క్రీడా పాలసీలో తెలంగాణ నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2021-09-16T05:13:07+05:30 IST

క్రీడా పాలసీలో తెలంగాణ నెంబర్‌ వన్‌

క్రీడా పాలసీలో తెలంగాణ నెంబర్‌ వన్‌
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రులు, చీఫ్‌విప్‌, మేయర్‌ తదితరులు

 రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌

 ఘనంగా జాతీయస్థాయి  అథ్లెటిక్స్‌ క్రీడల ప్రారంభోత్సవం

హనుమకొండ టౌన్‌, సెప్టెంబరు 15: క్రీడా పాలసీలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌ వన్‌ స్థాయిలో ఉందని,   సంక్షేమం, అభివృద్ధితో పాటు క్రీడలకు, టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర క్రీడల, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు.  హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో బుధవారం సాయంత్రం  జాతీయస్థాయి అఽథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌తో కలిసి మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు క్రీడలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్‌, 0.5శాతం ఎడ్యుకేషన్‌లో రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు రాష్ట్రంలో 60 ఇండోర్‌ స్టేడియాల నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రతీ జిల్లాలో క్రీడా అకాడమీ నిర్మించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గుత్తాజ్వాల, గోపిచంద్‌, గగన్‌నారంగ్‌లు నిర్వహిస్తున్న అకాడమీలకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడల కోసం రూ.7కోట్లు వెచ్చించి సింథటిక్‌ ట్రాక్‌ నిర్మించామన్నారు. క్రీడల నిర్వహణకు రూ.10లక్షలు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ..  జాతీయస్థాయి అఽథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే  క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.   ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు   తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాను క్రీడాహబ్‌గా మార్చబోతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు.  

అట్టహాసంగా ప్రారంభం

అఽథ్లెటిక్స్‌ క్రీడల ప్రారంభోత్సవాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు.  పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.  సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశంలోని  వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 500 మంది క్రీడాకారులతో  స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది. క్రీడలను తిలకించేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు తరలివచ్చారు.  ఈ కార్యక్రమంలో మేయర్‌ గుండు సుధారాణి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు,  జీడబ్ల్యుఎంసీ కమిషనర్‌ ప్రావీణ్య, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అంజుజార్జీ, క్రీడా అసోసియేషన్‌ నేతలు రమేశ్‌, సారంగపాణి, అశోక్‌, వరద రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే రాజయ్య అసహనం

క్రీడల ప్రారంభోత్సవానికి హాజరైన స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అలిగారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తన ఫొటో లేకపోవడం రాజయ్య అలగడానికి కారణమైంది. తనను ఆహ్వానించి అవమానించారని నిర్వాహకుల ఎదుట అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలిగిన రాజయ్య ప్రసంగించేందుకు కూడా ససేమిరా అన్నట్లు సమాచారం. నిర్వాహకులు సర్దిచెప్పినప్పటికీ అసహనంతోనే వెళ్లినట్టు సమాచారం.

Updated Date - 2021-09-16T05:13:07+05:30 IST