నగర నడిబొడ్డులో కత్తులతో దాడి

ABN , First Publish Date - 2022-05-27T04:43:44+05:30 IST

నగర నడిబొడ్డులో టౌన్‌హాల్‌ ఎదురుగా దండువారివీధిలో ఓ చిల్లర దుకాణం వద్దకు సిగరెట్‌ కొనుగోలు చేసుందుకు వచ్చిన యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

నగర నడిబొడ్డులో కత్తులతో దాడి
కత్తి గాయాలతో పడిపోయిన విజయ్‌కుమార్‌

సినీ పక్కీలో ద్విచక్ర వాహనంపై వచ్చి..

యువకుడిపై హత్యాయత్నం

భయంతో పరుగులు తీసిన ప్రజలు

నెల్లూరు(క్రైం), మే 26 : నగర నడిబొడ్డులో టౌన్‌హాల్‌ ఎదురుగా దండువారివీధిలో ఓ చిల్లర దుకాణం వద్దకు సిగరెట్‌ కొనుగోలు చేసుందుకు వచ్చిన యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన  చూసిని ప్రజలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పోలీసుల కథనం మేరకు..  నగరంలోని మనుమసిద్ధినగర్‌ అరటితోట ప్రాంతానికి చెందిన విజయకుమార్‌ టౌన్‌హాల్‌ పక్కన ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. నగరంలోని కోటమిట్టకి చెందిన మసూద్‌తో అతనికి పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో అతనిని అంతమొందించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్న మసూద్‌ మరో ఇద్దరు ఖైజర్‌, కాలభైరవలతో కలసి గురువారం విజయ్‌కుమార్‌ పనిచేస్తున్న దుస్తుల దుకాణం వద్దకు స్కూటీలో వెళ్లారు. ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారం కత్తులు కూడా తీసుకెళ్లి నిరీక్షించారు. ఈ క్రమంలో సిగరెట్‌ కోసం విజయ్‌కుమార్‌ దుకాణం నుంచి బయటకు రావడం గమనించి ఒకరు స్కూటీని స్టార్ట్‌ చేసుకుని సిద్ధంగా ఉండగా మసూద్‌తో పాటు మరో వ్యక్తి కత్తులతో విజయ్‌కుమార్‌ను ఐదు పోట్లు పొడవడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో నిందితులు ముగ్గురు స్కూటీలో పరారయ్యారు. స్థానికులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించడంతో ఇన్‌స్పెక్టర్‌ వీరేంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని తన వాహణంలోనే విజయ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమయంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏఎస్పీ హిమవతి, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. నిందితులను సీసీ ఫుటేజ్‌ల ద్వారా గుర్తించారు. దాడికి పాల్పడిన మసూద్‌పై చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటరు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో ఎర్రటి నెత్తురు ప్రవహిస్తోంది. రౌడీ షీటర్లు పంజా విసురుతుండటంతో నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. అందుకు నగరంలోని చిన్నబజారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఒక ఉదాహరణగా చర్చ జరుగుతోంది.



Updated Date - 2022-05-27T04:43:44+05:30 IST