ఆస్థానాకు అందలం

ABN , First Publish Date - 2021-07-30T10:13:47+05:30 IST

ఢిల్లీపోలీసు కమిషనర్‌గా రాకేశ్‌ ఆస్థానా నియామకంమీద కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది...

ఆస్థానాకు అందలం

ఢిల్లీపోలీసు కమిషనర్‌గా రాకేశ్‌ ఆస్థానా నియామకంమీద కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. మరో నాలుగురోజుల్లో రిటైర్‌ కాబోతున్న ఈ వివాదాస్పద పోలీసు అధికారి పదవీకాలాన్ని ఏడాది పొడిగించి మరీ తమ నెత్తిన కూచోబెడితే కేజ్రీమాత్రం ఎలా సహిస్తారు? గురువారం ఢిల్లీ శాసనసభ సమావేశాల్లో ఆప్‌ ఎమ్మెల్యేలంతా రాకేశ్‌ రాకమీద ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ గుజరాత్‌ కేడర్‌ అధికారిని ఢిల్లీ పోలీస్‌బాస్‌గా నియమించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదనీ, ఆప్‌ నేతలను రాచిరంపానపెట్టడమే లక్ష్యంగా మోదీ అమిత్‌షాలు ఆఖరు నిముషంలో ఈ కుట్ర చేశారని కేజ్రీవాల్‌ పార్టీ ఆరోపణ. సుప్రీంకోర్టు గత ఆదేశాలకు, ప్రతిపాదించిన విలువలకు పూర్తి భిన్నంగా జరిగిన ఈ నియామకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించబోదనీ, వెంటనే నియామకాన్ని ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ ఏకకంఠంతో తీర్మానించింది. 


గుజరాత్‌ కేడర్‌ అధికారిని ఢిల్లీలో నియమించడానికి వీలుగా ఆయన కేడర్‌ను కూడా మార్చేసింది మోదీ ప్రభుత్వం. మీ మనిషి కావడంతో నిబంధనలకూ పాతరేస్తారా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ పదవి దక్కబోతున్నట్టు ఆయనకు ముందే తెలుసా అన్నట్టుగానే విలేకరుల ప్రశ్నకు ఆస్థానా సమాధానం కూడా ఉంది. ప్రస్తుతం సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) డైరక్టర్‌ జనరల్‌గా ఉన్న ఈ ఐపీఎస్‌ అధికారి ఈనెల 31న రిటైర్‌కాబోతున్న తరుణంలో, పదవీకాలాన్ని ఏడాది పొడిగించి మరీ కేంద్రం ఆయనను కొత్త కుర్చీలో కూచోబెట్టడం సహజంగానే వివాదానికి కారణమైంది. గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఆయన గోధ్రా ఘటన దర్యాప్తుతోపాటు అనేక అద్భుతాలు చేశారనీ, ఢిల్లీ పోలీసు బాస్‌గా ఆయన అర్హుడని బీజేపీ వెనకేసుకొస్తోంది. కానీ, సీబీఐ స్పెషల్‌ డైరక్టర్‌గా ఉంటూ డైరక్టర్‌తో ఉద్దేశపూర్వకంగా ఘర్షణపడినందున గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఆ సంస్థ పరువు పోయిన విషయం తెలిసిందే. అలోక్‌–ఆస్థానాల మధ్య వివాదాన్ని ఎంతోకాలం రగలనిచ్చిన కేంద్రం కీలకమైన సమయంలో ఇద్దరినీ తప్పించింది. ఇరువురి ఘర్షణ వెనుక అసలు లక్ష్యం అలోక్‌వర్మను సాగనంపడమేనని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. మోదీ ప్రభుత్వం కొత్తగా తిరగరాసిన రాఫెల్‌ కొనుగోలు ఒప్పందం మీద యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరీ, ప్రశాంత్‌భూషణ్‌లు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడంతో పాటే సీబీఐకూ క్రిమినల్‌ కంప్లయిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అలోక్‌వర్మ ఆ ఫిర్యాదును స్వీకరించడమే కాక, వీరు ఆధారంగా సమర్పించిన డాక్యుమెంట్లు అసలైనవో కావో నిర్థారించవలసిందిగా రక్షణశాఖను కోరారు. రాఫెల్‌ రహస్యాన్ని ఛేదించే ఆలోచనలో అలోక్‌ ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఓ అర్థరాత్రి ఈ ఉన్నతాధికారులిద్దరినీ తప్పించడం, సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ఎవరో ఇంటలిజెన్స్‌ అధికారులు సంపూర్ణంగా గాలించడం, తాళం వేయడం ఇత్యాది పరిణామాలు తెలిసినవే. ఆస్థానా మీద అలోక్‌వర్మ అవినీతి కేసు పెట్టి దర్యాప్తునిమిత్తం నియమించిన అధికారులను సైతం ఆ తరువాత పక్కకు తప్పించడం, చివరకు సీబీఐ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం తెలిసివే. 


ఢిల్లీ పోలీసుబాసుగా ఆస్థానా నియామకం తరువాత సామాజిక మాధ్యమాల్లో అనేకమంది గతాన్ని నెమరేసుకుంటున్నారు. సీబీఐ చీఫ్‌ కావాలన్న ఆయన కల నిజం చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ తరువాత గట్టిగానే ప్రయత్నించింది. కానీ, పదవీ విరమణకు ముందు కనీసం ఆర్నెల్లు సర్వీస్‌ ఉన్నవారి అభ్యర్థిత్వాన్నే పరిశీలించాలన్న సుప్రీంకోర్టు శాసనాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీరమణ గుర్తుచేయడంతో అది సాధ్యం కాలేదు. ఢిల్లీలో ఒకపక్క సుదీర్ఘకాలంగా సాగుతున్న రైతు ఉద్యమం మరెన్ని మలుపులు తిరుగుతుందో తెలియని స్థితి ఉండగా, మరోపక్క గత ఏడాది జరిగిన ఉద్రిక్త ఘటనలపై దర్యాప్తు కూడా ముగింపుదశకు వచ్చింది. ఆస్థానా నియామకం వెనుక కంటికి కనబడని లక్ష్యాలు మరిన్ని ఉన్నాయని విపక్షాల అనుమానం.

Updated Date - 2021-07-30T10:13:47+05:30 IST