బడిగంట మోగిన వేళ..!

ABN , First Publish Date - 2022-07-06T07:45:59+05:30 IST

ఈ విద్యాసంవత్సరం మంగళవారంతో మొదలైంది.

బడిగంట మోగిన వేళ..!
బడికి వెళుతున్న విద్యార్థులు

బడి గంట మోగింది. విద్యార్థులు బడిబాట పట్టారు. తొలిరోజు ‘మంగళవారం’ సెంటిమెంటుతో హాజరు గణనీయంగా తగ్గింది. మరోవైపు చాలా పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయి. తొలి రోజున ఓ పాఠశాల వద్ద టెంటుకింద కూర్చుని విద్యార్థులు నిరసన తెలపగా.. మరోచోట బడుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

 

తొలి రోజు హాజరు నామమాత్రం 

‘విద్యా కానుక’ కిట్ల పంపిణీతో సరి


చిత్తూరు (సెంట్రల్‌), జూలై 5: ఈ విద్యాసంవత్సరం మంగళవారంతో మొదలైంది. సెంటిమెంట్‌ కారణంగా తొలిరోజు హాజరు నామమాత్రంగా ఉంది. తొలిరోజు విద్యా కానుక కిట్ల పంపిణీ నేపథ్యంలో కొంత మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందజేశారు. చిత్తూరులోని బీఎస్‌ కన్నన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో పురుషోత్తం అధ్యక్షతన విద్యాకానుక కిట్లు పంపిణీ జరిగింది. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సమగ్రశిక్షా ఏపీసీ వెంకటరమణారెడ్డి, ఎంఈవో సెల్వరాజ్‌, హెచ్‌ఎం తులసీబాబు, సెక్టోరియల్స్‌ అజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో సోమవారమే ప్రైవేటు పాఠశాలలు తెరచుకున్న విషయం తెలిసిందే. 


పూర్తిస్థాయిలో రాని కిట్లు 

జిల్లాలో 2498 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో 1,82,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. బాలికలు 89,266 మంది, 92,872 మంది బాలురు ఉన్నారు. వీరికి విద్యా కానుక కింద మూడు జతల యూనిఫాం, జత బూట్లు, రెండు జతల సాక్సు, టెక్స్ట్‌బుక్స్‌, నోట్‌బుక్స్‌, బెల్టు, బొమ్మలతో కూడిన డిక్షనరీ, బ్యాగును కిట్‌ రూపంలో ఇస్తున్నారు. ఆ ప్రకారం జిల్లాలకు నోట్‌ పుస్తకాలు 9,62,266, బెల్టులు 1,36,560, బ్యాగులు 1,82,138, సాక్స్‌లు 3,46,276, బొమ్మలతో కూడిన డిక్షనరీలు 15,687, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు 19,087, అలాగే 132138 మంది విద్యార్థులకు మూడు జతల యూనిఫాం ఇవ్వాలి. జిల్లాకు వచ్చిన విద్యాకానుక కిట్లలో నోటు పుస్తకాలు మినహా చాలా వస్తువులు ఇంకా రాలేదు. దశలవారీగా వచ్చే కిట్లలోని వస్తువులను ఎప్పటి కప్పుడు అందజేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, తొలి రోజున ఒక్కో పాఠశాలకు 10 నుంచి 15 కిట్లు మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. బయోమెట్రిక్‌ ఆధారంగా విద్యార్థుల వివరాలు నమోదు చేసుకుని ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కిట్లు అందించారు. 


విలీనంపై ఆగ్రహం 

బడికి తాళంవేసి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన 

చెట్లకిందే ఉపాధ్యాయుల పడిగాపులు 


గంగవరం, జూలై 4: ‘నాడు నేడు’ కింద రూ.30 లక్షలతో పాఠశాల భవనాన్ని సుందరీకరించారు. బడి బాగుపడిందని గ్రామస్తులు ఆనందపడే లోపే.. విలీనం పేరిట పక్క గ్రామానికి విద్యార్థులను పంపాలన్నారు. ఈ పరిణామంపై గంగవరం మండలం బండమీద జరావారిపల్లె గ్రామస్తులు ఆగ్రహించారు. తమ గ్రామంలోని బడి వద్ద మంగళవారం విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి పాఠశాల ఎదుటే బైఠాయించి ఉపాధ్యాయులను సైతం లోనికి రాకుండా అడ్డుకున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్‌వాడీ భవనం కూడా ఉంది. వారినీ లోపలకు అనుమతించలేదు. దీంతో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది పాఠశాల ఎదుటే సాయంత్రం వరకు నిరీక్షించారు. తొలిరోజు పాఠశాలలోకి కాలుపెట్టకుండానే వెనుదిరిగారు. కాగా, ధర్నాను ఉద్దేశించి పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. ‘బండమీద జరావారిపల్లె గ్రామం చుట్టూ అటవీ ప్రాంతం ఉంది. నిత్యం ఏనుగుల సంచారంతో పొలాలవద్దకు వెళ్లడానికే పెద్దోళ్లమే భయపడుతుంటాం. ఇలాంటప్పుడు విలీనం పేరుతో గ్రామంలోని 6,7,8 తరగతుల విద్యార్థులను ఉన్నట్టుండి కీలపట్లకు తరలించాలనడం దారుణం. కీలపట్ల హైస్కూల్‌కు వెళ్లాలంటే రెండు కిలోమీటర్లకుపైగా ఉంది. బస్సుసౌకర్యం లేదు. దారిపొడవునా అటవీప్రాంతం, మామిడితోపులు ఉండటంతో ఏ పక్కనుంచి ఏనుగులు, నక్కలు వస్తాయో తెలియదు. అలాగని, రైతులు, వ్యవసాయ కూలీలైన మేము పిల్లలను రోజూ పాఠశాలకు తీసుకెళ్లలేం. ఒంటరిగా పంపే సాహసం కూడా చేయలేం. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఈ విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఆందోళన తీవ్రం చేస్తాం. పిల్లలను పాఠశాలలకు పంపకుండా నిలిపేస్తాం. ప్రాణాలపైకి తెచ్చుకోవడం కన్నా, మా బిడ్డలు మా కళ్ల ముందుంటే సంతోషంగా ఉంటాం’ అంటూ తమ సమస్యను, ఆవేదనను ప్రస్తావించారు. ఇక్కడే పాఠశాల ఉండాలని ఇటీవల తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌కు చెబితే.. అలాగేనని మాటిచ్చినా.. విలీన ఉత్తర్వులు వచ్చాయని వాపోయారు. ఈ ధర్నాలో సర్పంచి చంద్రశేఖర్‌, వేణురెడ్డి,మల్లప్ప, గంగులప్ప, భాస్కర, భార్గవి, సురేఖ, సుబ్బమ్మ, మునెమ్మతోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


పట్టుపట్టి పాఠశాల సాధించారు 

జరావారిపల్లెలోని ప్రాథమికోన్నత పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నాకు టీడీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఈ పాఠశాలను గ్రామస్తులు గతంలో పట్టుపట్టి సాధించుకున్నారని చెప్పారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఇళ్లకు కేటాయించగా, తమకు పట్టాలు వద్దని, పిల్లల భవిష్యత్తుకోసం పాఠశాల మంజూరు చేయాలని కోరారన్నారు. అలా.. ఏర్పాటైన పాఠశాలను, ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరిట 6,7,8 తరగతుల పిల్లలను కీలపట్లకు పంపడం సరికాదన్నారు. అడవి జంతువుల సంచారాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీలకు అతీతంగా గ్రామస్థులకు అండగా నిలబడతామన్నారు. విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని గ్రామస్థులు, విద్యార్థుల మనోభావాలను కాపాడాలని కోరారు. నాయకులు ప్రతా్‌పరెడ్డి, రవి, అరుణ్‌, బాలాజి, అశోక్‌, నాగరాజు, వేణు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


పంచాయతీలో ‘బడి’

పశువుల పాకగా మారిన పాఠశాల ఆవరణ 

గొడుగు‘చింత’లో ఇలా.. 


వెదురుకుప్పం, జూలై 5: వెదురుకుప్పం మండలం గొడుగుచింతలో పాఠశాల భవనం శిథిలమైంది. దీంతో పంచాయతీ కార్యాలయంలో బడి నిర్వహిస్తుండగా.. పాఠశాల ఆవరణ పశువుల పాకగా మారింది. జిల్లాలోని చాలా పాఠశాలల్లో వసతుల్లేక, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో గొడుగుచింత ఒకటి. ఇక్కడ 14 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత విద్యా సంవత్సరమే పంచాయతీ కార్యాలయంలోకి మార్చారు. గతంలో ఉన్న పాఠశాల భవనం మూతపడింది. దీంతో పాఠశాల ఆవరణలో స్థానికులు పశువులను కట్టేసుకుంటున్నారు. అక్కడికి వాటర్‌ ట్యాంకు, తాగునీటి బోరు, వంట గది నిరుపయోగమయ్యాయి. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిపిస్తోంది. పంచాయతీ కార్యాలయానికి చేరిన బడికి కనీసం చిరునామా కూడా లేదు. మధ్యాహ్న భోజనం మాత్రం వంట నిర్వాహకురాలు ఇంటి నుంచి తయారీ చేసి తెచ్చి వడ్డిస్తున్నారు. 



పాఠశాలలో విద్యార్థికి పాముకాటు 

వి.కోట, జూలై 5: వి.కోట మండలం తోటకనుమ పంచాయతీ కస్తూరినగరం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం తరుణ్‌కుమార్‌ (10)ను పాము కాటేసింది. మధ్యాహ్నం తరగతి గదిలోని కిటికీ వద్ద ఉండగా ఈ ఘటన జరిగింది. సహచర విద్యార్థులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆ విద్యార్థిని గడ్డూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ పాఠశాల అధ్వానంగా ఉందని, ప్రహరీ గోడ బీటలు వారడంతో పాము పాఠశాల లోపలకు వచ్చి విద్యార్థిని కాటేసినట్లు గ్రామస్తులు తెలిపారు. 



Updated Date - 2022-07-06T07:45:59+05:30 IST