విశాఖలో ఏటీజీ టైర్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2020-09-14T06:05:42+05:30 IST

జపాన్‌కు చెందిన యొకొహమా గ్రూప్‌ కంపెనీ అయిన అలయన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ).. విశాఖపట్నంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

విశాఖలో ఏటీజీ టైర్‌ ప్లాంట్‌

రూ.1,240 కోట్ల పెట్టుబడి

 2023 నాటికల్లా అందుబాటులోకి 


ముంబై: జపాన్‌కు చెందిన యొకొహమా గ్రూప్‌ కంపెనీ అయిన అలయన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ).. విశాఖపట్నంలో  ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో కంపెనీకిది మూడో ప్లాంట్‌. సుమారు రూ.1,240 కోట్ల (16.5 కోట్ల డాలర్లు) పెట్టుబడితో కంపెనీ.. విశాఖలో ఆఫ్‌-హైవే టైర్‌ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. 2023 తొలి త్రైమాసికం నాటికల్లా ఈ ప్లాంట్‌ వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుందని యొకొహమా ఇండియా చైర్మన్‌, ఏటీజీ డైరెక్టర్‌ నితిన్‌ మంత్రి వెల్లడించారు.


విశాఖ పోర్టు సమీపంలోని అచ్యుతాపురం ఇండస్ట్రియల్‌ పార్క్‌లోని స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ జోన్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపాదిత ప్లాంట్‌ ద్వారా ఏటా అదనంగా 20 వేల టన్నుల (రోజుకు 55 టన్నుల రబ్చర్‌ వెయిట్‌) ఉత్పత్తి సామర్థ్యం వ చ్చి చేరనుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల టన్నులుగా ఉంది. విశాఖపట్నం ప్లాంట్‌ ద్వారా కొత్తగా 600 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,500కు చేరుకుంటుందని నితిన్‌ వెల్లడించారు.


ప్రస్తుతం ఏటీజీకి గుజరాత్‌లోని దహేజ్‌లో ఏటా 1.3 లక్షల టన్నుల (రోజుకు 360 టన్నులు) సామర్థ్యం గల ప్లాంట్‌తో పాటు తమిళనాడులోని తిరునల్వేలిలో ఏటా లక్ష టన్నుల సామర్థ్యం గల ప్లాంట్లున్నాయి. వీటితో పాటు ఇజ్రాయెల్‌లో 45 వేల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌తో పాటు ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను నిర్వహిస్తోంది.

భారత్‌లోని రెండు ప్లాంట్లలో అగ్రికల్చర్‌ మెషినరీ కోసం ఏటీజీ-అలయన్స్‌, నిర్మాణ, ఇండస్ట్రియల్‌ మెషినరీ కోసం గెలాక్సీ, ఫారెస్ట్రీ మెషినరీ కోసం ప్రిమెక్స్‌ పేరుతో మూడు ఆఫ్‌-హైవే  టైర్‌ బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. 


Updated Date - 2020-09-14T06:05:42+05:30 IST