ఉప విచారణ కార్యాలయాల వద్ద బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచండి

ABN , First Publish Date - 2021-09-17T07:30:09+05:30 IST

తిరుమలలో ముఖ్యమైన ఉప విచారణ కార్యాలయాల (సబ్‌ ఎంక్వైరీ ఆఫీసులు) వద్ద బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఉప విచారణ కార్యాలయాల వద్ద  బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచండి
అధికారులతో సమీక్షిస్తున్న ఈవో జవహర్‌రెడ్డి

లడ్డూకౌంటర్ల ఫిర్యాదులపై ప్రదర్శనాబోర్డులు ఏర్పాటు చేయండి

అధికారులకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశం 


తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ముఖ్యమైన ఉప విచారణ కార్యాలయాల (సబ్‌ ఎంక్వైరీ ఆఫీసులు) వద్ద బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తద్వారా యాత్రికులు సులభంగా తమకు కేటాయించిన గదుల వద్దకు వెళ్లేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం ఆయన సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. నిరంతరం అందుబాటులో ఉండే అటెండర్లను ఇకపై భక్త సహాయక్‌ అని పిలవాలన్నారు. కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌పై సమీక్షిస్తూ భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కాటేజీల మధ్య చెత్తచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. లడ్డూకౌంటర్ల వద్ద ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు సంబంధిత అధికారుల వివరాలతో ప్రదర్శనాబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని డీపీడబ్ల్యూ స్టోర్‌కు తరలించాలన్నారు. వసతి కల్పన విభాగం, ఆలయంలో షిఫ్టుల వారీగా విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్యపై సమీక్షించారు. అంతకుముందు తిరుమలలో ఈవో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్వీ మ్యూజియం, గోశాల, బాటగంగమ్మ గుడి, ఉద్యోగుల క్వార్టర్స్‌, పోటు కార్మికులు విశ్రాంతి గదులను పరిశీలించారు. మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాధ్‌జెట్టి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T07:30:09+05:30 IST