Huge Chemical Explosion: భారీ అగ్ని ప్రమాదం.. 35 మంది అగ్నికి ఆహుతి.. ఘటన ఎక్కడ జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-05T18:32:56+05:30 IST

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ షిప్పింగ్ కంటైనర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి ఈ ఘటన..

Huge Chemical Explosion: భారీ అగ్ని ప్రమాదం.. 35 మంది అగ్నికి ఆహుతి.. ఘటన ఎక్కడ జరిగిందంటే..

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ షిప్పింగ్ కంటైనర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. చిట్టగాంగ్ జిల్లాలోని సీతకుందా ప్రాంతంలోని డిపోలో జరిగిన ఈ ఘటనలో 450 మంది దాకా గాయపడ్డారు. చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోలీస్ అవుట్‌పోస్ట్ దగ్గర విధులు నిర్వరిస్తున్న పోలీసు అధికారి నురుల్ అలమ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రసాయనాల కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. 9 గంటలకు అంటుకున్న ఈ మంటలు అర్ధరాత్రి సమయానికి పెద్ద ఎత్తున అలుముకుని పేలుడు సంభవించిందని.. ఆ పేలుడు తర్వాత మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయని తెలిపారు.


వైద్యఆరోగ్య శాఖ అధికారి ఇస్లాం మాట్లాడుతూ.. 450 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 19 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఆరు అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉన్నట్లు చిట్టగాంగ్ అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహ్మద్ ఫరూక్ హుస్సేన్ సిక్దార్ తెలిపారు.


 

ఈ ప్రమాదం జరిగిన కంటైనర్ డిపోను మే 2011 నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఘటన జరిగిన ఈ ప్రాంతం చిట్టగాంగ్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిలియన్ డాలర్ల విలువైన గార్మెంట్ ప్రొడక్ట్ ఆ కంటైనర్స్‌లో ఉన్నాయని, విదేశాలకు ఎగుమతి చేసేందుకు డిపోలో ఉంచినట్లు అధికారులు చెప్పారు. అయితే.. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రైవేట్ డిపోలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు ఇతర రసాయనాలు కూడా కొన్ని కంటైనర్స్‌లో ఉన్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో ఈ తరహా అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. 2020లో కూడా ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతానికి పొరుగునే ఉన్న పటేంగా ప్రాంతంలో ఆయిల్ ట్యాంక్ పేలి ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భద్రతా నిబంధనలను గాలికొదిలేయడం వల్లే ఈఈ తరహా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. 2021 జులైలో ఢాకాకు శివారులో ఉన్న ఓ ఫుడ్-ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 54 మంది అగ్నికి ఆహుతయ్యారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ పరిస్థితి మారలేదు. 2020లో కూడా ఢాకా అపార్ట్‌మెంట్ బ్లాక్స్‌లో మంటలు రేగి 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2022-06-05T18:32:56+05:30 IST