పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలకు సిద్ధమన్న ప్రధాని

ABN , First Publish Date - 2021-07-18T21:26:25+05:30 IST

పార్లమెంటులో లేవనెత్తే ప్రతి అంశంపైనా అర్ధవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం..

పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలకు సిద్ధమన్న ప్రధాని

న్యూఢిల్లీ: పార్లమెంటులో లేవనెత్తే ప్రతి అంశంపైనా అర్ధవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ప్రధాని మోదీ ఆదివారంనాడు ఏర్పాటు చేశారు. 33 పార్టీలకు చెందిన 40 మందికి పైగా నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను మీడియాకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. పార్లమెంటులో ఆరోగ్యకరమైన, అర్ధవంతమైన చర్చలు జరుపుదామని, పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా సభలో ప్రస్తావించే ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నట్టు చెప్పారు. ఏయే అంశాలు చర్చించాలనే విషయమై సమావేశంలో పాల్గొన్న నేతలు సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. విపక్ష పార్టీల నుంచి హాజరైన నేతలు సహా ప్రతి ఒక్కరు సూచనలు తమకెంతో విలువైనవని సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నట్టు చెప్పారు.


ప్రధాని అధ్యక్షత వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రహ్లాద్ జోషి, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్, తిరుచ్చి శివ (డీఎంకే), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్‌పీ), సతీష్ మిశ్రా (బీఎస్‌పీ), ఆప్నాదళ్ నేత అనుప్రియ పటేల్, ఎల్‌జేపీ నేత పశుపతి పరస్ తదితరులు పాల్గొన్నారు.



అస్త్రశస్త్రాలతో సిద్ధం..

కాగా, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో వివిధ అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు, ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కరోనా, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు, చైనాతో ప‌రిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌పై కేంద్ర స‌ర్కారుని ప్ర‌శ్నించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంది. సాగుచట్టాలపై రైతుల ఉద్య‌మం, క‌రోనా ప‌రిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు ఈ స‌మావేశాల్లో కీల‌కం కానున్నాయి. అలాగే, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా నిల‌దీసే అవ‌కాశం ఉంది. లోక్‌సభలో 17 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు, 5 బిల్లులకు ఆమోదంపజేసుకునేందుకు, ఇదే సంఖ్యలో రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Updated Date - 2021-07-18T21:26:25+05:30 IST