75th Independence Day: భారత్‌కు అంతరిక్షం నుంచి శుభాకాంక్షలు చెప్పిన సమంత

ABN , First Publish Date - 2022-08-13T17:33:21+05:30 IST

స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల సందర్భంగా అంతరిక్షం

75th Independence Day: భారత్‌కు అంతరిక్షం నుంచి శుభాకాంక్షలు చెప్పిన సమంత

న్యూఢిల్లీ : స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల సందర్భంగా అంతరిక్షం నుంచి శుభాకాంక్షల సందేశం వచ్చింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న భారత దేశానికి వ్యోమగామి సమంత క్రిస్టోఫొరెట్టి (Samantha Cristoforetti) అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతర్జాతీయ రోదసి కేంద్రం (International Space Station)లో పని చేస్తున్నారు. 


సమంత క్రిస్టోఫొరెట్టి ఓ వీడియో సందేశంలో భారత దేశానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో భారత దేశాన్ని అభినందించడం హర్షణీయమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు చాలా దశాబ్దాలుగా అనేక రోదసి, సైన్స్ మిషన్స్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)తో కలిసి పని చేస్తున్నాయన్నారు. 


ఇస్రో అభివృద్ధిచేస్తున్న రెండు పెద్ద ప్రాజెక్టుల గురించి సమంత ప్రస్తావించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విపత్తులను గుర్తించడానికి దోహదపడే నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్ (NISAR Earth Science Mission)ను అభివృద్ధిపరచడం కోసం ఇస్రో కృషి చేస్తోందన్నారు. నేటికీ సహకారం కొనసాగుతోందని చెప్పారు. 


గగన్‌యాన్ మిషన్‌కు శుభాకాంక్షలు

గగన్‌యాన్ (Gaganyan) ప్రయోగం వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతూ, గగన్‌యాన్‌ కోసం కృషి చేస్తున్న ఇస్రోకు సమంత శుభాకాంక్షలు తెలిపారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర ఏజెన్సీల తరపున శుభాకాంక్షలు చెప్తున్నానని తెలిపారు.  


నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ మిషన్ (NISAR)ను భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. 


Updated Date - 2022-08-13T17:33:21+05:30 IST