మద్దతు ధరలే రైతులకు భరోసా

ABN , First Publish Date - 2022-01-11T06:09:19+05:30 IST

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య - పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ధరలు లభించకపోవడం. చాలా సార్లు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్‌ఎస్‌పి) కూడా అందడం లేదు, గ్రామాలలో నేరుగా రైతుల నుంచి వ్యాపారులు పంటలను కొనుగోలు చేస్తారు...

మద్దతు ధరలే రైతులకు భరోసా

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య - పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ధరలు లభించకపోవడం. చాలా సార్లు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్‌ఎస్‌పి) కూడా అందడం లేదు, గ్రామాలలో నేరుగా రైతుల నుంచి వ్యాపారులు పంటలను కొనుగోలు చేస్తారు. ఆ సందర్భంలోనే కాకుండా, ప్రభుత్వ మార్కెట్ యార్డులకు పంటను తెచ్చినప్పుడు కూడా సరైన నాణ్యత, తేమ శాతం లేదనే పేరుతో వ్యాపారులు, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు నిజాయితీగా చేపడితే ఈ సమస్యను ఒక మేరకు పరిష్కరించవచ్చు.


రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం వ్యవసాయ మార్కెట్లు, ధరలు అనే అంశం రాష్ట్రాల జాబితాలో ఉంది. కనుక రైతులకు కనీస మద్దతు ధర లభించేలా అవసరమైన చర్యలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రైతు ఉద్యమం డిమాండ్ చేస్తున్నట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే మోడల్ చట్టం నొకదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. అప్పుడు ఆయా రాష్ట్రాలు తమ ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆ చట్టాన్ని మెరుగుపరచుకుంటాయి. జాతీయ స్థాయిలో చట్టాన్ని ఆమోదించకుండా, కేవలం ఒకే రాష్ట్రం నిర్ణయించుకుని, ఆ రాష్ట్ర రైతులు పండించే పంటలకు ఎం‌ఎస్‌పి ఇవ్వాలనుకున్నా ఆచరణలో సాధ్యం కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం మోడల్ చట్టాన్ని తీసుకువచ్చే లోగా తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రయత్నాలు సీరియస్‌గా చేయవచ్చు.


వ్యవసాయరంగంలో పంటల ఉత్పత్తి ఎంత ప్రాధాన్యం కలిగిన అంశమో, ఆయా పంటల నమోదు, పంటల మార్కెటింగ్ (సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, బల్క్, రిటైల్ మార్కెటింగ్)కు ఏర్పాట్లు, రైతులకు కనీస మద్దతు ధరలు అందడం అంతే ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలి. అందుకు అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించలేని పరిస్థితులలో, ఆయా పంటలకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలి. రాష్ట్ర బడ్జెట్ నిధుల నుంచి లేదా కేంద్రం ప్రకటించిన పంటల మద్దతు ధరల పథకం ద్వారా నేరుగా రైతులకు ఆ బోనస్ మొత్తాన్ని చెల్లించాలి. ప్రభుత్వం పంటల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మొత్తం వ్యవసాయ పంటల సేకరణలో ఉన్న ప్రైవేట్ వ్యాపారులను రిజిస్టర్ చేయాలి. వారి మార్కెటింగ్ లావాదేవీలను పర్యవేక్షించాలి.


రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు కార్పొరేషన్ భాగస్వామ్యంతో వివిధ ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాలను పంటల సేకరణలో భాగస్వాములను చేయాలి. మొత్తం పంటల సేకరణ వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా డిజిటల్ పద్ధతిలోనే మొత్తం లావాదేవీలను నిర్వహించాలి. లోపాలు, తప్పులు, అవకతవకలు ఏ దశలో కనపడినా ఆయా స్థాయి ప్రభుత్వ అధికారులను నేరుగా బాధ్యులను చేయాలి. తప్పుల స్థాయిని బట్టి కఠిన శిక్షలు అమలు చేయాలి.


ఈ ప్రక్రియ నిర్వహించడానికి తొలి దశ నుంచి అన్ని విషయాలలోనూ సమగ్ర సమాచారం అవసరముంటుంది. ఈ సమాచారం కూడా సమయానుగుణంగా నిర్దిష్ట కాలపరిమితిలో సేకరించవలసి ఉంటుంది. ఆ సమాచారాన్ని, అవసరమైన అన్ని ప్రభుత్వరంగ ఏజెన్సీలకు అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. గ్రామస్థాయిలో సమాచార సేకరణకు గ్రామ పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా, గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (విఆర్‌ఏ), బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ (బిఓ) వ్యవసాయ విస్తరణ అధికారి (ఎఇఓ) -మెంబర్ సెక్రటరీగా ఒక కమిటీ పని చేయాలి. ఈ కమిటీ గ్రామ పంచాయితీ పరిధిలో భూమి సర్వే నంబర్ల వారీగా పంట సాగు వివరాలను ప్రతి సీజన్‌లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ వివరాల నమోదుకు తగిన ఎక్విప్‌మెంట్ ఈ- టీంకు అందచేయాలి. ఇలా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీచేయడం ఈ -టీం బాధ్యత. ఒకసారి ఎంటర్ చేసిన వివరాలను మార్చేందుకు వీలు లేకుండా కట్టడి చేయాలి. సర్వే నంబర్ల వారీగా కౌలు రైతులతో సహా వాస్తవ సాగుదారులను గుర్తించే బాధ్యత కూడా ఈ గ్రామ స్థాయి కమిటీదే. ఈ సందర్భంగా రాజకీయ నాయకుల, భూయజమానుల ఒత్తిడికి లొంగి వాస్తవ సాగుదారుల వివరాలను తప్పుగా నమోదు చేస్తే, కమిటీ సభ్యులపై చర్యలు చేపట్టాలి.


మండల స్థాయిలో ఏర్పడే కమిటీకి మండల రెవెన్యూ అధికారి కన్వీనర్‌గా, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ సభ్యులుగా, వ్యవసాయ అధికారి (ఏఓ) మెంబర్ సెక్రటరీగా వ్యవహరించాలి. గ్రామస్థాయి కమిటీలు ఇచ్చే నివేదికలను పరిశీలించి ఈ మండల స్థాయి కమిటీ వాస్తవ సాగుదారులకు గుర్తింపు కార్డులు యివ్వాలి. ఈ కమిటీలు అందించే సర్వే నంబర్ల వారీ వాస్తవ సాగుదారుల నివేదిక ప్రభుత్వం అందించే ప్రతి వ్యవసాయ మద్దతు వ్యవస్థకూ ప్రాతిపదికగా ఉండాలి. (రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల సబ్సిడీ పథకాలకు) బ్యాంకులు ఇచ్చే పంట రుణాలకు కూడా ఈ నివేదికలు ప్రామాణికం కావాలి. బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాస్తవ సాగుదారులకు పంట రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం రుణమాఫీ లాంటి పథకాన్ని కూడా ఈ నివేదికల ఆధారంగా వాస్తవ సాగుదారులకే అమలు చేయాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వ్యవసాయ అభివృద్ధి పథకాలకు కూడా ఈ నివేదికలు ప్రామాణికం కావాలి. ప్రస్తుతం వేస్తున్న పంటలకు, తీసుకుంటున్న పంట రుణాలకు, బీమా చేస్తున్న పంటలకు ఏమీ పొంతన ఉండడం లేదు. దానివల్ల ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిని సరిదిద్దడానికి పంటల బీమా పథకాలకు కూడా అధికారుల కమిటీలు ఇచ్చే ఈ వాస్తవ సాగుదారుల నివేదికలే ప్రామాణికం కావాలి.


ఒక ప్రత్యేక సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారుల వివరాలు, పంటల సాగు వివరాలు సమగ్రంగా ఉంటే, పంటల దిగుబడుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. పంటల వారీగా సాగు విస్తీర్ణం, సగటు దిగుబడుల ఆధారంగా మొత్తం పంటల ఉత్పత్తి పరిమాణం తేలుతుంది. కుటుంబ అవసరాలు పోను, ఆయా పంటల వారీగా మార్కెట్ అమ్మకానికి ఎంత పంటవస్తుంది అనేది కూడా తేలుతుంది.


ఈ సందర్భంలో గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఇప్పటికే ఉన్నమౌలిక వసతులను సమర్థంగా వినియోగించుకోవచ్చు. పంట కోత, ఎండబెట్టడం, నిల్వ, రవాణా తదితర విషయాలపై ఒక అంచనాకు వచ్చి గ్రామ పంచాయితీ పరిధిలో అవసరమైన మౌలిక సదుపాయాలను (గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు, కోత మిషన్లు, తేమ యంత్రాలు, వెయింగ్ మిషన్లు, జూట్ సంచులు, శీతల గిడ్డంగులు), హమాలీలను, ఇతర మానవ వనరులను ప్రణాళిక చేసుకోవచ్చు. అకాల వర్షాల నుండి పంటలను కాపాడుకోవడానికి టార్పాలిన్లు లాంటివి సమకూర్చుకోవచ్చు. వ్యాపారులకు, ప్రభుత్వ ఏజెన్సీలకు పంటలను అమ్మడానికి అవసరమైనన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పి‍ఒఎస్) మెషీన్లు సమకూర్చుకోవచ్చు.


రైతులు తాము పంటలను విక్రయించిన సంస్థపై ఏదైనా ఆరోపణ చేస్తే, దానిపై తక్షణ విచారణ చేపట్టాలి. నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆయా సంస్థలు మోసం చేసినట్లు గుర్తిస్తే, ఆయా సంస్థల లైసెన్సులు రద్దు చేయడంతో సహా చర్యలు తీసుకోవాలి. పంటల సేకరణకు నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు రాష్ట్ర స్థాయిలో పంటల వారీగా నిర్ణయించాలి. వాటిని రైతులు, అన్ని సంస్థలు పాటించేటట్లు చూడాలి.


ఇప్పటి వరకూ కనీస మద్దతు ధరలు లేని పంటలకు కూడా, రాష్ట్ర స్థాయిలో ‘వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్’ (CACP) ఏర్పరిచి మద్దతు ధరలను నిర్ణయించాలి. పంటల ఉత్పత్తి ఖర్చుల వివరాలను సేకరించే పద్ధతిని శాస్త్రీయంగా రూపొందించాలి. పంటల ఉత్పత్తి ఖర్చుల సేకరణను, పంటల సేకరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పరచాలి. ఈ కమిషన్‌లో రైతుల ప్రతినిధులను, వివిధ సేకరణ సంస్థల ప్రతినిధులను సభ్యులుగా ఉంచాలి.


2021 యాసంగి పంట సీజన్‌లో కనీస మద్దతు ధరలు ఉన్న అన్ని పంటలకు ఈ ప్రక్రియను అమలు చేయాలి. మద్దతు ధరలు లేని పంటలకు తొలుత ప్రతి జిల్లాలో 5 గ్రామపంచాయితీల పరిధిలో ఈ మొత్తం ప్రక్రియను అమలు చేయాలి. 2022 వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రమంతా దీనిని విస్తరించాలి.


ఇవన్నీ కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రతిపాదనలు మాత్రమే. ఇంతకంటే మెరుగైన ప్రతిపాదనలు కూడా తప్పకుండా ఉండవచ్చు. ప్రభుత్వం రైతులతో, రైతు సంఘాలతో, రైతు సహకార సంఘాలతో, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో చర్చించడం ద్వారా ఆచరణాత్మక పరిష్కారం సాధించవచ్చు.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2022-01-11T06:09:19+05:30 IST