ఇష్టానుసారం!

ABN , First Publish Date - 2022-05-07T05:51:18+05:30 IST

ఇష్టానుసారం!

ఇష్టానుసారం!


  • వికారాబాద్‌లో జోరుగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు
  • మునిసిపల్‌ ఆదాయానికి గండి 
  • పట్టించుకోని అధికారులు

వికారాబాద్‌, మే 6: వికారాబాద్‌ పట్టణంలో ఇష్టానుసారం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టుకోవాలంటే మున్సిపాలిటీకి తగిన ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాలి. అలాగే దాన్ని ఎన్ని రోజులు డిస్ల్పే చేయాలో అన్ని రోజులే ఉంచి తీసివేయాలి. కానీ వికారాబాద్‌లో రాజకీయ నాయకులు, కొన్ని యువజన సంఘాలు అనుమతుల్లేకుండా కూడళ్లు, ప్రభుత్వ ఆస్తులకు ఫ్లెక్సీలు, బ్యానర్లను కట్టేసి వదిలేస్తున్నారు. కొన్ని రోజులకు అవి రోడ్డుపై పడి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే రోడ్డుపై చెత్త పేరుకుపోతోంది. 

విద్యుత్‌ స్తంభాలకు వందలాది ఫ్లెక్సీలు

వికారాబాద్‌ రోడ్ల పక్కనున్న కరెంట్‌ స్తంభాలు, చౌరస్తాల్లోని హోర్డింగ్‌లకు భారీ మొత్తంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ, రూరల్‌ రాజకీయ నాయకుల శుభాకాంక్షలు, స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లను పోటాపోటీగా కడుతున్నారు. అయితే ఏ ఫ్లెక్సీకీ మున్సిపల్‌ అనుమతులు లేకపోవడం గమనార్హం. పైగా ఫ్లెక్సీలను తీసి వేయడానికి, రోడ్డుపై ఏర్పడ్డ చెత్తను తొలగించడానికి మున్సిపల్‌ సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు మునిసిపల్‌ కార్మికులతోనే కట్టించడం గమనార్హం.

మున్సిపాలిటీ ఆదాయానికీ బొక్కే!

పట్టణంలో ప్రైవేట్‌ వ్యక్తులు, రాజకీయ పార్టీల నాయకులు ఇష్టానుసారం ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నా మున్సిపాలిటీకి ఎలాంటి ఫీజు చెల్లించడం లేదు. నిజానికి ఫ్లెక్సీకి స్క్వేర్‌ ఫీట్‌ లెక్కన లెక్కగట్టి.. ఏరియాను బట్టి ఫీజు వసూలు చేయాలి. అనుమతి లేకుండా కట్టిన ఫ్లెక్సీలపై అధికారులు పీఎ్‌సలో ఫిర్యాదు చేయాలి. కానీ ఇవేమీ అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ పలుకుబడితో నాయకులు అధికారులను మేనేజ్‌ చేస్తున్నారు. బల్దియాకు ప్రకటనలపై ఆదాయం రావడం లేదు. ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుకు అనుమతులుండాలని అధికారులకు అన్ని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు హుడాహుడిగా బ్యానర్లను తొలగించినట్లు వ్యవహరిస్తున్న వాటిని మళ్లీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అనే విధంగానే మునిసిపల్‌ అధికారుల తీరు కనిపిస్తోంది.

ఇష్టానుసారం ఏర్పాటు చేస్తే చర్యలు

వికారాబాద్‌లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌ల ఏర్పాటు చేస్తే తగిన ఫీజు కట్టి అనుమతులు తీసుకోవాలి. రాజకీయ పార్టీలైనా సరే అనుమతి తీసుకుంటేనే బ్యానర్లు పెట్టుకోవాలి. అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడితే వాటిని వెంటనే తొలగించి సంబంధిత వ్యక్తుల నుంచే ఫైన్‌ వసూలు చేస్తాం. ప్రధాన ప్రదేశాల్లో ప్రకటనలు కూడా బల్దియాకు ఒక ఆదాయ వనరే! 

                                                                 -శరత్‌చంద్ర, కమిషనర్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ

Read more