రోజంతా హైరానా

ABN , First Publish Date - 2021-04-08T06:27:49+05:30 IST

ఎన్నికలంటే సహజంగా బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్‌ ఉంటుంది. నామినేషన్‌ వేసింది మొదలు కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి ఫలితం వచ్చేవరకు వారి హైరానా అంతా ఇంతా కాదు.

రోజంతా హైరానా
రాత్రి వేళ పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్తున్న సిబ్బంది

ఉదయం నుంచి ఉద్యోగుల్లో ఉత్కంఠ

మండల కార్యాలయాల వద్ద పడిగాపులు

కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు

దూరప్రాంతాలకు విధులకు వెళ్లే సిబ్బంది అగచాట్లు 

ఎట్టకేలకు సాయంత్రానికి కోర్టు తీర్పుతో గ్రామాలకు పరుగు

ఒంగోలు(జడ్పీ), ఏప్రిల్‌ 7: ఎన్నికలంటే సహజంగా బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్‌ ఉంటుంది. నామినేషన్‌ వేసింది మొదలు కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి ఫలితం వచ్చేవరకు వారి హైరానా అంతా ఇంతా కాదు. కానీ ఈ దఫా అలాంటి పరిస్థితి లేదు. ఏకగ్రీవాల సంఖ్య అధికంగా ఉండటం ఒక కారణం కాగా, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ   తీసుకున్న బహిష్కరణ నిర్ణయం మరో కారణం. దీంతో ఎన్నికల సందడి కానీ, ఆ టెన్షన్‌ వాతావరణం కానీ పల్లెపోరులో కనిపించలేదు. కానీ ఆ ఒత్తిడికి అధికారులు గురయ్యారు. అభ్యర్థులు  పడే టెన్షన్‌ను తొలిసారిగా ఉద్యోగులు ఎదుర్కొన్నారు. ఎన్నికల విధులకు తాము వెళ్లాలా?.??  వద్దా? అన్నదానిపై కేవలం పోలింగ్‌కు కొన్నిగంటల ముందే వారికి స్పష్టత రావడం బహుశా ఇంతకు ముందెన్నడూ జరగని పరిణామం. మంగళవారం సాయంత్రం సింగిల్‌ బెంచ్‌ కోర్టు తీర్పు ఇచ్చింది మొదలు బుధవారం మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ డివిజన్‌ బెంచ్‌ తీర్పు  వెలువరించే వరకూ వారి టెన్షన్‌ కౌంటింగ్‌ కేంద్రాల్లో అభ్యర్థులను తలపించింది. బుధవార ఉదయమే పోలింగ్‌ సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలబాట పట్టాల్సిన సిబ్బంది మధ్యాహ్నం వరకూ ఎంపీడీవో కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఒకవైపు సమయం మించిపోతుండటం, మరోవైపు డివిజన్‌ బెంచ్‌ తీర్పును మధ్యాహ్నం చెప్పనుందని సమాచారంతో వారి ఒత్తిడి తారస్థాయికి చేరింది. మండల కేంద్రాల నుంచి దూరంగా ఉన్న గ్రామాలకు డ్యూటీలు పడ్డ సిబ్బంది ఈ జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.  అధికారులు మాత్రం  కోర్టు తీర్పు తర్వాతే పోలింగ్‌ సరంజామా అందించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి సిబ్బంది ఒత్తిడిని కూడా భరిస్తూ మండలకేంద్రాల్లో గడిపారు. చివరికి మధ్యాహ్నానికి కోర్టు తీర్పు ఎన్నికలు జరపడానికి అనుకూలంగా రావడంతో వెంటనే సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.


దూరప్రాంతాలకు విధులకు వెళ్లే సిబ్బందికి అగచాట్లు

మండల కేంద్రం నుంచి దూరంగా ఉన్న గ్రామాలకు విధులకు వెళ్లే సిబ్బంది కొంతమేర అసౌకర్యాన్ని గురయ్యారు. అయితే అధికారులు పోలింగ్‌ మెటీరియల్‌ అందించేటప్పుడు తొలుత దూరంగా ఉండే గ్రామాల్లో డ్యూటీలు పడ్డ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వడం కొంతమేర ఉపశమనం ఇచ్చింది.  


Updated Date - 2021-04-08T06:27:49+05:30 IST