అటా.. ఇటా

ABN , First Publish Date - 2021-12-22T07:08:05+05:30 IST

బదిలీలతో అధికారుల్లో హడావుడి, ఉద్యోగుల్లో టెన్షన్‌.. టెన్షన్‌. ఎటు వెళ్లాలో తెలియక, ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో, ఏ మెస్సేజ్‌ వస్తుందోనన్న భయం ఉద్యోగుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది.

అటా.. ఇటా

 తుదిదశకు ఉద్యోగుల కేటాయింపు

 ఎక్కడ పనిచేయాలో స్పష్టత కరువు 

 వెళ్లాలంటున్న అధికారులు, వెళ్లలేమంటున్న ఉద్యోగులు 

 విద్యాశాఖ మినహా అన్నింటా పూర్తి

 మొత్తం ఉద్యోగులు 20,966

 జిల్లాలు మారే వారి సంఖ్య 4,593

బదిలీలతో అధికారుల్లో హడావుడి, ఉద్యోగుల్లో టెన్షన్‌.. టెన్షన్‌. ఎటు వెళ్లాలో తెలియక, ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో, ఏ మెస్సేజ్‌ వస్తుందోనన్న భయం ఉద్యోగుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యోగుల కేటాయింపు తుదిదశకు చేరుకోగా, విద్యాశాఖలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)లు మినహా అందరి కేటాయింపులు పూర్తయ్యాయి. బదిలీల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాత్‌జీవన్‌పాటిల్‌ అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. భోజన విరామం తప్ప మిగిలిన సమయం అంతా నల్లగొండ డీఈవో కార్యాలయంలోనే ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. 

నల్లగొండ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొత్త జోనల్‌ విధానం ప్రకారం సీనియారిటీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాల కేటాయింపు కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుదిదశకు చేరింది. విద్యాశాఖలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)లు మినహా అందరి కేటాయింపులు పూర్తయ్యాయి. వారం రోజులుగా కలెక్టర్‌తోపాటు ఆయా శాఖల అధికారులు అంతా ఈ ప్రక్రియపైనే నిమగ్నమయ్యారు. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు చెందిన అధికారులు సైతం నల్లగొండలోనే మకాంవేసి ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 20,966 కాగా ఇందులో విద్యాశాఖ ఉద్యోగుల సంఖ్యే 12,219 మంది ఉన్నారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో జిల్లాల కేటాయింపు రెండు రోజుల క్రితమే పూర్తి కాగా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగులను రిలీవ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీ్‌సశాఖ ఉన్నతాధికారులు సైతం నల్లగొండలోనే మకాం వేసి ప్రక్రియను పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో విద్యాశాఖ మినహాయిస్తే 7,891 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో సుమారు 35శాతం మంది ఒక జిల్లానుంచి మరో జిల్లాకు సర్దుబాటు అయ్యారు. సర్దుబాటైన వారి సంఖ్య 2,761 కాగా విద్యాశాఖలో 12,219 మందికి 15శాతం మంది జిల్లాల్లో సర్దుబాటు అయ్యారు. వారిసంఖ్య 1832గా ఉంది. మొత్తంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన వారిసంఖ్య సుమారు 4,593గా ఉంది. విద్యాశాఖలో మొత్తం ఉద్యోగులు 12,219 కాగా వారి ఆప్షన్ల మేరకు సర్దుబాటు చేయగా నల్లగొండ జిల్లాకు 5,605 మంది, సూర్యాపేట జిల్లాకు 3,692 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాకు 2,922 మందిని సర్దుబాటు చేశారు. 


ఆందోళనలో ఉద్యోగులు

విద్యాశాఖ మినహా ఇతర శాఖల్లో జిల్లాల సర్దుబాటు ప్రక్రియ పూర్తికాగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను మూడు రోజుల్లో రిలీవ్‌ చేయాలని, అక్కడ రిపోర్టు చేసిన తర్వాత ఆయా జిల్లా అధికారులు రెండురోజుల్లో వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఉత్తర్వులు అందాయి. ఈమేరకు అన్ని జిల్లా శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగులను రిలీవ్‌ చేసే పనిలో ఉన్నారు. అయితే ఉద్యోగులు మాత్రం తాము ఇప్పటికిప్పుడు ఇతర జిల్లాలకు వెళ్లలేమని, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలోనే కొత్త పోస్టుల్లో చేరతామని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సమాచారం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే మరింత గందరగోళం నెలకొంది. సీనియర్లు యాదాద్రి జిల్లాకు ఆప్షన్‌ ఇవ్వడంతో అక్కడున్న జూనియర్లు బలవంతంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు రావాల్సిన పరిస్థితి. కేటాయింపులు చివరిదశకు చేరుకోగా ఉపాధ్యాయులను కొత్త స్కూళ్లకు పంపాలా? వద్దా? కొత్త జిల్లాల్లో ఎప్పుడు రిపోర్టు చేయాలి అనే అంశంలో నేటికీ స్పష్టత లేదు. కొత్తగా జిల్లాల వారీగా అందరికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారా? కదలిక లేకుండా ఒకే జిల్లాలో ఉన్న వారికే నిర్వహిస్తారా? ప్రస్తుతం కొనసాగుతున్న స్కూల్‌ సీనియారిటీని కౌన్సిలింగ్‌లో పరిగణలోకి తీసుకుంటారా? లేదా? సర్వీసు సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటారా అన్న అనుమానాలు ఉన్నాయి. చివరి రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయ లోకం ఆందోళనలో ఉంది. 


నేడు విద్యాశాఖ కేటాయింపు

మొత్తం 12,219 మంది ఉద్యోగులు, ఉమ్మడి జిల్లా ఉద్యోగుల్లో సగం మంది వీరే కావడంతో జిల్లాల కేటాయింపు ప్రక్రియ విద్యాశాఖలో తీవ్ర జాప్యమవుతోంది. వీటికితోడు వివిధ రకాల సబ్జెక్టు టీచర్లు, ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు వారీగా సీనియారిటీ, జిల్లాల కేటాయింపు విడివిడిగా చేయాల్సి రావడం జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతోపాటు 610జీవో ప్రకారం ఇతర జిల్లాలనుంచి కేటాయింపులు, అంతర్‌ జిల్లాల బదిలీల్లో జిల్లాలకు వచ్చిన వారు ఇలా అనేక అంశాల్లో ఉద్యోగ భర్తీలు, మార్పులు జరిగాయి. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన సందర్భంలో వారి సీనియారిటీ జీరో అవుతోంది. ఈక్రమంలో తాజాగా సీనియారిటీ జాబితాలను ఖరారుచేసే క్రమంలో వారందరినీ రెగ్యులర్‌ సర్వీస్‌ ప్రకారం సర్దుబాటు చేయాల్సి రావడంతో జాప్యమవుతోంది. వేలసంఖ్యలో ఉద్యోగులు కావడం సీనియారిటీ లెక్కింపులో  ఏమాత్రం తేడా జరిగినా పెద్ద అపవాదు, గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. దీంతో గత మూడు రోజులుగా నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ విద్యాశాఖ కార్యాలయంలోనే మకాంవేశారు. భోజన విరామం తప్ప మిగిలిన సమయం అంతా కలెక్టర్‌ డీఈవో కార్యాలయంలోనే పర్యవేక్షణలో ఉన్నారు. వీరితోపాటు అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఉపాధ్యాయుల కేటాయింపు పనిలోనే ఉన్నారు. ప్రతి సబ్జెక్టు సీనియారిటీ లిస్ట్‌, జిల్లాల కేటాయింపు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలతోనూ సంతకాలు తీసుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభంకాగా ఈనెల 22తో ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల కేటాయింపు పూర్తి కానుంది. విద్యాశాఖలో అన్ని విభాగాల కేటాయింపులు పూర్తి కాగా, చివరకు ఎస్జీటీల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 


ఈరోజే రిలీవ్‌ చేశాం : వెంకటేశ్వర్లు, డీఎస్‌వో

ప్రభుత్వ ఆదేశాలమేరకు నల్లగొండజిల్లా నుంచి ఇతర జిల్లాలకు సర్దుబాటు అయిన ఉద్యోగులను ఈ నెల 20వ తేదీన రిలీవ్‌ చేశాం. ఈ నెల 21న కొత్త జిల్లాల్లో సంబంధిత ఉద్యోగులు రిపోర్టు చేయాల్సి ఉంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని నేడు ఇక్కడ జాయిన్‌ చేసుకుంటాం.


సీనియర్లకు లాభం:  మురళీ మోహన్‌రెడ్డి, టీచర్‌ 

స్థానికత అనేది ఏ జిల్లాలో ఏడో తరగతి వరకు చదువుకున్నారనే దానిపై నిర్ణయించాలి. సర్వీసు సీనియారిటీకి ప్రాధాన్యమంటే ఇక స్థానికతకు స్థానం ఎక్కడుంటుంది. ఈ కేటాయింపులు సీనియర్లకే ఉపయోగం. భార్య,భర్తలు ఉద్యోగస్తులు అయితే, ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేసే పరిస్థితులు లేవు. స్కూల్‌ అసిస్టెంట్‌ను జోనల్‌ క్యాడర్‌గా గుర్తిస్తే ఎప్పుడైనా సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది. 


Updated Date - 2021-12-22T07:08:05+05:30 IST