అతలాకుతలం

ABN , First Publish Date - 2022-05-05T05:13:09+05:30 IST

ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలో ఉరుములు, పిడుగులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఒక్కసారిగా వాన కురవడంతో ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల టార్పాలిన్లు కప్పినప్పటికీ ఈదురుగాలుల వర్షానికి వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

అతలాకుతలం
సిద్దిపేట మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతు

సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సం

ఉరుములు, పిడుగులతో ఆగమాగం

వానకు కొట్టుకుపోయిన ధాన్యరాశులు

చేతికొచ్చే దశలో నేలవాలిన వరిపంట

దుబ్బాకలో పిడుగుపాటుతో ఒకరి మృతి

పలుచోట్ల పశువులు, గొర్రెల మృత్యువాత


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట/చేర్యాల/దుబ్బాక/మిరుదొడ్డి/తొగుట/హుస్నాబాద్‌/హుస్నాబాద్‌ రూరల్‌/బెజ్జంకి/మద్దూరు/అక్కన్నపేట, మే 4 :  ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలో ఉరుములు, పిడుగులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఒక్కసారిగా వాన కురవడంతో ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల టార్పాలిన్లు కప్పినప్పటికీ ఈదురుగాలుల వర్షానికి వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. 


21 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 21మి.మీ.ల వర్షపాతం కురిసింది. మద్దూరు మండలంలో అత్యధికంగా 52.6 మి.మీ.లు,  కొండపాక, కొమురవెల్లిలో 33.8, ములుగు, మర్కూక్‌ మండలాల్లో 36.4, మిరుదొడ్డిలో 39.8, తొగుటలో 26.8, చేర్యాలలో 22 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. మూడు రోజుల క్రితం కూడా స్వల్పంగా చిరుజల్లులు కురిసినప్పటికీ ఎలాంటి నష్టం లేదు. కానీ తాజా వర్షంతో అటు రైతాంగం, ఇటు ప్రజలకూ నష్టాలు, కష్టాలు తప్పలేదు. గడిచిన వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉన్న ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరాయి. 


తడిసిముద్దయిన ధాన్యం

చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి పంటనష్టం వాటిల్లింది. కొనుగోలు చేపట్టడంలో జాప్యం వహించడంతో వరుణుడి పాలైంది. చేర్యాల మండలం ఆకునూరు తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి వరదకు కొట్టుకుపొయింది. అలాగే పొట్టబోసుకుని కోతకు సిద్ధమైన వరిచేలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో నేలవాలాయి. ఆకునూరు కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని సీపీఐ నాయకుల బృందం పరిశీలించింది. తడి సిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసింది. తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో ధాన్యం తడిసిముద్దయింది. తొగుట మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురు గాలులు ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో వరి పంట నేల కొరిగింది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మోతె గ్రామంలో తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్‌ రాజిరెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్‌, సర్పంచు శ్రీనివా్‌సతో కలిసి పరిశీలించారు. హుస్నాబాద్‌ పట్టణంలో మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. పది రోజుల క్రితం మార్కెట్‌ యార్డులోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చామని, ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయిందని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌, రాములపల్లి,మడద, నాగారం, పోతారం(ఎస్‌), జిల్లెలగడ్డ, పొట్లపల్లి, పందిల్ల, గాంధీనగర్‌, మీర్జాపూర్‌, వంగరామయ్యపల్లి, కూచనపల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి కోతకు వచ్చిన వరిచేన్లు నేలకొరిగాయి. ధాన్యం గింజలు రాలిపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బెజ్జంకి మండలంలోని తోటపల్లి మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, సర్పంచ్‌ నర్సింగారావు పరిశీలించారు. మద్దూరు, దూళిమిట్ట మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతకు కన్నీటిని మిగిల్చింది.


వెంటనే కాంటా వేయకపోవడంతో నష్టం

జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతుండగా కోత కోసిన వరి  ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి తేమ శాతం కోసం ఆరబెట్టారు. పలుచోట్ల రహదారులపై ఆరబెట్టిన వడ్లూ ఆగమాగమయ్యాయి. కొన్నిచోట్ల కేంద్రాలను ఆలస్యంగా తెరవడం ఈ పరిణామాలకు తావిచ్చింది. అంతేగాకుండా వెనువెంటనే కాంటాలు వేయకపోవడం, వర్ష సూచనను గుర్తించకపోవడంతో రైతులకు నష్టం తప్పలేదు. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి ఏం చేయాలో తోచక నీళ్లలో కలుస్తున్న ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. తెల్లవారాక వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తి ఆరబెట్టుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా 2.50లక్షల ఎకరాల్లో ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి వరి సాగు చేశారు. సుమారుగా 6లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడిప్పుడే కేంద్రాలు తెరవడంతో కొనుగోళ్లు సైతం అంతంత మాత్రంగానే జరిగాయి. వర్షాలు ప్రారంభం కావడంతో మరింత అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. లేదంటే చేతికొచ్చిన ధాన్యమంతా వరదపాలు కావాల్సి వస్తుందని రైతులు  అంటున్నారు. 


పిడుగుల బీభత్సానికి ప్రాణ నష్టం

ఈదురుగాలులకు తోడు వరుస పిడుగులు, పెళపెళమంటూ ఉరుములు భయకంపితాన్ని కలిగించాయి. జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతిచెందగా, మరో వృద్ధుడికి గాయాలయ్యాయి. పలుచోట్ల మూడు ఎడ్లు, రెండు ఆవులు, నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బుధవారం ఉదయం 7గంటల వరకు కూడా పిడుగుల శబ్దం వినిపించింది. దుబ్బాక  మండలం పద్మశాలిగడ్డ గ్రామ మదిర గ్రామమైన నర్లేంగిగడ్డలో రైతు సౌడు పోచయ్య (65)పిడుగుపాటుకు మృతి చెందాడు. బుధవారం ఉదయం అకాల వర్షం రావడంతో సౌడ్‌ పోశయ్య రోడ్డుపై ఆరబోసిన తన వడ్లపై కవర్లను కప్పుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు పక్కనే ఉన్న రెడ్డబోయిన కొండయ్య అనే వృద్ధుడికి గాయాలయ్యాయి. కొండయ్యను 108 అంబులెన్స్‌లో దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్పీటీసీ రవిందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌ గ్రామానికి చెందిన  ఇందూరి బాలయ్య అనే రైతు ఎద్దును వ్యవసాయ పొలం వద్ద కట్టేశాడు. తెల్లవారుజామున వ్యవసాయ పొలానికి వెళ్లిచూడగా పిడుగుపాటుకు గురై అక్కడ ఎద్దు మృతిచెంది ఉండడంతో ఆయన  బోరున విలపించారు. అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలోనూ పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన కుందెన రాధిక అనే మహిళ కూలికి చెందిన పాడి ఆవును మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తన ఇంటి ఎదుట కట్టేసింది. రాత్రి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడగా రాధిక ఎప్పటిలాగే తెల్లవారి ఆవు వద్దకు వెళ్లి మృతి చెంది కనిపించింది. మద్దూరు మండలం వంగపల్లిలో రైతు ఎర్రబచ్చల భిక్షపతికి చెందిన రెండు కాడెడ్లు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయి. నర్సాయపల్లిలో ముస్త్యాల రాములుకు చెందిన ఆవు పిడుగుపాటుకు బలైంది. దూళిమిట్ట మండలం బెక్కల్‌లో కూకట్ల రాజలింగంకు చెందిన ఇంటి సర్వీసు వైరు ఈదురుగాలులకు తెగిపడడంతో పక్కనే షెడ్డులో ఉన్న 4 గొర్రెలు విద్యుత్‌షాక్‌తో చనిపోయాయి. రాజలింగంకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.



Read more