ముగిసిన ఆటా వేడుకలు.. ప్రవాసీలు తెలంగాణ రుణం తీర్చుకోవాలి: కవిత

ABN , First Publish Date - 2022-07-05T13:16:08+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న 17వ ఆటా మహాసభలు సోమవారం ముగిశాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో ఆటా అధ్యక్షుడు బూజాల భువనేష్‌, కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన ఆటా వేడుకలు.. ప్రవాసీలు తెలంగాణ రుణం తీర్చుకోవాలి: కవిత

(వాషింగ్టన్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న 17వ ఆటా మహాసభలు సోమవారం ముగిశాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో ఆటా అధ్యక్షుడు బూజాల భువనేష్‌, కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. త్రిభాషా మహా సహస్రావధాని వద్దిపర్తి అవధానం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అనంతరం వద్దిపర్తిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సత్కరించారు. సయ్యంది పాదం కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి శ్రోతలను అలరించింది. 


అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సన్మానించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ప్రేమ్‌ సాగర్‌ రెడ్డిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కాగా, సొంత గడ్డ రుణం తీర్చుకునేందుకు ప్రవాసీలు సహకారం అందించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ఆటా మహాసభల్లో తొలిసారి తెలంగాణ పెవెలియన్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారిని ఒక్కచోటుకు చేర్చి, పలు అంశాలపై చర్చించేందుకు ఆటా సభలు మంచి అవకాశం అందించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవితను ఎన్నారైలు సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T13:16:08+05:30 IST