Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 01:46:44 IST

90 ఏళ్ల వయసులో... పద్మశ్రీ

twitter-iconwatsapp-iconfb-icon
90 ఏళ్ల వయసులో... పద్మశ్రీ

అలనాటి విలక్షణ నటి షావుకారు జానకిని ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. బుధవారం కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు షావుకారు జానకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన జానకి 90 ఏళ్లొచ్చినా ఇంకా నటిస్తూనే ఉన్నారు. నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ, సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి యువతరం హీరోలవరకూ నటించిన నటి షావుకారు జానకి. తొమ్మిది పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమెలో ఆ చలాకి తనం తగ్గలేదు. వయసు తన శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే జానకి దాదాపు 500 చిత్రాల్లో నటించారు. 1932 డిసెంబర్‌ 11న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన జానకి ఏడో తరగతి వర కూ చదువుకున్నారు. సినిమాల్లోకి రాకముందే ఆమెకు వివాహం జరిగింది. ఆమె చెల్లెలు కృష్ణకుమారి. జానకి ‘షావుకారు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత కృష్ణకుమారి కూడా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ‘షావుకారు’ చిత్రంలో నటించే సమయానికి జానకి వయసు 18 ఏళ్లు. ఓ పిల్లకు తల్లి. ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే దర్శక నిర్మాత బి.ఎన్‌. రెడ్డి రికమండేషన్‌ తో షావుకారు చిత్రంలో ఏకంగా హీరోయిన్‌ అవకాశమే ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ఎన్టీఆర్‌ హీరోగా నటింన ఈ చిత్రం విడుదల అయ్యాక షావుకారు జానకి ఇంటి పేరుగా మారింది. ఆమె రెండో చిత్రం ‘ముగ్గురు కొడుకులు’. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు కొడుకు పుట్టాడు. కెరీర్‌ ప్రారంభ దశలో జానకి ఎన్నో కష్టాలు పడ్డారు. కుటుంబం నుంచి ఎవరూ తనని ఎంకరేజ్‌ చేయక పోయినా స్వశక్తితో పైకి ఎదిగారు. తన కష్టాలు ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడేవారు. ఒక దశలో ఏడాదికి 20 చిత్రాల్లో కూడా జానకి నటించిన సందర్భాలు ఉన్నాయి. రంగస్థలంపై కూడా జానకి తన ప్రతిభా పాటవాలు చూపించారు. కె. బాలచందర్‌ ఆధ్వర్యంలో రాగిణి క్రియేషన్స్‌ సంస్థ తమిళంలో కొన్ని నాటకాలు ప్రదర్శించింది. వాటిలో జానకి ప్రధాన పాత్ర పోషించారు.


తెలుగులో ఎన్టీఆర్‌, అక్కినేని, తమిళంలో ఎంజీఆర్‌ ,శివాజీ గణేశన్‌ సరసన జానకి నటించారు. ‘వద్దంటే డబ్బు’, ‘కన్యాశుల్కం’, ‘సొంతం ఊరు’, ‘జయం మనదే’, చిత్రాల్లో ఎన్టీఆర్‌ సరసన, ‘రోజులు మారాయి’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెళ్లు’ లాంటి చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు సరసన అలరించారు. ఇవిగాక ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సంసారం ఒక చదరంగం’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.


ఒకప్పుడు కథానాయికగా వెండితెరను ఏలిన జానకి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు బామ్మగా నటిస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమె నటించిన చిత్రాల్లో ‘సంసారం చదరంగం’ చిత్రం లో చిలకమ్మ పాత్రతో ఆమె నంది అవార్డ్‌ కూడా పొందారు. నటిగానే కాకుండా మంచి వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. రుచికరమైన వంటలు వండడంలో జానకి స్పెషలిస్ట్‌. చెన్నైలో ఓ రెస్టారెంట్‌ను కూడా ఆమె కొంతకాలం నిర్వహించారు.

90 ఏళ్ల వయసులో... పద్మశ్రీ

సినీ రంగానికి చేసిన సేవకు గుర్తింపు ఇది

సినీ రంగానికి తాను చేసిన సేవకు గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చిందని తాను భావిస్తున్నట్టు సీనియర్‌ నటి షావుకారు జానకి అన్నారు. కేంద్రప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పురస్కారాల్లో తమిళనాడు కోటాలో షావుకారు జానకిని ‘పద్మశ్రీ’ వరించింది. ఈ సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ‘‘నేను ఎదురు చూడకుండా, ఆశించకుండా, న్యాయమైన రీతిలో ఈ అవార్డు రావడం చాలా సంతోషం. దేశ గణతంత్ర వేడుకల సమయంలో ఈ అవార్డు ప్రకటించడం గర్వకారణంగా ఉంది. 1949లో సినీ రంగంలోకి అడుగుపెట్టి, అప్పటి నుంచి ఈ రంగానికి సేవ చేస్తున్నాను. దీనికి గుర్తింపుగా అవార్డు వచ్చిందని భావిస్తున్నాను. 90 యేళ్ళ వయస్సులో పద్మశ్రీ రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 

ఆంధ్రజ్యోతి (చెన్నై)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International