అర్ధరాత్రి 2:30 గం.కు ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్.. 109 మంది ఎమ్మెల్యేలు మావైపే అని ప్రకటన

ABN , First Publish Date - 2020-07-13T13:35:34+05:30 IST

తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని కాంగ్రెస్

అర్ధరాత్రి 2:30 గం.కు ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్.. 109 మంది ఎమ్మెల్యేలు మావైపే అని ప్రకటన

జైపూర్ : తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని కాంగ్రెస్ ఆదివారం అర్ధరాత్రి ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 2:30 ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాజస్థాన్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయంలో కీలక మలుపు సంభవించిన విషయం తెలిసిందే.


సోనియా, రాహుల్, గెహ్లాట్‌కే తమ మద్దతు ఉంటుందని ఓ లెటర్‌పై 109 మంది ఎమ్మెల్యేలు రాసిచ్చారని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జీ అవినాశ్ పాండే ప్రకటించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు టెలిఫోన్లో సీఎం గెహ్లాట్‌తో సంభాషించారని, సోమవారం ఉదయం వారు కూడా సంతకాలు చేయనున్నారని ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం జరిగే కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ తాము విప్ జారీ చేశామని, సరైన కారణం చూపకుండా గైర్హాజర్ అయిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పాండే తెగేసి చెప్పారు. 


రాజస్థాన్‌లో ఉన్నట్టుండి వివాదం ముదరడంతో, పరిస్థితిని చక్కదిద్దడానికి సీనియర్లైన సూర్జేవాలా, మాకెన్, అవినాశ్ పాండేను హుటాహుటిన రాజస్థాన్ పంపిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-13T13:35:34+05:30 IST