బొమ్మకు భరోసా...ప్రేక్షకుడికి మజా!

ABN , First Publish Date - 2021-01-17T06:18:48+05:30 IST

చిత్రసీమకు భరోసా వచ్చింది. థియేటర్లో బొమ్మ పడింది.ప్రేక్షకులతో పాటు వసూళ్లూ వస్తున్నాయి. ఇక

బొమ్మకు భరోసా...ప్రేక్షకుడికి మజా!

చిత్రసీమకు భరోసా వచ్చింది. థియేటర్లో బొమ్మ పడింది.ప్రేక్షకులతో  పాటు వసూళ్లూ వస్తున్నాయి. ఇక  ప్రేక్షకుడికి మస్తు మజా!వేసవిలో వేడి వేడి వినోదాల విందు వడ్డించడానికి తెలుగు చిత్ర పరిశ్రమ సంతోషంతో సిద్ధమవుతోంది.


తెలుగు చిత్ర పరిశ్రమకు ఈసారి  సంక్రాంతి కొండంత భరోసాను, ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. స్ట్రయిట్‌ తెలుగు చిత్రాలు ‘క్రాక్‌’, ‘రెడ్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ సహా అనువాద చిత్రం ‘మాస్టర్‌’ థియేటర్లలోకి వచ్చాయి. నాలుగు చిత్రాలకూ ఓపెనింగ్స్‌ బావున్నాయి. అనుకోని కారణాల వల్ల ‘క్రాక్‌’ విడుదల ఆలస్యమైనా... తెరపై ఉదయం పడాల్సిన బొమ్మ సాయంత్రానికి పడినా .. థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడిలో ఏమాత్రం మార్పు రాలేదు. పలు ప్రాంతాల్లో సినిమా ఎప్పుడు విడుదలవుతుందాని ప్రేక్షకులు థియేటర్ల దగ్గరే ఎదురుచూశారు. 


కరోనా వల్ల థియేటర్లకు అప్రకటిత సెలవులు రావడంతో ఆ  విరామంలో వినోదం కోసం ప్రత్యామ్నాయ ఓటీటీ వేదికలపై ఓ కన్నేసినా... థియేటర్లు తెరచుకుంటే ప్రేక్షకులు తప్పకుండా  వస్తారని సంక్రాంతి చిత్రాలు మరోసారి నిరూపించాయి.  బొమ్మకు భరోసా రావడంతో మరిన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి శరవేగంతో సిద్ధమవుతున్నాయి. రాబోయే మూడు, నాలుగు నెలల్లో భారీ చిత్రాలతో పాటు నలుగురి నోళ్లలో  నాని జనాల్లో ఆసక్తి కలిగించిన చిన్న చిత్రాలు కూడా  థియేటర్‌ బాట పట్టనున్నాయి. 




జనవరిలో ఇంకేంటి?

ఈ నెల 23న ‘అల్లరి’ నరేశ్‌ ‘బంగారు బుల్లోడు’, దానికి ఓ రోజు ముందు ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’, 29న ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’, యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’... ప్రస్తుతానికి ఈ నెలలో విడుదలకు సిద్ధమైన చిత్రాలివే! నెలాఖరున మరో రెండు మూడు చిన్న చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఫిబ్రవరిలో ప్రేమ వెన్నెల

ఫిబ్రవరిలో థియేటర్లలో ప్రేమ వెన్నెల కాయడం  ఖాయంగా కనిపిస్తోంది. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’ వాటిల్లో ఒకటి.  ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం...’, ‘రంగులద్దుకున్న...’, ‘ధక్‌ ధక్‌...’ పాటల్ని  శ్రోతలు హమ్‌ చేస్తున్నారు. తీరప్రాంత నేపథ్యంలో స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రేమికుల రోజుకు ముందే థియేటర్లలోకి వస్తుందన్నమాట.


ఫిబ్రవరి 5నే ‘జాంబీరెడ్డి’ విడుదల కానుంది. తేజా సజ్జా హీరోగా ‘అ!’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. తొలి తెలుగు జాంబీ మూవీగా ప్రచార చిత్రాలతో ఆకర్షిస్తోంది. తారకరత్న, సురేశ్‌ కొండేటి నటించిన ‘దేవినేని’ని ఫిబ్రవరి తొలి వారంలో విడుదల చేయవచ్చని సమాచారం. 


సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘ఒకే ఒక లోకం...’ గీతంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘శశి’. ఇందులో ఆది సాయికుమార్‌ హీరో. ఇదీ ప్రేమకథా చిత్రమే. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సందీప్‌ కిషన్‌, లావణ్యా త్రిపాఠీ జంటగా నటించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సైతం విడుదల కానుంది. హాకీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.  


ఆర్‌. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతు బంద్‌’ను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లు లభ్యతను బట్టి మరికొన్ని చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.



ఆ వేసవి నుంచి ఈ వేసవికి!

‘వకీల్‌ సాబ్‌’, ‘అరణ్య’, ‘రంగ్‌ దే’, ‘లవ్‌ స్టోరీ’, ‘టక్‌ జగదీష్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’... గతేడాది మార్చికి ముందు ఈ సినిమా చిత్రీకరణలు జోరుగా జరిగాయి. ఇందులో కొన్ని చిత్రాలు వేసవికి రావాలని అనుకున్నాయి. పవన్‌ రీఎంట్రీ సినిమా ‘వకీల్‌ సాబ్‌’ను మే 15న విడుదల చేస్తామని ప్రకటించారు.


‘అరణ్య’ అంతకంటే  ముందు ఏప్రిల్‌ 2న విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లోనే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ను విడుదల చేయాలనుకున్నారు. కానీ, వీటి విడుదలకు  కరోనా అడ్డు పడింది. చిత్రమేమిటంటే అప్పుడు వేసవికి ప్లాన్‌ చేసిన చిత్రాలన్నీ సంవత్సరం లేటుగా  ఈ వేసవికి వస్తుండటం!



అక్కినేని కజిన్స్‌... సమ్మర్‌ స్పెషల్స్‌!

వేసవికి అక్కినేని యువ హీరోలు నాగచైతన్య, అఖిల్‌... ఇద్దరూ థియేటర్లలో సందడి చేయనున్నారు. ముందుగా నాగచైతన్య వస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘లవ్‌ స్టోరీ’ మార్చి 26న విడుదల కానుంది. నాగచైతన్య కజిన్‌ రానా నటించిన ‘అరణ్య’ సైతం అదే రోజున విడుదల కానుంది. నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన ‘రంగ్‌ దే’ విడుదల కూడా ఆ రోజేనట! ఏయన్నార్‌ మనవళ్లు సుమంత్‌ నటించిన ‘కపటధారి’, సుశాంత్‌ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ (నో పార్కింగ్‌) సినిమాల విడుదల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఇవి కూడా మార్చిలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. 


వేసవి సీజన్‌ ఈ సినిమాలతో ప్రారంభం కానుంది. అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ వేసవిలో వస్తుందని వెల్లడించారు. ఏప్రిల్‌లో వస్తుందా? లేదంటే మే కు  వెళతారా? అనేది తేలాల్సి ఉంది.  ఏది ఏమైనా... అక్కినేని మనవళ్ల  సినిమాలు ఈ  వేసవిలో విడుదల కానున్నాయి. అందుకని, ఈ సమ్మర్‌ వాళ్లకు చాలా స్పెషల్‌ అని చెప్పాలి. కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’, మరికొన్ని చిన్న చిత్రాలు మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అలాగే గోపీచంద్‌ నటించిన ‘సిటీమార్‌’ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత మరింత వేడి పెంచే చిత్రాలు రానున్నాయి.



వకీల్‌... ఏప్రిల్‌!

పవన్‌ కల్యాణ్‌, మెగా అభిమానులు సహా  తెలుగు,  ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి... ఇది పవన్‌ రీ-ఎంట్రీ సినిమా. మరొకటి... హిందీ హిట్‌ ‘పింక్‌’ రీమేక్‌ కావడం! ఇంకొకటి... సంక్రాంతికి విడుదలైన సినిమా టీజర్‌. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ చేసిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోషిస్తున్నారు.


అయితే... హిందీతో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారని టీజర్‌తో స్పష్టమైంది. ముఖ్యంగా పవన్‌ అభిమానులకు నచ్చే విధంగా యాక్షన్‌ దృశ్యాలకు సినిమాలో చోటు కల్పించారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విధమైన మార్పులు చేశారోనని ఉత్తరాది వాళ్లు, సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వకీల్‌ సాబ్‌’ను ఏప్రిల్‌ 9న విడుదల చేయనున్నారని టాక్‌. ఇంకా నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, సమ్మర్‌కి వస్తున్న సినిమాల్లో సాలిడ్‌ క్రేజ్‌ ఉన్న సినిమాల్లో ఇదొకటని చెప్పవచ్చు.



అబ్బాయ్‌ - బాబాయ్‌ అండ్‌ నాని!

వేసవిలో వస్తున్న మరో మూడు ముఖ్యమైన చిత్రాలు ‘టక్‌ జగదీష్‌’, ‘విరాటపర్వం’, ‘నారప్ప’. ఇందులో రెండు చిత్రాలు అబ్బాయ్‌ రానా, బాబాయ్‌ వెంకటేశ్‌వి కావడం గమనార్హం. ‘నిన్ను కోరి’ విజయం తర్వాత నాని, దర్శకుడు శివ నిర్వాణ చేస్తున్న చిత్రం కావడంతో ‘టక్‌ జగదీష్‌’పై అంచనాలు బావున్నాయి. ఫస్ట్‌ లుక్‌తో నాని  ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వైవిధ్యం చూపించారు.


 ‘నీదీ నాదీ ఒకే కథ’తో ప్రేక్షకులు, విమర్శకులను మెప్పించిన దర్శకుడు వేణు ఊడుగుల. మావోయిస్టు నేపథ్యంలో అతను రూపొందించిన  చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో రానా హీరో. సాయి పల్లవి హీరోయిన్‌. ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మావో నేపథ్యంలోని ఈ సినిమాలో రానా, సాయి పల్లవి మధ్య ప్రేమకథ ఉంది. అటు ఉద్యమం, ఇటు ప్రేమ... దర్శకుడు రెండిటినీ ఎలా చూపించారనే ఆసక్తి జనాల్లో నెలకొంది.


 ఇక, వెంకటేశ్‌ పూర్తి మేకోవర్‌తో చేస్తున్న చిత్రం ‘నారప్ప’. హీరోది ఇద్దరు అబ్బాయిలకు తండ్రి పాత్ర. ఇదీ మూస ధోరణికి భిన్నమైన సినిమా అని చెప్పవచ్చు. సగటు కమర్షియల్‌ చిత్రాలకు భిన్నమైన చిత్రాలను ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 




Updated Date - 2021-01-17T06:18:48+05:30 IST