Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 24 Mar 2021 07:12:16 IST

వాజపేయి, విశాఖ ఉక్కు

twitter-iconwatsapp-iconfb-icon
వాజపేయి, విశాఖ ఉక్కు

స్వతంత్ర భారతదేశంలో ప్రప్రథమంగా ఏర్పడ్డ తొలి కాంగ్రేసేతర ప్రభుత్వ విదేశాంగ విధానం గూర్చి తెలుసుకోవడానికి సకల దేశాలు సహజంగానే ఎంతో ఆసక్తితో ఎదురు చూశాయి. విదేశాంగ విధానంలో నూతన ఒరవడికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెబుతూ, తాము నెహ్రూ విధానానికి భిన్నంగా ఏ రకమైన మార్పులు తీసుకోరావడం లేదని విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహారి వాజపేయి చెప్పడం సంచలనం సృష్టించింది. సోవియట్ యూనియన్‌తో మన మైత్రి యథా ప్రకారం కొనసాగుతుందని, భారత దేశ ఉక్కు పారిశ్రామిక రంగంలో రష్యా పాత్ర కించిత్ కూడా తగ్గబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో నెలకొల్పనున్న ఉక్కు పరిశ్రమలో రష్యా మరింత కీలక పాత్ర వహించనున్నట్లుగా 1977లో పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్వహించిన దౌత్యవేత్తల సమావేశంలో వాజపేయి వెల్లడించారు.


భిలాయి, బొకారో ఉక్కు పరిశ్రమల తర్వాత భారత్ సోవియట్ పై ఆధారపడడం తగ్గించి ఇతర దేశాల వైపు చూస్తున్నట్లుగా పలువురు అనుమానించారు. దీనికి తగినట్లుగా రూర్కేలా, దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమలకు జర్మనీ, బ్రిటన్ సహాయం నేపథ్యంలో, జనసంఘ్ నేత, మేధావి అయిన వాజ్ పేయి సహజంగా మార్పును స్వాగతించవచ్చని పలువురు దౌత్యవేత్తలు భావించారు. అయితే ఆనాటి సోవియట్ యూనియన్ విదేశాంగ మంత్రి గ్రోమికోకు పంపిన ఒక సందేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఇరు దేశాల మధ్య మైత్రికి మరో వారధిగా మారనుందని వాజపేయి పేర్కొన్నారు. ఆ రకంగా ప్రారంభమైన విశాఖ ఉక్కు అనేక అవరోధాలను ఎదుర్కోంటూ నవరత్న ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒకటిగా ఎదిగింది. ఈ విశాఖ ఉక్కులో పని చేసిన అనుభవంతో గల్ఫ్ దేశాలకు వచ్చిన కొందరు ఇంజనీర్లు మరింత ఉన్నత స్ధానాలకు ఎదిగారు. 


ఇక వర్తమానానికి వస్తే, వాజపేయి వారసుడిగా వచ్చిన నరేంద్ర మోదీది విభిన్న వైఖరి. పూర్తిగా ప్రైవేటీకరణ వైపు అమిత ఆసక్తి కనబరుస్తున్న మోదీ సర్కారు లాభదాయకమైన సంస్ధలలో ఒకటిగా ఉన్న విశాఖ ఉక్కును విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇది విధాన నిర్ణయమని అందరు చేతులు ముడుచుకోని కూర్చోవడం విస్మయం కల్గిస్తుంది. నవరత్న ప్రభుత్వరంగ సంస్ధలలో ఒకటయిన విశాఖ ఉక్కును ప్రభుత్వాలు ఎంత నిర్దయగా, వ్యూహాత్మకంగా దెబ్బతిసాయో అందరికీ తెలుసు. 


లక్ష్మి మిట్టల్ లాంటి భారతీయ ఉక్కు పారిశ్రామికవేత్తలు విదేశాలలో సైతం ఉక్కు రంగంలో రాణిస్తుండగా దేశంలోని ప్రఖ్యాత ప్రభుత్వరంగ సంస్ధలలోని ఉక్కు పరిశ్రమలు దీవాలా తీస్తుండడం గమనార్హం. ప్రైవేటు సంస్ధలకు చివరకు గల్ఫ్ దేశాలకు చెందిన కొన్ని అనామక సంస్ధలకు కూడా ఖనిజ గనులను ఉదారంగా కేటాయించిన మోదీ సర్కారు విశాఖ ఉక్కుకు మాత్రం ఇనుప ఖనిజాల గనులు కేటాయించలేదు! సొంత గనులు కేటాయించక పోవడమే విశాఖ ఉక్కు మనుగడకు ఎసరు పెట్టింది. గనుల కేటాయింపు ఉన్న ప్రైవేటు సంస్ధలు సగటున రూ. 1500 ముడి సరుకు కొరకు వెచ్చిస్తుండగా, కేటాయింపు లేని విశాఖ స్టీల్ రూ.7000 వరకు వెచ్చిస్తుంది. మొత్తంగా ఆ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యం, ఆర్ధిక నివేదికలు వగైరా నిశితంగా పరిశీలిస్తే దాని నష్టాలకు ప్రభుత్వ విధానాలు కారణం కానీ సంస్ధ కాదని స్పష్టమవుతుంది. 


భారత్ వలే కాకుండా గల్ఫ్ దేశాలు పూర్తిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తాయి, కనీసం ఆదాయపు పన్ను కూడ లేకుండాసరళీకృత విపణి వ్యవస్ధ ఇక్కడ అమలులో ఉంది. భారతదేశంలో ఇనుము తదితర ఖనిజ సంపద ఉన్నట్లుగా గల్ఫ్ దేశాలలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. రిగ్గింగ్ మొదలు ఉత్పత్తి, విక్రయాల వరకు ప్రతిదీ ప్రభుత్వ రంగ చమురు సంస్ధలు సమర్ధంగా నిర్వహిస్తూ ప్రపంచంలోనె అగ్రగామిగా నిలిచాయి. యుద్ధాలు, సంక్షోభాలు, ఆర్ధిక వ్యవస్ధల ఉత్థాన పతనాలు మొదలైన అనేక కీలక ఘట్టాల మధ్య కూడ ఈ సంస్ధలు గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను పరోక్షంగా శాసించే స్ధాయికి ఎదగగా భారతదేశంలో మాత్రం ప్రభుత్వ రంగ సంస్ధలను ఒక గుదిబండగా పరిగణించడాన్ని ఏమనుకోవాలి? 


ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణలో పాలకులకు చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, నిజాయితీ కొరవడితే ఎంత గొప్ప వాణిజ్య అవకాశాలు ఉన్నప్పటికి ప్రయోజనం ఉండదని చెప్పడానికి విశాఖ ఉక్కే ఒక నిదర్శనం.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.