వాషింగ్టన్‌లో అంబరాన్నంటిన ‘ఆటా’ వేడుకలు..!

ABN , First Publish Date - 2022-07-04T02:38:34+05:30 IST

వాషింగ్టన్ డీసీలో 2022 ఆటా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

వాషింగ్టన్‌లో అంబరాన్నంటిన ‘ఆటా’ వేడుకలు..!
‘ఆటా’ వేడుకలలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ కవిత

ఆటా వేడుకలలో కేసీఆర్, జగన్‌కు అనుకూలంగా నినాదాలు

అమెరికాలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత

వాషింగ్టన్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ: వాషింగ్టన్ డీసీలో 2022 ఆటా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుండి వై.ఎస్. అభిమానులు, వైకాపా అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ ఎం.వీ.వీ.సత్యనారాయణ, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాఘవరెడ్డి, నారమల్లి పద్మజారెడ్డి, అళ్ల రామిరెడ్డి, వెరోనికా రెడ్డి, మేడపాటి వెంకట్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 


‘ఆటా’ రెండోరోజు సాయంత్రం విశేషాలు

17వ ఆటా మహాసభల రెండోరోజు సాయంకాల కార్యక్రమానికి ప్రవాస అతిథులు భారీగా తరలివచ్చారు. సాయంకాల కార్యక్రమాన్ని కామినేని ఉపాసన తన ప్రసంగంతో ప్రారంభించారు. జన్మభూమి అభివృద్ధిలో, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం సద్గురు ప్రసంగించారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే నష్టాలను నిర్వహించడానికి మట్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆటా ఆధ్వర్యంలో డీసీలో ప్రవాస తెలుగువారితో కలిసే అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెరాస ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, సినీతారలు రకుల్, అడివి శేష్, గాయని మంగ్లీ, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. తమన్ సంగీత విభావరి అలరించింది.


ఏపీ-తెలంగాణా పెవిలియన్ల వద్ద నినాదాల జోరు

ఆటా వేడుకల్లో భాగంగా సభా ప్రాంగణంలో ఏపీ-తెలంగాణా ప్రభుత్వాల పెవిలియన్లను ఏర్పాటు చేశారు. ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన వైకాపా ప్రభుత్వ ప్రతినిధులు జై జగన్ నినాదాలు చేశారు. అదే సమయానికి తెలంగాణా పెవిలియన్ సందర్శనకు వచ్చిన కవిత వెంట ఉన్నవారు జై కేసీఆర్ నినాదాలు చేశారు. ఇరు రాష్ట్రాల పెవిలియన్ల వద్ద ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించారు.

         ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - 2022-07-04T02:38:34+05:30 IST