45 నిమిషాలకో సూర్యోదయం.. భలే అద్భుతం.. భారత సంతతి వ్యోమగామి అనుభవం ఇది..!

ABN , First Publish Date - 2022-01-30T22:48:59+05:30 IST

అందరూ కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వారు అరుదుగా మాత్రమే ఉంటారు. అటువంటి విలక్షణ వ్యక్తుల కోవలోకే వస్తారు.. రాజా జాన్ వుర్పుతూర్ చారి!

45 నిమిషాలకో సూర్యోదయం.. భలే అద్భుతం.. భారత సంతతి వ్యోమగామి అనుభవం ఇది..!

ఇంటర్నెట్ డెస్క్: అందరూ కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వారు అరుదుగా మాత్రమే ఉంటారు. అటువంటి విలక్షణ వ్యక్తుల కోవలోకే వస్తారు.. రాజా జాన్ వుర్పుతూర్ చారి!  మన హైదరాబాద్ మూలాలు కలిగిన చారి.. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో(ఐఎస్ఎస్) స్పేస్ ఎక్స్ క్రూ-3 బృందానికి కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. మనందరం కేవలం ఫొటోల్లో మాత్రమే చూడగలిగే పుడమిని నేరుగా అంతరిక్షం నుంచి చూడగలిగే అద్భుత అవకాశం ఆయనకు లభించింది. 


భూమి చుట్టూ గంటకు 17500 మైళ్ల వేగంతో పరిభ్రమించే ఐఎస్ఎస్.. వ్యోమగాములకు భూమిని ఓ కొత్త కోణంలో పరిచయం చేస్తుంది. సాధారణంగా భూమ్మీదున్న జీవాలు రోజుకు ఒక్కసారి మాత్రమే సూర్యోదయాన్ని చూస్తే.. అంతరిక్ష కేంద్రంలోని వారు మాత్రం 45 నిమిషాలకోసారి సూర్యోదయాన్ని వీక్షిస్తారు. కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించిన భూవాతావరణం.. ఐఎస్ఎస్‌లోని వారికి మాత్రం కేవలం ఓ సన్నటి పొరలాగా కనిపిస్తుంది. ఇటువంటి అద్భుత దృశ్యాల్ని వీక్షించే అవకాశం రాజా చారికి దక్కింది. ఓ రోజులో ఎన్నో మార్లు సూర్యోదయ సూర్యాస్తమయాలు చూస్తామని చారి తెలిపారు. 


1977లో అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, మిల్వాకీ నగరంలో చారీ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పెగ్గీ ఎగ్‌బర్ట్, శ్రీనివాస్. వీ. చారి. శ్రీనివాస్ చారి మన తెలంగాణా వారే. 1995లో హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్న రాజా చారి ఆ తరువాత.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత.. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా సేవలందించిన ఆయన 2017లో అమెరికా అంతరిక్ష సంస్థ(NASA)లో వ్యోమగామిగా తన ప్రయాణం ప్రారంభించారు. ప్రస్తుతం.. అంతరిక్షంలోని ప్రత్యేక పరిస్థితులు.. మొక్కల పెరుగుదలపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు ఉద్దేశించిన ప్రయోగాల్లో భాగస్వామిగా ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిస్థితులు ఎంతో విచిత్రంగా ఉంటాయి. భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) లేని ఐఎస్ఎస్‌లో  గోడలు, సీలింగ్‌పై కూడా నడవడం వింతగా ఉంటుందని, అక్కడ అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 


ఇష్టమైన పనిలో ఎటువంటి సంకోచాలు లేకుండా ముందడుగు వేయాలని యువతకు సూచించే చారి.. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టబోయే మిషన్లతో భారత యువతకూ అంతరిక్షం మరింత చేరువ కానుందని, తమ కలలను నిజం చేసుకునే అవకాశాలు లభించనున్నాయని చెప్పుకొచ్చారు. అన్నట్టు.. చారి ఇప్పటివరకూ మూడు సార్లు హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ ట్యాంక్ బండ్‌ను సందర్శించడం, బంధువుల సహాయంతో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయడం వంటి వాటి గురించి ఆయన తరచూ గుర్తు చేసుకుంటారు. 

Updated Date - 2022-01-30T22:48:59+05:30 IST