జన సైనికులకు భరోసాగా..

ABN , First Publish Date - 2022-05-20T05:42:49+05:30 IST

రాజకీయాల్లో మార్పు నినాదంతో ఏర్పడిన జనసేన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాపకింద నీరులా కార్యక్రమాలు చేపడుతోంది. జనసేన కేవలం ఏపీరాష్ట్రానికే పరిమితం కాదని, తెలంగాణలోనూ రాజకీయ బరిలో ఉంటామని చాటేందుకు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం భరోసా యాత్ర నిర్వహించనున్నారు.

జన సైనికులకు భరోసాగా..

ఉమ్మడి జిల్లాలో నేడు పవన్‌ కల్యాణ్‌ పర్యటన

మృతి చెందిన కార్యకర్తలకు చెక్కుల పంపిణీ 

చౌటుప్పల్‌, కోదాడ మండలాల్లో పర్యటన

ఉమ్మడి జిల్లాలో పార్టీ విస్తరణకు ప్రోత్సాహం


నల్లగొండ, మే 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/చౌటుప్పల్‌: రాజకీయాల్లో మార్పు నినాదంతో ఏర్పడిన జనసేన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాపకింద నీరులా కార్యక్రమాలు చేపడుతోంది. జనసేన కేవలం ఏపీరాష్ట్రానికే పరిమితం కాదని, తెలంగాణలోనూ రాజకీయ బరిలో ఉంటామని చాటేందుకు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్తలకు బీమా చెక్కులు అందజేయనున్నారు.


పవన్‌ పర్యటన ఇలా..

పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రారంభమై 12.30గంటలకు చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామానికి చేరుకోనున్నారు. ప్రమా దంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్త కొంగరి సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తదుపరి మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మీదుగా సూర్యాపేట జిల్లా కోదాడకు మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. హుజూర్‌నగర్‌ మండలానికి చెందిన కడియం శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతడి కుటుంబాన్ని కోదాడలో పరామర్శించే ఏర్పాట్లు చేశారు. హుజూర్‌నగర్‌ వరకు వెళ్లాలంటే అభిమానులు, కార్యకర్తల రద్దీ, భద్రత ఏర్పాట్లల్లో ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోదాడ వరకే కార్యక్రమాన్ని పరిమితం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఈ రెండు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పవన్‌ ప్రమాద బీమా చెక్కులను అందించనున్నారు. కాగా, పవన్‌ పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పొడవున పెద్ద సంఖ్యలో కటౌట్లు, జనసేన జెండాలు ఏర్పాటు చేశారు.


చాపకింద నీరులా విస్తరణ

ఉమ్మడి జిల్లాలో జనసేన చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన మేకల సతీ్‌షరెడ్డి అంతర్జాతీయ ఎన్‌ఆర్‌ఐ ఫోరం బాధ్యతలు చూసేవారు. ఆ పార్టీ కనుమరుగవడంతో ఆ తర్వాత పవనిజం ఎన్‌ఆర్‌ఐ విభాగం బాధ్యతలను, ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేశారు. మొత్తం 61 మంది అభ్యర్థులు జనసేన పక్షాన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయగా, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన ఓట్లు వచ్చాయి. 2019లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి మేకల సతీ్‌షరెడ్డి జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా, 11వేల ఓట్లు వచ్చాయి. కొవిడ్‌ సమయంలో జనసేన నాయకులు రెమ్‌డెసివిర్‌ వంటి ఇంజక్షన్లను రూ.3వేలకే జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించిన పోలీస్‌, మెడికల్‌, మీడియా, స్థానిక సంస్థల సిబ్బందికి అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు. అనాథగా మిగిలిన సూర్యాపేట జిల్లా మద్దిరాల మం డలం ముకుందాపురానికి చెందిన ఓ ఆడబిడ్డకు రూ.90వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 15వేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఓ వైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు పార్టీ నిర్మాణం ఎజెండాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-05-20T05:42:49+05:30 IST