ఆటా మహాసభలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-30T13:24:17+05:30 IST

జూలై 1వ తేదీ నుండి మూడు రోజులపాటు వాషింగ్టన్‌ డి.సిలో నిర్వహిస్తున్న ఆటా (ATA) మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల తెలిపారు.

ఆటా మహాసభలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు

మహాసభలకు హాజరవుతున్న సద్గురు, ఇళయరాజా, కపిల్ దేవ్, గవాస్కర్

వాషింగ్టన్ నుండి ఆంధ్రజ్యోతి  ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ: జూలై 1వ తేదీ నుండి మూడు రోజులపాటు వాషింగ్టన్‌ డి.సిలో నిర్వహిస్తున్న ఆటా (ATA) మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను ఆయన 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ముగింపు రోజున ప్రముఖ సంగీత దర్శకుడు, పద్మభూషణ్‌ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు) ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు.


హాజరవుతున్న కవులు కళాకారులు రాజకీయ నేతలు..

గత మూడు సంవత్సరాల నుండి కరోనా మూలంగా అమెరికాలో తెలుగు మహాసభలు జరుగలేదు. కరోనా అనంతరం జరుగుతున్న ఈ మహాసభలకు పదివేల మంది హాజరవుతారని  ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు, రాజకీయ నేతలు, సినిమా నటులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు తరలి వస్తున్నట్లు భువనేశ్ తెలిపారు. ప్రముఖ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ హాజరవుతున్నట్లు తెలిపారు. మహాసభల సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు బిజినెస్ మహిళ ఇమిగ్రేషన్ రాజకీయ మ్యాట్రిమోనీ వివిధ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థుల సమావేశాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భువనేశ్ తెలిపారు. వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.


ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు జరగనున్నాయి. యూత్‌ కన్వెన్షన్‌లో పాల్గొనాలని కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2న ఆటా సభల్లో పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్‌ను ఆమె ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటలకు దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్‌ మీట్‌కు కవిత అతిధిగా హాజరవుతారు. అదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు.

Updated Date - 2022-06-30T13:24:17+05:30 IST