నీచర్‌, ఫ్యాన్లు వంటివి లేవు. మరుగుదొడ్లు కూడా మరమ్మతులకు గురయ్యాయి. దీని వల్ల జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో అతిథులు బస చేసే అవకాశం లేదు. తాజాగా జిల్లా పరిషత్‌ అధికారులు రూ.4.8 లక్షల నిధులను అతిథి గృహం మరమ్మతులకు మంజూరు చేశారు. అయితే ఈ నిధులు అతిథి గృహంలోని మరుగుదొడ్ల మరమ్మతులు, ఫర్నీచర్‌, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చాలవని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

----

అతిథి గృహాలను వినియోగంలోకి తేవాలి 

జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు, పర్యాటకులు చింతపల్లి వచ్చినప్పుడు బస చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు అతిథి గృహాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో అర్‌ అండ్‌ బీ, జిల్లా పరిషత్‌, ఏపీఎఫ్‌డీసీ అతిథి గృహాలను పూర్తి స్థాయిలో అధికారులు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. 

- చల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి, చింతపల్లి

Updated Date - 2022-05-28T06:44:56+05:30 IST