శ్రీవారి సన్నిధిలో అశ్వత్థపూజ

ABN , First Publish Date - 2020-11-25T06:25:25+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలోని వసంతమండపంలో అశ్వత ్థ(రూపవిష్ణు) పూజ, సార్వభౌమవ్రతం శాస్త్రోక్తంగా జరిగాయి.

శ్రీవారి సన్నిధిలో అశ్వత్థపూజ
అశ్వత్థ పూజ చేస్తున్న అర్చకులు

తిరుమల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని వసంతమండపంలో అశ్వత ్థ(రూపవిష్ణు) పూజ, సార్వభౌమవ్రతం శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య జరిగిన ఈ పూజను ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం చేశారు. ఉదయం శ్రీవారి ఉత్సవమూర్తులను వసంతమండపానికి వేంచేపు చేశారు. లక్ష్మీనారాయణుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. వైఖానస ఆగమ సలహాదారుడు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ.. అశ్వత్థవృక్షం (రావి చెట్టు) సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమన్నారు. సంతానం లేనివారు 9 పోగుల తెల్లదారాన్ని ఈ వృక్షానికి చుట్టి సాష్టాంగ ప్రణామంచేస్తే 9 మాసాల్లో సంతానం కలుగుతుందన్నారు. అశ్వత్థ వృక్షం కింద రామాయణం, భగవద్గీత లాంటి గ్రంథాల పారాయణం చేస్తే నాలుగు వేదాల పారాయణ ఫలితం లభిస్తుందన్నారు. శ్రీమన్నారాయణుడికి, అశ్వత్థ వృక్షానికి చతుర్వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సార్వభౌమ వ్రతం నిర్వహించడం ద్వారా వ్యాధి బాధలు తొలగుతాయన్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేశారు. అనంతరం అశ్వత్థవృక్షానికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. క్షమా ప్రార్థన, మంగళంతో పూజ ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-25T06:25:25+05:30 IST